తెర్లయిపోతున్న తెలంగాణ తిరగబడుతున్నది. పట్టాలు తప్పిన పరిపాలనపై మర్లవడుతున్నది. పల్లె-పట్నం తేడా లేకుండా ఎక్కడికక్కడ పొలికేకలు పెడుతున్నది. పోరుబాట పడుతున్నది. సర్కారుపై విరగబోట్లు పొడుస్తున్నది. సమ్మె సైరన్లు మోగుతున్నాయి. ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లుతున్నది. ఒక్కో వర్గానిది ఒక్కో గోస. పాలన పట్టని, కాదు కాదు.. చేతగాని సర్కారు కుప్పిగంతులతో విసిగిపోయిన జనం రోడ్డెక్కుతున్నారు. గల్లంతయిన డొల్ల హామీలపై సర్కారు గల్లా పడుతున్నారు, నిలదీస్తున్నారు. నిప్పులు కక్కుతున్నారు. కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం ఇంకానా, ఇకపై సాగదని కదం తొక్కుతున్నారు. పూటకోమాటతో పబ్బం గడుపుకొనే దగుల్బాజీ నాటకాలను దులపరిస్తున్నారు.
పంటకాలం పూర్తికావస్తున్నా తగినంత యూరియా అందకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. పొట్టకొచ్చిన బలం చాలక పంటలు ఈడిగిల పడుతుంటే చూడలేక ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఊరూరా యూరియా యుద్ధాలు జరుగుతున్నాయి. సొసైటీల దగ్గర చెప్పుల బారులు సర్వసాధారణం అవుతున్నాయి. సమస్యలు పరిష్కరించలేని సర్కారు పోలీసు లాఠీలకు పనిజెప్పడంతో రైతన్న రక్తంతో తెల్లటి యూరియా ఎరుపెక్కుతున్నది. అటు గురుకులాల సిబ్బంది జీతాల కోసం ధర్నాలు చేస్తున్నారు. గ్రూప్ వన్ రద్దు చేయాల్సిందే.. హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందే.. జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ ధర్నాలతో నిరుద్యోగులు వేడిపుట్టిస్తున్నారు. ట్రిపుల్ఆర్కు భూములు ఇచ్చేదే లేదంటూ రైతులు రాస్తారోకోలతో రాకపోకలను స్తంభింపజేస్తున్నారు. అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంలు గొంతెత్తుతున్నారు. పోడుభూములపై మోహరించిన సర్కారు బలగాలను అడవి బిడ్డలు తరిమికొడుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సర్కార్ను అవుట్ చేసేందుకు గళమెత్తుతున్నారు.
మరి సమస్యల్ని పరిష్కరించాల్సిన సర్కారు ఏం చేస్తున్నది? ఆడబిడ్డలని కూడా చూడకుండా దమనకాండను ప్రయోగిస్తున్నది. అరెస్టులు సాగిస్తున్నది. వృద్ధులు, వికలాంగులపై కూడా లాఠీలు విరగడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రజల తెగువ చూసి సంఘాలు రంగంలోకి దిగుతున్నాయి. పోడుభూముల జోలికి రావద్దని బీకేఎంస్ పోరుగర్జన చేసింది. కొత్తపింఛన్లు కావాలని వీఎచ్పీఎస్ పోరుబాట పడుతున్నది. అధికారుల కార్యాలయాలను ఆశా వర్కర్లు ముట్టడిస్తున్నారు. మహాధర్నాలతో రాష్ట్రం రాష్ట్రమే దద్దరిల్లుతున్నది. దుష్ట కాంగ్రెస్ భ్రష్ట పాలనలో అన్ని వర్గాలూ అరిగోస పడుతుండటమే ఇందుకు కారణమని విప్పిచెప్పాల్సిన పనిలేదు. సంపద పెంచుడు, పంచుడు చేతకాని సర్కారు తెలంగాణ ప్రజలను ముంచుడు, దంచుడు పాల్జేస్తున్నది. దీంతో రెండేండ్లలోనే తెలంగాణ మరోసారి దగాపడ్డది. కారణాలు వెతకాల్సిన అగత్యం లేదు. విశ్లేషణల అవసరమే లేదు. నాడు రాష్ట్ర సాధనకు సకలజనం సమ్మెబాట పడితే నేడు స్వరాష్ట్రంలోనే సకలజనం తిరుగుబాటు జెండాలు ఎగరేస్తున్నది. సకాలంలో మోసకారి సర్కారుకు వాతపెట్టేందుకు సరైన అదను కోసం ఎదురుచూస్తున్నది.