ఎన్నికల్లో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించింది. మే నుంచి ఉద్యోగుల జీతాల నుంచి ఆరోగ్య పథకం పేరుతో 1.5 శాతం డబ్బులు కోత విధిస్తున్నది. కానీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మాత్రం ఇవ్వడంలేదు. జూన్ 2 రోజు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ జూన్ 7న పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. జూన్ 17న 30 మందితో హెల్త్ ట్రస్ట్ నియమించారు. కానీ ఇందులో 3,61,955 మంది పెన్షనర్స్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ముగ్గురిని మాత్రమే నియమించారు. ఇంకా విధి విధానాలు రూపొందించలేదు. నెట్వర్క్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చలు జరుపలేదు. అంటే ఇదంతా ఉద్యోగులను మోసం చేయడమే.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను, సేవలను 4,38,594 మంది ఉద్యోగులు ప్రజలకు అందిస్తున్నారు. అలాగే సుదీర్ఘ కాలం సేవలందించి రిటైరైన 3,61,955 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్లంతా అనారోగ్యానికి, ప్రమాదాలకు గురైనప్పుడు సరైన వైద్యం అందక అలమటిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 943 నెట్వర్క్ దవాఖానల్లో పది హాస్పిటళ్లలో కూడా వైద్యం అందుబాటులో లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం అందకపోవడం అనేది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి, అసమర్థతకు నిదర్శనం. ఉద్యోగుల నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పథకం కోసం చందాలు వసూలు చేస్తున్న ప్రభుత్వం, అవసరమైన సమయంలో వైద్యం పొందేందుకు కనీసం హెల్త్ కార్డు కూడా అందించలేని దుస్థితికి చేరుకోవడం అత్యంత దురదృష్టకరం. ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ముందుగా దవాఖానకు పరుగెత్తుతారు. హాస్పిటల్ వాళ్లు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉందా అని అడుగుతారు. ఉంటే కార్డు చూపించి, నంబర్ చెప్తే చికిత్స ప్రారంభమవుతుంది. కానీ ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్ ఇవ్వలేదు, నెట్వర్క్ హాస్పిటల్లో ఉద్యోగుల డాటా లేదు. వివరాలు కనిపించడం లేదు. పాత వివరాలు మారలేదు. దీంతో దవాఖాన వాళ్లు ఉచిత చికిత్సకు అనుమతించడంలేదు. చివరకు ప్రభుత్వ ఉద్యోగి జేబులోంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది.
ప్రతిరోజూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేది ఉద్యోగులే. పాఠశాలలో ఉపాధ్యాయులు, దవాఖానలో వైద్య సిబ్బంది, కార్యాలయంలో అధికారి, ఉద్యోగి ఇలా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తారు. అలాంటి ఉద్యోగి అనారోగ్యానికి గురైనప్పుడు నీ హెల్త్ కార్డు ఎక్కడ? అని దవాఖానల వాళ్లు ప్రశ్నిస్తే చూపించే పరిస్థితి లేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. పెన్షనర్లు మరింత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాళ్లకు వృద్ధాప్యంలో భరోసా అందకపోవడం చాలా అత్యంత బాధాకరం.
ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఆరోగ్య పథకం కోసం కాంట్రిబ్యూషన్ తీసుకుంటే, దానికి ప్రతిగా సమయానికి, నిరంతరంగా, నగదు రహిత వైద్యం అందించడం చట్టబద్ధమైన బాధ్యత, నైతికత కదా! మరి పాలకులు ఎందుకు నిబంధనలు పాటించడంలేదు? హామీలు ఇవ్వడంలో, జీతంలో నుంచి వాటా కట్ చేసుకోవడంలో, ప్రచారంలో ప్రభుత్వం ముందున్నది. కానీ హెల్త్ కార్డు ఇవ్వడంలో మాత్రం వెనుకబడింది. ఇది కేవలం సాంకేతిక సమస్య అని చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదు. డాటా సమస్య అయితే సరిచేయాలి. సాఫ్ట్వేర్ సమస్య అయితే పరిష్కరించాలి. దవాఖానల బిల్లులు పెండింగ్‌లో ఉంటే చెల్లించాలి. కొత్త కార్డులు ఇవ్వాల్సి ఉంటే వెంటనే ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ ప్రచారాల కంటే ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రతి ఉద్యోగికీ, ప్రతి పెన్షనర్‌కు డిజిటల్ హెల్త్ కార్డు అందించాలి. ఇది ఉద్యోగులకు ప్రభుత్వ చేసే ఉపకారం కాదు, ఉద్యోగుల హక్కు. ఆ హక్కును అమలు చేయాలి. ఆరు డీఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారడం విషాదం. పీఆర్సీ ఊసే లేదు, సీపీఎస్ రద్దుపై అడుగైనా ముందుకు పడలేదు. మరో రెండేండ్ల వరకు పీఆర్సీ ఇచ్చేది లేదని సీఎం బహిరంగంగా ప్రకటించారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ శాలరీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇతర బెనిఫిట్స్ కింద దాదాపు రూ.15,000 కోట్లు నుంచి రావలసి ఉన్నది. కానీ కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. కానీ మొత్తం ఇచ్చేశామని ప్రకటనలు చేయడం విడ్డూరం. ఓ రిటైర్డ్ ఉద్యోగి బెనిఫిట్స్ విడుదల కోసం వెళ్తే కీలకమైన మంత్రి భార్య కమీషన్ అడిగినట్టు వార్తలు వచ్చాయి. వంద మందికి పైగా ఉద్యోగులు మరణించినా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడంలేదు. నిత్యం పెన్షనర్స్ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు పీఆర్సీలు, 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2023 జూలైలో పీఆర్సీ నియమించి 5 శాతం మధ్యంతర భృతి అమలు చేసింది. అధికారంలోకి వస్తే పీఆర్సీ ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారం నుంచి పోయే రోజులు దగ్గరకు వచ్చినా ఉలుకూపలుకూ లేదు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటివరకు పరిశీలన కూడా చేయలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అమానుషం. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించడం చాలా సులభంగా జరిగిపోతున్నది. కానీ ఉద్యోగి చెల్లిస్తున్న డబ్బుకు ప్రతిఫలంగా దవాఖానలలో కనీస వైద్యం అందడం లేదు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 18న తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇవ్వడంతో ఉద్యమ కార్యాచరణ వాయిదా వేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ చేతులో మోసపోయిన సకల జనులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో చేస్తున్నది. ఇప్పుడు సబ్బండ వర్గాలు, ఉద్యోగులు కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.
(రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
దేవీప్రసాద్