భూమి పొరల భౌతికస్థితి పట్ల కచ్చితమైన అంచనాలు లేకపోవడంవల్లే ప్రాజెక్టుల ప్రమాదా లు జరుగుతుంటాయి. కానీ పరిష్కారం ఆలో చించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారుపై బురదచల్లడానికే ప్రయత్నిస్తున్నది. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ ప్రత్యేక వ్యాసం
2023, అక్టోబర్ 21 రాత్రి మేడిగడ్డ 7వ బ్లాకులో పియర్స్ కుంగిన ఘటన, గత శనివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ బోర్ యంత్రంపై సీపేజ్ రాకుండా పై భాగంలో కాంక్రీట్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా పైకప్పు కూలి మట్టి, బండరాళ్లు, భారీగా వరద నీరు ఉధృతంగా రావడంతో 8 మంది ప్రమాదంలో చిక్కుకున్న ఘటన రెండూ కూడా ప్రకృతి వైపరీత్యంగానే చూడాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, గత ప్రభుత్వాలదే బాధ్యత అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం కాంగ్రెస్ పాలకులు చేస్తున్నారు.
ఈ దుర్భుద్ధిని మానుకొని ప్రకృతి వైపరీత్యాల వల్ల జననష్టం జరిగిన సందర్భాల్లో సంయమనంతో వ్యవహరిస్తూ ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకొని సమస్యను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలు కనుగొనడానికి పాలకపక్షం ప్రయత్నించాలి. భవిష్యత్తులో ప్రమాదాలు పునరావృతం కాకుండా గుణపాఠాలు తీసుకుంటూ చర్యలు చేపట్టవలసి ఉంటుంది.
ఎస్ఎల్బీసీ దుర్ఘటన బాధాకరం. ప్రపంచంలోనే మునుపెన్నడూ చేపట్టని భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో ప్రపంచంలోనే అత్యంత పొడవైన (43.93 కి.మీ.) సొరంగం తవ్వుతున్నారు. ఈ టన్నెల్ శ్రీశైలం డ్యాంకు 4 కి.మీ. ఎగువన గల రిజర్వాయర్ నుంచి డిండి లోయ దాకా ఉంటుంది. దీని (డయా) 9.2 మీ. ఈ మొత్తం సొరంగం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఉండటం, పైన నల్లమల ఎత్తయిన గుట్టలు విస్తరించి ఉండటంతో మధ్య మధ్యలో మట్టి, రాళ్ళు వెలుపలికి తీయడానికి ‘ఆడిట్’ ఏర్పాట్లకు అవకాశం లేనందున సుమారు 130 మీ.పొడవైన రెండు టన్నెల్ బోర్ మెషిన్స్ (టీబీఎం)ను అమెరికా నుంచి తెప్పించడం జరిగింది.
ఈ యంత్రంతో పనులు కొనసాగించిన అనుభవం మన ఇంజినీర్లకు గతంలో లేదు. వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ తవ్వకాల్లో కూడా టీబీఎంలనే వినియోగించారు. ఈ రెండు టన్నెల్స్ పొడవు 22 కి.మీ, 23 కి.మీ. ఈ రెండు సొరంగాల పైన కూడా నల్లమల టైగర్ రిజర్వ్ పారెస్ట్ ఉండటం వల్ల టీబీఎంలను ఒకటి జర్మనీ నుంచి మరొకటి అమెరికా రాబిన్సన్ కంపెనీ నుంచీ కొన్నారు. గట్టిరాయి ఉన్న సొరంగాల్లో, ఆడిట్‌కు అవకాశం లేని దగ్గరే టీబీఎంలను వినియోగిస్తారు. అక్కడక్కడ గట్టిరాయి లేనిదగ్గర వదులుగా ఉన్న మట్టి పొరలు, మొరం భూమి, భారీ సీపేజ్ వంటివి వస్తుంటాయి. వెలిగొండ టన్నెల్లో కూడా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు పనులు ఆపి ప్రపంచవ్యాప్తంగా అనుభవం గల నిపుణులను రప్పించి ఆ సమస్యను పరిష్కరించి పనులు కొనసాగించారు.
శ్రీశైలం టన్నెల్లో పైన ఉన్న భూ భౌతిక స్థితి పట్ల కచ్చితమైన అవగాహన లేనందున ఈ ప్రమాదం ఎలా జరిగిందో బ్యారేజీ పియర్స్ కింద అట్టడుగు భూమి పొరల భౌతిక స్థితి పట్ల అవగాహన లేనందునే మేడిగడ్డ వద్ద ప్రమాదం జరిగింది. ఎన్జీఆర్ఐ వంటి సంస్థల వద్ద గల అత్యాధునిక పరికరాలు కూడా భూ భౌతికస్థితి పట్ల కచ్చితమైన అవగాహనను కొన్నిసార్లు అధిగమించలేకపోవచ్చు.
శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగంలో కొద్దిరోజుల క్రితం టీబీఎంతో తవ్వకాలు పునః ప్రారంభించినప్పుడు ఈ నిపుణులను రప్పించి ఉంటే ఇప్పటి ఈ ప్రమాదాన్ని బహుశా నివారించి ఉండగలిగేవాళ్లమేమో! ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తిచేయాలనే మంత్రుల ఒత్తిళ్ల వల్ల ప్రపంచ అనుభవజ్ఞులను రప్పించలేకపోయారనే విమర్శ వినవస్తున్నది. సుమారు 8 వేల లీటర్ల నీరు రోజూ ‘ఊటల్లా ఉబికి వస్తుంటే తమ ప్రతిభతో ఈ జల పరిమాణాన్ని రోజూ 3 వేల లీటర్లకు తగ్గించగలిగారు. ఈ విజయం టీబీఎం నిపుణుల్లో, ఆపరేటర్లలో ఉత్సాహాన్ని నింపింది. మిగిలిన సీపేజ్ను కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్, కెమికల్ గ్రౌటింగ్లతో అరికట్టగలమనే నమ్మకంతో పనులు కొనసాగిస్తుండగా ఒక్కసారిగా ఊహకందని పెను ప్రమాదం క్షణాల్లో జరిగింది. కట్టర్ పనిచేస్తున్న వ్యక్తి అరుపులతో ఒక్కసారిగా అప్రమత్తమైన సుమారు 42 మంది కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వరదతో పోటీ పడుతూ వేగంగా 3 కి.మీ. పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. టీబీఎం ఇంజిన్‌లో చిక్కుకున్న ఆపరేటర్ మరో ఏడుగురు మాత్రం బయటకు వచ్చే అవకాశం లేక లోపలే జలసమాధి అయి ఉండవచ్చునని వారి సహచరులు భావిస్తున్నారు. సీపేజ్ జరిగిన ప్రదేశానికి మరోవైపున వారు చిక్కుకున్నారు.
సొరంగాల నిర్మాణంలో ఇలాంటి ప్రమాదాలు ప్రతి దేశంలోనూ జరుగుతూనే ఉన్నాయి. 40 వేలకు పైన సొరంగాలను తవ్విన చైనా దేశంలో 2010-2020 మధ్యకాలంలో 48 ప్రమాదాలు జరిగాయి. (ముగ్గురి కన్నా ఎక్కువ మంది మరణించిన ప్రమాదాలు). సబ్ వే టన్నెల్స్ నిర్మాణంలో 2003-2011 మధ్యకాలంలో చైనాలో 89 ప్రమాదాలు జరిగాయి. 210 మేజర్ టన్నెల్ ప్రమాదాలు ప్రపంచవాప్తంగా జరిగినట్టు 2004లో ఒక సర్వే ద్వారా వెల్లడైంది. ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ దేశాల్లో సొరంగాల త్రవ్వకం సమయంలో భారీ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలకు కారణం భూగర్భంలోని క్లిష్టమైన భూ భౌతిక స్థితి, రాతిపొరల గురించి స్పష్టమైన అవగాహన లేకపోవడమే.
శ్రీశైలం టన్నెల్లో పైన ఉన్న భూ భౌతిక స్థితి పట్ల కచ్చితమైన అవగాహన లేనందున ఈ ప్రమాదం ఎలా జరిగిందో బ్యారేజీ పియర్స్ కింద అట్టడుగు భూమి పొరల భౌతిక స్థితి పట్ల అవగాహన లేనందునే మేడిగడ్డ వద్ద ప్రమాదం జరిగింది. ఎన్జీఆర్ఐ వంటి సంస్థల వద్ద గల అత్యాధునిక పరికరాలు కూడా భూ భౌతికస్థితి పట్ల కచ్చితమైన అవగాహనను కొన్నిసార్లు అందించలేకపోవచ్చు. శ్రీశైలం టన్నెల్ ప్రమాదానికి కారణమైన భారీ సీపేజ్ (ఊటలు)కు కారణం భూమిపై పొరల మీద ఉన్న జలాశయం కావచ్చు లేదా దట్టమైన నల్లమల అడవుల్లో కురిసే భారీ వర్షాల వల్ల భూమి లోపలి పొరల్లో నిలిచిన సబ్ సర్ఫేస్ నీటి నిల్వకు టీబీఎం తవ్వకాల వల్ల గండి పడినందువల్ల కావచ్చు లేదా మట్టి పొరల్లో ప్రవహించే జలధారలు (ఆక్విఫర్స్) కావచ్చు. పైభాగంలో టైగర్ రిజర్వ్ ప్రాంతం, ఎత్తయిన కొండలు ఉన్నందున సర్వే సమయంలో ఈ ప్రాంత భూ భౌతిక స్థితిని అంచనా వేయడంలో స్పష్టత రాలేదని భావించాలి. మేడిగడ్డదైనా, శ్రీశైలం టన్నెల్ ప్రమాదమైనా ప్రకృతి వైపరీత్యాలుగానే భావించాలి తప్ప రాజకీయ విమర్శలకు తావివ్వకూడదు.
