14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో కేసీఆర్ 2014లో సాధించిన తెలంగాణ సరికొత్త రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్ల అస్తిత్వ పాలనలో స్థిరత్వాన్ని సాధించింది. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ముందున్న తెలంగాణ గత రెండున్నరేండ్లుగా ఆంధ్రా నాయకులకు వంతపాడే ప్రభుత్వ తీరుతో మళ్లీ వెనుక బడుతున్నది. 1956 నుంచి 2014 వరకూ పోరాటమే ఊపిరిగా బతికిన సమాజం, ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణలకు వెనుకాడని వీరత్వం తెలంగాణ సొంతం. ఈ నేలపై రాజకీయార్థిక రంగాల్లో వలస పాలకుల దోపిడీది మొదటిస్థానమైతే, మేధోపర సాంస్కృతిక దోపిడీలో సినిమా రంగానిది రెండోస్థానం. దురదృష్టవశాత్తు నాడు తెలంగాణను కబళించిన ఈ రెండు ప్రధాన రంగాల్లో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ ముమ్మాటికీ ఆంధ్ర పెత్తనానికి చిహ్నమే.
ఇవ్వాళ ఆ చిహ్నమే హైదరాబాద్ నడిమధ్యన కాంగ్రెస్ ప్రభుత్వ అండతో ప్రతిష్ఠమైందంటే, నిజమైన తెలంగాణవాదిగా.. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా మళ్ల్లీ నా కళ్లెదుట నాటి బానిస ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాడు కాళోజీ, జయశంకర్ సార్లు చెప్పినట్టు ‘భౌగోళిక తెలంగాణ సాకారమైనంత మాత్రాన ఉద్యమం పని అయిపోయినట్టు కాదు, వలసవాదులు నిరంతరం చేసే సాంస్కృతిక దాడుల్ని తట్టుకొని మనదైన కాకతీయ, శాతవాహన వారసత్త్వాన్ని పునఃప్రతిష్ఠించుకున్నపుడే తెలంగాణ ఉద్యమ అంతిమ లక్ష్యం నెరవేరినట్టు’ అనే మాటలు యాదికొస్తున్నాయి.
ఎన్టీఆర్ సినీ హీరోగా అతని ఇమేజీ ఆకాశమంత ఎత్తు అని కొందరు అనవచ్చు, అయితే ఇంట గెలిచి, రచ్చ గెలవాలనేది నానుడి. ఆ ప్రకారం 1996లో దయనీయమైన మరణం సంభవించిన వ్యక్తి కూడా ఎన్టీఆరే అనేది చరిత్ర చెప్పిన సత్యం. దానికి కారణం కూడా దాచిందేమీ కాదు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చిన ఘనుడని ఎవరైతే కొలిచారో..వాళ్లే 1984 ఆగస్టు సంక్షోభాన్ని సృష్టించారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కిన ఎన్టీఆర్ ఎలాగోలా నాడు అధికారాన్ని చేజిక్కించుకున్నా…ఆ తర్వాత 1995 ఆగస్టు సంక్షోభాన్ని మాత్రం తప్పించుకోలేకపోయారు. ఇది బయట వ్యక్తులు చేసింది కాదు..సొంత అల్లుళ్ల్లు, కొడుకులు, బిడ్డల చేతిలో ఆ దారుణ పరాభవం జరిగింది. మొదటి ఆగస్టు సంక్షోభానికి నాదెండ్ల భాస్కర్‌రావును నిందించే ఎన్టీఆర్ వీరాభిమానులు, రెండో సంక్షోభాన్ని మాత్రం స్వయంకృతాపరాధం అని, ఇప్పటికీ ఎన్టీఆర్‌దే తప్పు అని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు తాజాగా హైదరాబాద్ అమీర్‌పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన తీరు ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.
అభిమానుల అంశం ఆయన వ్యక్తిగతమో, తెలంగాణకు సంబంధం లేని పార్టీ అంశంగా తీసుకున్నా.. సినిమాల ద్వారా ఆయన సాగించిన ప్రస్థానంలో తెలంగాణకు జరిగిన న్యాయమేమిటో చెప్పగలరా? దాదాపు ఇదే సమయంలో అగ్రహీరోగా, జానపద వీరగాథల్లో తిరుగులేని హీరోగా పేరుగాంచిన తెలంగాణ నటుడైన కాంతారావును అడ్డుకున్న శక్తేమిటి? కేవలం తెలంగాణకు చెందిన వ్యక్తిగా ఆయనపై ఈ ఆధిపత్య భావజాలం చూపిన వివక్షేమిటి? దాని ఫలితమే కదా… కత్తిపోరాటాల్లో తిరుగులేని వీరుడుగా పేరుగాంచిన కాంతారావు.. తనపై జరుగుతున్న కుట్రలపై పోరాటం చేయలేక అతి సామాన్యుడిగా ఆర్థిక బాధలను అనుభవించారు.
