నూతన విద్యా విధానం తెరమీదకుతెచ్చిన 5+3+3+4 పద్ధతిని పాఠశాల విద్యలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందా? నూతన విద్యా విధానం సిఫారసులతో విద్యారంగం గట్టెక్కే అవకాశం ఉన్నదా? విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విద్యా విధానంపై చర్చించి, నిర్ణయం తీసుకోకుండా కేంద్రం ఒత్తిడితో ఇంటర్ తరగతులు రద్దు చేయనున్నదా? ఒకవేళ అదే నిజమైతే రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటుచేసి విద్యా విధానంపై సూచన చేయాలని రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు కోరినట్టు? రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్రంలో ఏటా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా ఇంటర్‌తోనే విద్యను ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 3,287 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రైవేట్ కాలేజీలు 1,482 కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు కలిపి మొత్తం 1,805 కాలేజీలు ప్రభుత్వరంగంలో ఉన్నాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 9, 10వ తరగతుల్లో 94 శాతంగా ఉండగా, ఇంటర్‌కు వచ్చేసరికి 76 శాతంగా ఉన్నది.
నూతన విద్యా విధానం ప్రకారం.. జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియట్ తరగతులు రద్దయిపోయి, అంగన్వాడీలో ప్రాథమిక తరగతులను కలిపేస్తే విద్యారంగం స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడున్న అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య కలిసిపోతాయి. 9 , 10వ తరగతులతో కలిపి ఇంటర్మీడియట్ అంటే 11 – 12 తరగతులను కూడా పాఠశాల స్థాయిలోనే నిర్వహించే పద్ధతి వస్తుంది. ప్రస్తుత పాఠశాల విద్యా విధానం కొఠారి కమిషన్ 1966లో చేసిన సిఫారసుల మేరకు నడుస్తున్నది. దీని ప్రకారం.. సెకండరీ విద్య, ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ.. ఇలా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉన్నది. ఈ విధానంలో పాఠశాల విద్య పదవ తరగతికే పరిమితమైపోతుంది. జూనియర్ కళాశాలల పేరుతో ఇంటర్మీడియట్ విద్య 11 ,12వ తరగతుల వరకు ఉంటుంది.
కొత్త విధానంలో పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్య (3-8), సెకండరీ విద్య (9-12)పేరుతో మూడు విభాగాలుగా విద్యా విధానం ఉండబోతున్నది. ఇది అమల్లోకి వస్తే సుమారు ఐదున్నర దశాబ్దాలుగా ఉన్న జూనియర్ కళాశాల వ్యవస్థ, ఇంటర్మీడియట్ బోర్డు రద్దయి పాఠశాల విద్యలో విలీనమవుతాయి. ఎస్ఎస్సీ పరీక్షలు రద్దయి, 12వ తరగతిలో టర్మినల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్ఎస్సీ బోర్డు కూడా రద్దవుతుంది.
విద్యా విధానాన్ని సమగ్రంగా పరిశీలించి, చర్చించి, ఒక సమగ్ర విధానాన్ని సూచించాలని ఒక విద్యా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల కిందట నియమించింది. ఆ కమిషన్ పని ప్రారంభించకుండానే, కమిషన్‌లో ఉండే ముగ్గురు సభ్యుల నియామకం జరగకుండానే కొత్త మార్పులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇదంతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం- 2020 సిఫారసుల మేరకే జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం సిఫారసులను పూర్తిగా ఆమోదించిందా? ఆమోదించచే ముందు అవసరమైన చర్చలు జరిపిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యా విధానాన్ని సమగ్రంగా పరిశీలించి, చర్చించి, ఒక సమగ్ర విధానాన్ని సూచించాలని విద్యా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల కిందట నియమించింది.
ఆ కమిషన్ పని ప్రారంభించకుండానే, కమిషన్‌లో ఉండే ముగ్గురు సభ్యుల నియామకం జరగకుండానే కొత్త మార్పులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం ఏమిటి? ఈ విధానంతో ఇంటర్మీడియట్ స్థాయిలో డ్రాపౌట్ సమస్య ఎంత మాత్రం సమసిపోదు. పైగా బోధన, విద్యా ప్రమాణాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఉపాధ్యాయుల నియామకాల్లో కూడా నాణ్యత తగ్గడం, విద్యార్థుల మానసిక పరిస్థితిని బట్టి బోధన జరగాల్సిన ప్రక్రియకు ప్రాధాన్యం లేకుండా పోతుంది.
నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానంపై పార్లమెంటులో చర్చించకుండా, ఆమోదించకుండానే దాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇది రాష్ర్టాల హక్కులను హరిస్తూ, కేంద్రీకరణ దిశగా అడుగులు వేయడమే. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం అమలుకు పూనుకోవడం ఫెడరల్ స్వభావానికి విఘాతం కలిగించడమే. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించకుండానే విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని ఎట్లా అంగీకరిస్తున్నది?
విద్యారంగంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఈ విధానం నిరాకరిస్తున్నది. దాని స్థానంలో ప్రతిభ అనే భావనను నూతన విద్యా విధానం ముందుకుతెస్తోంది. పాఠశాలలను మూసివేస్తూ, స్కూల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇంటి నుంచే విద్య, డిజిటల్ విద్య, ఓపెన్ స్కూల్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో పేదలు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పిస్తున్న సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోంది. నూతన విద్యా విధానంలో అందరికీ ఉచిత నిర్బంధ విద్య ప్రస్తావన లేకపోవడం ప్రాథమిక విద్యాహక్కు ఉల్లంఘన అవుతుంది.
పాఠ్యాంశాల తొలగింపు, కేంద్ర ప్రభుత్వ భావజాలానికి అనుగుణంగా సిలబస్ రూపకల్పన, మళ్లీ ప్రాచీన వృత్తులకు సంబంధించిన వృత్తి విద్యలు ప్రవేశపెట్టడం వంటి ఏకపక్ష విధానాలకు కేంద్రం ఊతమిస్తున్నది. పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక విద్యకు అనుసంధానం చేయాలనే సిఫారసు చేసినప్పటికీ ఉపాధ్యాయుల శిక్షణ, నియామకాల గురించిన ప్రస్తావన లేదు. దీనివల్ల పూర్వ ప్రాథమిక విద్యలోకి మార్కెట్ శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. రెగ్యులర్ పోస్టుల్లో ఉపాధ్యాయుల నియామకాలను నూతన విద్యా విధానం నిరాకరిస్తుంది.
కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్ చేసే ప్రస్తావన నూతన విద్యా విధానంలో లేదు. పైగా ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతుల ద్వారా కాకుండా, ప్రతిభ పేరుతో పదోన్నతులకు అవకాశం కల్పిస్తుంది. అక్రిడియేషన్ పద్ధతి ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో విద్యా వ్యాపారీకరణను మరింత పెంచుతుంది.
స్కాలర్షిప్ విధానానికి తిలోదకాలు ఇచ్చి, విద్యా రుణాల ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను అప్పుల ఊబిలోకి నెడుతుంది. విద్యారంగంపై వినియోగించే బడ్జెట్‌ను వృథా ఖర్చుగా భావిస్తూ నిధుల కొరత సాకుతో విద్యారంగం ప్రైవేటీకరణను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నది. విద్య, ఉపాధి అంశాలపై ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి నూతన విద్యా విధానం దోహదం చేస్తున్నది.
55 ఏండ్లుగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య కీలక పాత్ర పోషిస్తూ, ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నది. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. అంతేకాదు, వైద్య, ఇంజినీరింగ్ లాంటి వృత్తి విద్య కోర్సుల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. మన సిలబస్‌కు ఆకర్షితులై వివిధ రాష్ర్టాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వారి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించి, ఇంటర్మీడియట్ విద్యను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని సబ్జెక్టుల అధ్యాపకులను నియమించాలి. తద్వారా తల్లిదండ్రులు, విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. ఆ బాధ్యతను వదిలి, కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోవడం విచారకరం. ఇంటర్మీడియట్ బోర్డును అదుపు చేయకుండా, మొత్తం ఇంటర్మీడియట్ కోర్సునే రద్దు చేస్తామనడం అవివేకమే.
నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసే క్రమంలో రాజీపడకుండా విద్యా సంస్థలను నిర్వహించాలి. విద్యా కమిషన్‌కు ఆ బాధ్యత అప్పగించాలి. తద్వారా రాష్ట్రంలో పటిష్ఠమైన విద్యా విధానాన్ని రూపొందించి, ఇంటర్మీడియట్ విద్యను కాపాడాలి.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)
– కె.వేణుగోపాల్ 98665 14577