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం తవ్వకం పనుల్లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులివ్వక నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ పెద్దలు ఆరోపణలు చేస్తున్నారు. ఇవి పూర్తిగా నిరాధారం. కాంగ్రెస్ పాలనలో వైఎస్ఆర్ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల వరకు (1-6-2014 దాకా) ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుపై చేసిన వ్యయం రూ.1248.14 కోట్లు కాగా గత పదేండ్ల కాలంలో చేసిన వ్యయం రూ.1,117.72 కోట్లు.
2014 వరకు 22.89 కి.మీ. టన్నెల్ తవ్వకం పనులు జరుగగా స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తవ్వింది 11.48 కి.మీ. టీబీఎం టన్నెల్ పనులకే కాకుండా శ్రీశైలం ఎడమకాల్వ ప్రాజెక్టునందలి మొత్తం పనుల కోసం (మరో 7.2 కి.మీ. టన్నెల్‌తో సహా) చేసిన వ్యయం 1-6-2014 నాటికి రూ.3340.90 కోట్లు కాగా గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.3892.50 కోట్లు. ఇప్పటివరకైన మొత్తం వ్యయం రూ.7233.40 కోట్లు. వైఎస్ఆర్ ప్రభుత్వం ‘జలయజ్ఞం’లో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2005లో రూ.2813 కోట్లు 2021 నాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ.9294.22 కోట్లు. ప్రస్తుతం ఇది రూ.12 వేల కోట్లు దాటి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగమైన 2వ టన్నెల్ పొడవు 7.13 కి.మీ. (8.76 వ్యాసం). డిండి, పెండ్లిపాకల వాగుల మధ్య ఈ సొరంగాన్ని టీబీఎం అవసరం లేకుండా మాన్యువల్‌గా (డ్రిల్ బ్లాస్ట్ పద్ధతిలో) నిర్మించారు. దీనిలో 3.32 కి.మీ. లైనింగ్ పనులు పూర్తయినవి. మేడిగడ్డ, ఎస్ఎల్బీసీ ప్రమాదాల, అంచనా వ్యయం పెరగడం విషయంలో కాంగ్రెస్ నాయకులది రెండు నాల్కల ధోరణి అనేది స్పష్టమవుతున్నది.
ఎస్ఎల్బీసీలో ఇరవై ఏండ్ల జాప్యం కాళేశ్వరంలో కూడా జరిగి ఉంటే దాని వ్యయం లక్షా ఇరవై ఏడు కోట్లకు బదులు మూడు లక్షల కోట్లు దాటి ఉండేది. అప్పట్లోనే (1954-55) తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కె.ఎల్రావు కుట్రలకు లోనవకుండా ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఈ దిక్కుమాలిన శ్రీశైలం టన్నెల్స్ ప్రాజెక్ట్ గానీ, ఎత్తిపోతలు గానీ అవసరం లేకపోయేవి. వేలాది నల్గొండ బిడ్డలు తిరుపతమ్మ, అంశుల స్వామి వలె ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఉండేవాళ్లు. ఏలేశ్వరం నుంచి ప్రవాహ కాల్వల ద్వారా నల్గొండ, వరంగల్ ఖమ్మం జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరంది ఉండేది. తెలంగాణ సోయితో ఉద్యమాల ద్వారా రాష్ర్టాన్ని సాధించిన ప్రజానీకం కాంగ్రెస్ నాయకుల అబద్ధాల ప్రచారాలకు లోనుకాకుండా ఉండాలంటే కాస్త నీళ్లసోయి కూడా పెంచుకోవాలి. అప్పుడే మనం ఆశించిన గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లను తడుపుతూ పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండిస్తాయి.
– (వ్యాసకర్త: మాజీ చైర్మన్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ)
వి.ప్రకాశ్