Hrithik Roshan | కంగనా రనౌత్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘సారీ హృతిక్’ (Sorry Hrithik) ట్రెండ్‌పై ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించారు. సోషల్ మీడియా సెంటిమెంట్ల ఆధారంగా కాకుండా, వాస్తవాల ఆధారంగా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. ఇటీవల జెన్‌జీ (Gen Z) విద్యార్థి ఆందోళనల తర్వాత కంగనా రనౌత్, పలువురి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ మరియు పాత వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కంగనా రనౌత్‌తో హృతిక్ రోషన్‌కు జరిగిన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2016 నాటి లీగల్ వార్‌ను గుర్తుచేసుకుంటూ నెటిజన్లు “మనం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి అంటూ ‘సారీ హృతిక్’ అనే ట్రెండ్‌ను ట్రెండ్ చేశారు.
ఈ ట్రెండ్ మరింత ఊపందుకోవడానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. కంగనా తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆయన స్పందిస్తూ.. తన స్నేహితులు తనను చిన్ననాటి హృతిక్ రోషన్ లాగా ఉంటానని అన్నారని, అందుకే తనపై కంగనా దాడి చేస్తుంది ఏమోనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెడీ బర్డీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “ప్రపంచం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి” అని ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ కింద హృతిక్ రోషన్ స్వయంగా స్పందిస్తూ.. “నా మిత్రమా, ‘బి’ (B) నచ్చలేదన్న ఒకే ఒక్క కారణంతో ‘ఎ’ (A) వైపు నిలబడటం అనేది మన సమాజాన్ని వేధిస్తున్న పెద్ద వ్యవస్థాలో లోపం” అని హృతిక్ రాసుకొచ్చారు.
సందర్భం సరైనదై, పూర్తిగా వాస్తవాల ఆధారంగా నిరూపితమయ్యే వరకు తాను వేచి చూస్తానని హృతిక్ స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా ట్రెండ్లు లేదా ఇష్టాయిష్టాల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 2016లో కంగనా రనౌత్‌తో జరిగిన వివాదంలో హృతిక్ రోషన్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను స్టాకింగ్, హరాస్ మెంట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన లీగల్ నోటీసులు, పరువు నష్టం దావా వేశారు. ఆ సమయంలో హృతిక్ తన పాస్‌పోర్ట్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విచారణ నిమిత్తం సమర్పించగా, కంగనా తన ల్యాప్‌టాప్, ఐప్యాడ్ నీటిలో తడిచి పాడైపోయాయని సమర్పించలేదు. అనంతరం 2021లో సరైన ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిల్ రిపోర్ట్ సమర్పించారు. ఏది ఏమైనప్పటికీ, సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ కంటే వాస్తవాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని హృతిక్ తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.