తాడ్వాయి, సెప్టెంబర్ 29 : వనదేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల సన్నిధిలో మంగళవారం ప్యారడైజ్ మూవీ టీం సందడి చేసింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నానితోపాటు సంపూర్ణేశ్‌బాబు మేడారం వస్తున్నారన్న సమాచారంతో వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్ల పూజారులతోపాటు దేవాదాయశాఖ అధికారులు వారికి డోలి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. నాని తులాబారం వేసుకుని తల్లులకు 74కిలోల బంగారం(బెల్లం) సమర్పించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెపై నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ప్యారడైజ్ సినిమాలో హీరో నాని తల్లి క్యారెక్టర్‌కి సమ్మక్క పేరు పెట్టామని, సినిమా విడుదలై విజయవంతం కావడంతో ఆ తల్లులకు మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఆదివాసీల కోసం సమ్మక్క దేవత పోరాట పటిమను గుర్తు చేసుకొని ఆ తల్లి పేరును తమ సినిమాలో హీరో నాని తల్లి పాత్రకి పెట్టామని, ఆ తల్లి ఆశీర్వాదంతో సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.