e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఎడిట్‌ పేజీ స్టేషన్‌ బెయిలు.. మంచీ చెడు

స్టేషన్‌ బెయిలు.. మంచీ చెడు

ఇటీవలి కాలంలో దేశంలో నేర విచారణ, తీర్పు కూడా పోలీసుల పరిధిలోకి వెళ్లిన విచిత్ర పరిస్థితి నెలకొన్నది. దీంతోపాటు, ముద్దాయిలకు బెయిలు మంజూరు చేసే అధికారం కూడా పోలీసుల చేతిలోకే వెళ్లటం అనేక విపరీతాలకు తావిస్తున్నది.

41 (ఏ) సీఆర్‌పీసీ పుణ్యమాని ఏడేండ్లలోపు శిక్ష గల నేరాలకు పోలీసులు స్టేషన్‌లోనే బెయిల్‌ ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఆ సెక్షన్‌లో ఎక్కడా బెయిల్‌ ఇచ్చే అధికారం ఉన్నదని స్పష్టంగా లేదు. కేవలం కేసు నమోదైన 15 రోజుల్లోపు నోటీస్‌ మాత్రమే ఇవ్వాలని చెప్తుంది. కానీ కొందరు పోలీసు అధికారులు జ్యుడీషియల్‌ అధికా రాలను కూడా తమ చేతుల్లోకి తీసుకొని బెయిల్‌ ఇచ్చి ష్యూరిటీ కూడా తీసుకుంటున్నారు. జమానత్‌ తీసుకొని బెయిలిచ్చే అధికారం న్యాయమూర్తులకే ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని కొందరు 41 (ఏ) సీఆర్‌పీసీ సెక్షన్‌ను ఆసరాగా వాడుకుంటున్నారు!

- Advertisement -

ఈ సెక్షన్‌లో మార్పు జరుగటానికి ఓ నేపథ్యం ఉన్న ది. ఆర్నెష్‌కుమార్‌- వర్సెస్‌- స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. కేవలం 498 (ఏ) భారతీయ శిక్షాస్మృతి అనే సెక్షన్‌ దుర్వినియోగం అవుతున్నదని ఆర్నెష్‌కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు ఆఫ్‌ బీహార్‌ 498 (ఏ) ఐపీసీ కేసు భార్యలు పెడితే, నోటీసు ఇచ్చి వెంటనే అరెస్ట్‌ చేయకుం డా చూడాలని ఉత్తర్వులిచ్చింది. ఆర్నెష్‌కుమార్‌ కేసులో వచ్చిన తీర్పును, నేషనల్‌ క్రిమినల్‌ బ్యూరో ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని నేషనల్‌ లా కమిషన్‌ రికమండేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటైంది. ఆ కమిషన్‌ దేశవ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు తీసుకొని కేంద్రానికి ఇచ్చిన నివేదికను ఆధా రం చేసుకొని పార్లమెంటు 41సీఆర్‌పీసీ కి సవరణ తెచ్చింది. పోలీసులు దాన్ని ఆసరా చేసుకొని, బెయిలిచ్చే అధికారం వారికి లేకపోయినప్పటికీ ఈ చట్టం ఆధా రంగా బెయిల్లు మంజూరు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు దీని పై సమాలోచన చేయాలి. మూడేండ్ల కిందట తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ చైర్మన్‌ హోదాలో సీనియర్‌ న్యాయవాది శ్రీరంగారావు తెలంగాణ డీజీపీకి 41(ఏ) సీఆర్‌పీసీ దుర్వినియోగంపై పలుమార్లు లేఖలు రాశారు. దీనిపై డీజీపీ వెంటనే స్పందించి, తెలంగాణలోని పోలీసు అధికారులకు 41(ఏ)సీఆర్‌పీసీని దుర్వినియోగం చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. అయినా పోలీసుస్టేషన్లలో బెయిల్‌ పొంది కోర్టుకు హాజరుకాని నిందితులు ఉంటున్నారు. దీంతో నేర విచారణ, నేరస్థులకు శిక్ష అనేది ఒక ప్రహసనంగా మారింది.

స్టేషన్‌ బెయిల్‌ కారణంగా నేరాలు పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జార్ఖండ్‌ ధన్‌బాద్‌లో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌, హైదరాబాద్‌ లోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టు న్యాయవాది రయేషా ఫాతి మా, మంథనిలో వామన్‌రావ్‌ దంపతుల హత్యలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. దేశంలో న్యాయవాదులకే రక్షణ లేని దుస్థితి దాపురించింది. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? నేరాలు పెరగటానికి స్టేషన్‌ బెయిల్‌ వెసులుబాటే కారణమనే వాదనలున్నాయి. దీనిపై విస్తృ త చర్చ జరగాలి. బార్‌ అసోసియేషన్లు, కౌన్సిల్లు స్టేషన్‌ బెయిలు విధానాన్ని ఆపేందుకు న్యాయబద్ధంగా పోరా టం చేయాలి. 41(ఏ) సీఆర్‌పీసీ దుర్వినియోగంపై నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. అదే విధంగా లీగల్‌గా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిల్స్‌ కూడా వేయాలని భావిస్తున్నది. 41 (ఏ) సీఆర్‌పీసీ దుర్వినియోగం ఆపకపోతే దేశంలోని న్యాయవాదులంతా ఉద్యమానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జక్కుల లక్ష్మణ్‌

(వ్యాసకర్త: క్రిమినల్‌ న్యాయవాది, నాంపల్లి కోర్టు బార్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana