HomeOpinionsTelangana Farmers Are In Distress As The Authorities Release The Godavari Waters Flowing Right Before Their Eyes Downstream
అటు పంటతడి.. ఇటు కంటతడి
కళ్లముందే పారుతున్న గోదావరి నీళ్లను పాలకులు దిగువకు వదిలి వేస్తుంటే తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కొరతతో నలిగిపోయిన నేలకు ప్రతి చుక్క నీరు ఎంతో విలువైనది. కాళేశ్వరం లాంటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను వదిలేసి, అనవసరమైన ఊహలు, భయాల చుట్టూ పాలకులు కాలయాపన చేయడం వల్ల అన్నదాతలకు తీరని అన్యాయం జరుగుతున్నది.
కళ్లముందే పారుతున్న గోదావరి నీళ్లను పాలకులు దిగువకు వదిలి వేస్తుంటే తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కొరతతో నలిగిపోయిన నేలకు ప్రతి చుక్క నీరు ఎంతో విలువైనది. కాళేశ్వరం లాంటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను వదిలేసి, అనవసరమైన ఊహలు, భయాల చుట్టూ పాలకులు కాలయాపన చేయడం వల్ల అన్నదాతలకు తీరని అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలంగాణ విశ్రాంత నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, నిపుణులు తప్పుబడుతున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎత్తిపోయాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మొండికేయడం శోచనీయం.
తెలంగాణ ప్రభుత్వం, నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గోదావరి జలాలు మొత్తం దిగువకు వెళ్తున్నాయి. ఈ నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్నది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణకు వినియోగిస్తున్నది. ఇంకా మిగిలిన నీటిని ధవళేశ్వరం బరాజ్ నుంచి డైవర్షన్ చేసి వాడుకుంటున్నది. వాళ్లు వాడుకోగా మిగిలిన నీరు మాత్రమే సముద్రం పాలవుతున్నది. మన గడ్డపై ప్రాజెక్టులు ఉండి, నది నిండుగా ప్రవహిస్తున్నా తెలంగాణ రైతులకు నీరు అందకపోవడం రైతుల్లో, ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే, సహజంగా వస్తున్న నదిని వినియోగించుకొని నీటిని లిఫ్ట్ చేసే సౌకర్యం ఉన్నది.
గోదావరి, ప్రాణహిత నదుల నుంచి మేడిగడ్డ వద్దకు కనీసం 50,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు, నదిలో నీటి మట్టం సహజంగానే +90 నుంచి +91 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. బరాజ్ గేట్లన్నీ తెరిచి ఉంచినా కూడా, ఈ మట్టం వద్ద నీరు కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ చానెల్లోకి సులభంగా ప్రవహిస్తుంది. కాబట్టి మేడిగడ్డ బరాజ్‌పై ఒత్తిడి లేకుండానే పంప్ చేసుకోవచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ నడిపితే వచ్చే వైబ్రేషన్ల వల్ల మేడిగడ్డ బరాజ్ కూలిపోతుందన్న కాంగ్రెస్ నేతల వాదనను విశ్రాంత ఇంజినీర్లు పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. కేవలం తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా తెలంగాణ రైతులు అనుభవించిన వేదనకు ముగింపు పలకడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో కాంగ్రెస్ సర్కార్ పడావు పెట్టడం సరికాదు. వందలాది టీఎంసీల గోదావరి వరద జలాలు కండ్ల ముందే తరలిపోతుంటే, రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. పాలకులు ఊహాజనిత, కుట్ర పూరిత వైఖరితో వ్యవహరించడం తెలంగాణ రైతులకు ద్రోహం చేయడమే అవుతుంది.
ఎల్ నినో లాంటి భయంకరమైన వాతావరణ పరిస్థితిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించకపోతే తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్టే. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోవడాన్ని సాకుగా చూపి ఎగువన ఉన్న అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బరాజ్‌లను కూడా నిరుపయోగంగా వదిలేయడం ఎంతవరకు సమంజసం? ఈ రెండు బరాజ్‌లకు అవసరమైన చిన్నపాటి మరమ్మతులు పూర్తయి, ప్రస్తుతం అవి 100 శాతం నీటిని నిల్వ చేయడానికి, తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు బరాజ్‌లను నింపడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన జలాశయాలను నింపే అద్భుతమైన అవకాశం ఉన్నది.
కానీ, ప్రాథమిక ఇన్‌టేక్ వ్యవస్థను తాకడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తున్నది. మోటార్లు నడిపిస్తే వాటి కంపనాలతో బరాజ్ కుంగిపోతుందని అవాస్తవాన్ని అపోహను ప్రచారం చేస్తున్నది. ఇది పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం. కన్నెపల్లి పంప్ హౌస్ నడిపిస్తే వచ్చే కంపనాల వల్ల మేడిగడ్డ బరాజ్ మరింత కూలిపోతుందనే అధికారుల వాదనను నిపుణులు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. భౌగోళికంగా కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బరాజ్‌కు దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పైగా ఈ రెండింటి పునాదులు ఒకదానికొకటి సంబంధం లేని ‘ఐసోలేటెడ్ ఫౌండేషన్స్’. ఇంత దూరం ఉన్నా పంపుల వల్ల బరాజ్ కూలిపోతుందనడం సాంకేతికంగా అబద్ధం. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చెప్తున్న సాకులు.
రాజకీయ లెక్కలు, బ్యూరోక్రాటిక్ సమస్యలు, పట్టింపులను పక్కనబెట్టి, ఇంజినీరింగ్ ప్రతిభకు పదును పెట్టాల్సిన సమయం ఇది. పనిచేసే స్థితిలో ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఎలాంటి ముప్పు రాకుండానే, ’రన్-ఆఫ్-ది-రివర్’ పద్ధతిలో నీటిని మళ్లించడం ప్రస్తుత సంక్షోభానికి తక్షణ మార్గం. ఉరకలేస్తున్న గోదావరిని తెలంగాణ జలాశయాలకు మళ్లించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. లేదంటే, నది పారినా తాగునీరు, సాగునీరు లేక తెలంగాణ కరువు కాటకాల్లో మునిగిపోతుంది. ఆ పాపం కాంగ్రెస్ పాలకులదే అవుతుంది. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
– (వ్యాసకర్త: తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అధ్యక్షుడు)