మనదేశ పరిపాలనా వ్యవస్థలో అతి ముఖ్యమైనవి శాసన, ప్రభుత్వ, న్యాయవ్యవస్థలు. శాసనవ్యవస్థ చట్టాలు చేస్తే పరిపాలనా వ్యవస్థ అంటే ప్రభుత్వం అమలుచేస్తుంది. ఆ అమలు అనేది సవ్యంగా ఉందా లేదా? అనేది పరకాయించి నిగ్గు తేలుస్తుంది న్యాయవ్యవస్థ. సాధారణంగా న్యాయస్థానాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉన్నత పరిపాలనా పదవులు నిర్వహించేవారి గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయవు. ఇదంతా మర్యాదస్థుల సంగతి. కానీ, మన ప్రస్తుత సీఎం రేవంత్‌కు ఇవన్నీ పట్టవు. దారినపోయే దానయ్యలు ఏమైనా మాట్లాడుకోవచ్చు. అదే తరహాలో ఒక సీఎం నేలబారుగా మాట్లాడి తే నప్పదు. రాజకీయ ప్రత్యర్థులపై చేస్తున్న బజారుస్థాయి విమర్శల సంగతి పక్కన పెడ దాం.
న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలపైనా అసందర్భంగా అవాకులూ, చవాకులూ మాట్లాడితే ఎలా? మొన్నకు మొన్న ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి, అదీ అసెంబ్లీ వేదికగా, మరీ ముఖ్యంగా కోర్టు పరిశీలనలో ఉన్న అంశం గురించి తూలిన మాటలు పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఆ వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారంపై ఎవరూ ఏమీ మాట్లాడొద్దనే నియమం ఎప్పటి నుంచో ఉన్న ది. ఇక ఉన్నత పదవుల్లో ఉన్నవారైతే అసలు మాట్లాడొద్దు. మరి సీఎం రేవంత్ జంపింగ్ జపాంగ్‌లకు ‘మీకేం కాదు, ఎన్నికలు రావు’ అని భరోసా ఇవ్వడం ఏమిటి? సుప్రీంకోర్టు దీనిపై కొంచెం ఘాటుగానే స్పందించింది. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన సీఎం అదే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను, దాని కింద జరుగుతున్న విచారణ క్రమాన్ని తోసిరాజని ఎలా అంటారు. ఇది ఆ షెడ్యూల్‌ను అవమానించడమేనని సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం.
అయినా సుప్రీంకోర్టు సీఎం రేవంత్‌కు మొట్టికాయలు వేయడం ఇదే మొదటిసారి కాదు. సుదీర్ఘ విచారణ క్రమం తర్వాత బెయిలు మంజూరైతే అది ఏదో రాజకీయ కారణాలతో ఇచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా మాట్లాడిన తీరుపై కోర్టు మండిపడింది. ఆయన తన తప్పు తెలుసుకుంటాడనే ఉద్దేశంతో బహుశా మందలించి విడిచిపెట్టింది. తదనంతరం సీఎం రేవంత్ కూడా జరిగిందానికి బేషరతుగా విచారం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత పట్ల తనకు అపారమైన గౌరవ, ప్రపత్తులున్నట్టుగా అందులో చెప్పుకొన్నారు కూడా. కానీ, అవేవీ గుండె లోతుల్లోంచి రాలేదని, ఆయన బుద్ధి మారలేదని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల ఉదంతం స్పష్టం చేసింది. అందుకే సుప్రీంకోర్టు పోయినసారి వదిలిపెట్టి తప్పు చేశామా? అని విస్మయం వ్యక్తం చేసింది. ఇది సీఎం దిగజారుడు వ్యాఖ్యానాలకు చెంపపెట్టు లాంటిదని చెప్పకతప్పదు.
ఇలా రెండుసార్లు న్యాయవ్యవస్థ తీవ్రమైన ఆగ్రహానికి కారణమైన సీఎం మరొకరు ఉండరేమో. ఓ వైపు సీఎం స్థాయి వ్యక్తి ఇలా న్యాయవ్యవస్థతో పరిహాసాలాడుతుంటే మరోవైపు న్యాయవ్యవస్థనే తప్పుపట్టే పాత్రికేయులు తయారవుతున్నారు. కంచ గచ్చిబౌలి విధ్వంసంపై సుమోటోగా కేసును చేపట్టిన సుప్రీంకోర్టు వైపు వేలెత్తి చూపే రాతలను వండివారుస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలో లేక ప్రభుత్వ ప్రాపకమో, వెనుకనున్న విషయం ఏదైనా సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకోవడం విస్మయం కలిగిస్తున్నది.
న్యాయవ్యవస్థ చేసే వ్యాఖ్యలు అంతిమ తీర్పులో భాగం కావడం లేదని, అయినప్పటికీ వాటికి మీడియాలో చాలా ప్రచారం జరుగుతున్నదనే రాతలను ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ విధ్వంసం సాగిస్తున్నదే ప్రభుత్వమైతే, సుమోటోగా చేపట్టే ముందు ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదా? అని న్యాయస్థానాన్ని ప్రశ్నించడం అర్థం పర్థం లేని కుతర్కమే. ఇలాంటి పని అడ్డంగా సర్కారును వెనకేసుకువచ్చే తానా తందానాలు తప్ప మరొకరు చేయలేరు. సీఎం న్యాయవ్యవస్థను దిగజార్చేలా మాట్లాడుతుంటే, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో న్యాయస్థానాలు పోషించే కీలకపాత్రను నీరుగార్చే ధోరణిలో మీడియా వ్యాఖ్యలు చేయడం.. రెండూ దేశంలోని ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే.