కాళేశ్వరంపై కాంగ్రెస్ దర్యాప్తు ముగిసింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డికి, తను నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో అందుకు తగిన ఆధారాలేవీ దొరకనట్టున్నాయి. అందుకే, అవినీతి ఆరోపణలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక సీబీఐ విశ్వసనీయత దెబ్బతిన్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల నేతల పైకి కేంద్రంలోని బీజేపీ ఎగదోస్తుందని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్నారు. కానీ, అదే పార్టీ నుంచి సీఎం అయిన రేవంత్ మాత్రం విచిత్రంగా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుపైన ఉన్న అడ్డంకులను ఎత్తివేశారు. మరి ఆయన బీజేపీతో ఏం ఒప్పందం చేసుకున్నారో ఏమో!
ఘోష్ కమిషన్ నివేదికలో ప్రపంచం బద్దలయ్యే విషయం ఉన్నదని, ప్రజలకు ఆ వాస్తవాలు తెలియాలని, కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెడుతామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి.. ఆ కమిషన్‌పై చర్చను మాత్రం అసెంబ్లీలో అర్ధరాత్రి చేపట్టారు. నిజంగా వారు ఆరోపించినట్టే లక్ష కోట్ల అవినీతి జరిగి ఉంటే, దొంగచాటుగా అర్ధరాత్రి చర్చ ఎందుకు పెట్టారు? అర్ధరాత్రి దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించారు?
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని అహర్నిశలు అడ్డగోలుగా శ్రమిస్తున్న రేవంత్‌రెడ్డి కుట్ర రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ రైతుబంధు. ఆడపిల్లలకు మేనమామ. ముసలివాళ్లకు కొన్న కొడుకు. సబ్బండవర్ణాల సంక్షేమాన్ని కాంక్షించినవాడు. గోదావరి నీళ్లను ఎదురెక్కించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు. కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టినవాడు.
కేసీఆర్ అంటే ఓ ఎమోషన్. అది రాజకీయాలకతీతమైనది. ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడి గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. ఆ ఎమోషన్‌ను అవినీతి బురద జల్లడం ద్వారా తెలంగాణ ప్రజల నుంచి దూరం చేద్దామనుకుంటున్న రేవంత్ కుటిల బుద్ధిని తెలంగాణ సమాజమంతా గుర్తించాలి. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా, తన జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన కేసీఆర్‌కు ఈ కపట నాటకాల వేల తెలంగాణ పారులుగా మనమంతా మద్దతుగా నిలబడాలి. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎన్నికల క్షేత్రంలోనే తిప్పికొట్టాలి. మళ్లీ మన తెలంగాణను బాగుచేసుకోవాలి. ఇదే తక్షణ కర్తవ్యం.
– (వ్యాసకర్త: టీఎస్ రెడ్కో మాజీ చైర్మన్)
వై.సతీష్ రెడ్డి 96414 66666