ఇక సినీ ఇండస్ట్రీ వల్లనే నేమూ, ఫేమూ సం పాదించిన ఏ వలస ప్రాంతీయులైనా అదే ఇండస్ట్రీలోని చిన్న విభాగాలను పట్టించుకున్నారా? కానీ తెలంగాణకు చెందిన ప్రభాకర్‌రెడ్డి తన దానగుణంతో ఈ రోజు మహానగరంలో చిత్రపురి కాలనీ పేరిట ఎంతోమం ది సినీకళాకారులు, సాంకేతిక నిపుణులకు గూడు కల్పించారు. ఆయనను, తెలంగాణ అద్భుత ప్రతిభావంతుడైన రాజనాలను కేవలం విలనీకి పరిమితం చేసింది ఎవరు?
1979లో ‘మాభూమి’ వంటి విజయవంతమైన తెలంగాణ నేటివిటీ చిత్రాలొచ్చినా… జానీలివర్, జయరాజ్ లాంటి ప్రతిభావంతులు ఎందుకు తెలుగు సినిమాను వదిలేయాల్సి వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకునే వరకు అంటే దాదాపు 2011 నాటికల్లా తెలంగాణ భాషను ఆంధ్రా సినిమాల్లో విలన్ పాత్రలతో వ్యంగ్యంగా వాడుకోవటం, తెలంగాణ ఆర్టిస్టులను విదూషక పాత్రలకే పరిమితం చేసింది ఎవరు? ఆర్ నారాయణమూర్తి రూపొందించిన ఎర్రసైన్యం, చీమలదండు, దండోరా వంటి విప్లవ చిత్రాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో జైబోలో తెలంగాణ, వీర తెలంగాణ, జై తెలంగాణ, బతుకమ్మ, వీరనారి చాకలి ఐలమ్మ వంటివి రానివ్వటానికి కారణం ఇక్కడి ప్రజల్లో పెరిగిన అస్తిత్వ స్పృహే కదా?
అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అనే సంస్కృతితో తెలంగాణ ఆత్మగౌరవం మీద ఆధిపత్యం చేసిన శక్తులే కదా వీళ్లంతా. తెలంగాణ సినీప్రముఖుల్లో సాహిత్య రంగం మాత్రమే కొంత తెలుగు సినిమాల్లో డామినేట్ చేసింది. నాటి సినారె, దాశరథి వంటివారు మొదలు, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్ లాంటి ఎందరో కళాకారుల వరకూ ఆ ఒరవడి కొనసాగుతున్నది. దీనికి కూడా కారణం లేకపోలేదు. డబ్బులతోనో, కుట్రలతోనో విద్వత్తు రాదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మనవారితో పనిచేయించుకుంటున్నారు. కానీ అవకాశం ఉంటే అక్కడా అణచివేతే ఎదురయ్యేది. ఈ పరిస్థితులే కదా మాలాంటి వారితో 24 క్రాఫ్ట్స్‌లో తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో గల నూతన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో సినిమాలు రూపొందించటానికి కారణమైంది.
ఇతర సినీపెద్దలు చేయలేని పనిని మా ‘బందూక్’ చేసిందని గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే రిలీజ్ అయినప్పుడు ఎంత సక్సెస్ అయిందోనని చెప్పే కంటే ఆ సినిమా ద్వారా మా తెలంగాణ వర్గాలు ఎంతగా లబ్ధిపొందాయనే ఉదాహరణలు మాకు చూపించాయి. అందుకే నా బందూక్ సినిమాతో పరిచయమైన హీరో చైతన్యరావు ఇపుడు మంచి నటుడిగా దూసుకెళ్తున్నారు. ఇదే సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడకండ్ల సక్సెస్‌ను దేశవిదేశాల ప్రాజెక్టులతో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సహజకవి గోరటి వెంకన్న రాసిన ‘పూసిన పున్నమి వెన్నెల’ అనే బ్రీత్లెస్ పాట ప్రపంచవ్యాప్త తెలుగుబిడ్డలను ఉర్రూతలూగిస్తున్నది.
గాయకుడిగా తొలి ప్రయత్నంలోనే సాకేత్ కొమండూరి తన మార్కును చూపించి ఇపుడు వందలాది చిత్రాల్లో గాత్రం అందిస్తున్నారు. అప్పుడప్పుడే సినిమా రంగానికి పరిచయమవుతున్న బిందు, గాయత్రి, సూరి చాప్లిన్, వీరభద్రరావు లాంటి ఎందరో నటీనటులు ఇపుడు చలనచిత్రరంగంలో సుస్థిరమయ్యారు. ఇలా 30 మంది తెలంగాణ ఆర్టిస్టులను కొత్తగా పరిచయం చేసిన ఈ బందూక్ సినిమాలో దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, గాదరి కిశోర్, నారదాసు లక్ష్మణ్, విద్యాసాగర్‌రావు, రమేశ్ హజారి, గుజ్జా యుగంధర్‌రావు, అయాచితం శ్రీధర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శుభప్రద్ పటేల్, ఎన్.శంకర్, రోషం బాలు, సామ వెంకట్‌రెడ్డి, లాంటి ఎంతోమంది ఉద్యమకారులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరే కాకుండా కొత్తగా నలుగురు గీతరచయితలు నేడు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు.
పది, పదిహేనేండ్లుగా అనేక విభాగాల్లో సానబెట్టి, ఏ ఆంధ్రా పెట్టుబడిదారుడు ముందుకు రాకున్నా… తెలంగాణ ఇతివృత్తంగా బందూక్ చిత్రాన్ని రూపొందించటం నా పూర్వజన్మ సుకృతం. నేడు అదే బందూక్ సినిమా పేరు నా ఇంటిపేరుగా మారి బందూక్ లక్ష్మణ్ అనే గుర్తింపును ఇచ్చింది. ఇంతలా తెలంగాణ కోసం తపించాము కాబట్టే ఉద్యమ సమయంలో వలస పాలకులను, పెత్తనాలను ఎదిరిస్తూ ఒక సినిమా తీసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరుణంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆడియో రిలీజై ఓ మైలురాయిగా నిలిచింది.
నాటి ఎన్టీఆర్ హయాం మొదలు 2014దాకా మా భాష, యాసలను వెక్కిరించిన చోటనే ఒక్క తెలంగాణ సినిమా బందూక్కు బీజం పోస్తే సినిమా రంగంలో ఇప్పుడు తెలంగాణ ప్రభావం పెరిగింది. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి లాంటి వందలాది చిత్రాల్లో హీరోలకు, ముఖ్య పాత్రలకు స్థానిక యాసతోనే డైలాగ్‌లు చెప్పించారు. విరాటపర్వం, బలగం, దసరా, రాజు వెడ్స్ రాంబాయి లాంటి ఎన్నో చిత్రాలు నేడు తెలంగాణ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. ఇదంతా కేవలం తెలంగాణ పౌరులకు అస్తిత్వ సృహ, స్వరాష్ట్రం ఇచ్చిన అవకాశాలు మాత్రమే.
వరుసగా మన తెలంగాణ నేటివిటీకి, ఎదుగుదలకు సంబంధం లేని వలస ప్రతీకలైన రోశయ్య, రాజీవ్‌గాంధీ, బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ విగ్రహాల ప్రతిష్ఠాపన, తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తీసేయటం, కాకతీయ కళాతోరణం, చార్మినార్లను కాదని లేపాక్షి నందులను ప్రతిష్ఠించటం వెనుక అసలు కుట్ర ‘జై తెలంగాణ’ అని నినదించే మా సమాజం అస్తిత్వ స్పృహను దూరం చేసి మళ్లీ బానిసలుగా మార్చుకోవాలనే కుట్రలు కనిపిస్తున్నాయి. భావజాల వ్యాప్తిలో సినిమాల పాత్ర పెద్దది కాబట్టే సాంస్కృతిక దాడిని ముందుగా అక్కడ్నుంచి మొదలెట్టారనేది కాదనలేని వాస్తవం. కానీ తెలంగాణ సమాజాన్ని అణచేయాలని చూసిన ప్రతీసారి ఉత్తుంగ తరంగంలా ఎగిసే మా చైతన్యం ఈ కుట్రల్ని తిప్పికొడుతుందనేది అసలైన జై తెలంగాణ.
– (వ్యాసకర్త: ‘బందూక్’ దర్శకుడు, సామాజికవేత్త)
లక్ష్మణ్ మురారిశెట్టి