తెలంగాణ ప్రభుత్వంలో దశాబ్దాలపాటు సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2024 మార్చి నుంచి నేటివరకు రిటైరైన 24,678 మంది ఉద్యోగులకు తాము దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము ఇవ్వడం లేదు. గ్రాట్యుటీ, ఎన్‌క్యాష్‌మెంట్, జీఎల్ఐసీ, కమ్యూటేషన్ సహా రావలసిన ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వేధిస్తున్నది. దీంతో ఉద్యోగ విరమణ చేసిన వారు అవస్థలు పడుతున్నారు.
రేవంత్ సర్కార్ హయాంలో ఇప్పటివరకు దాదాపు 74 మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక క్షోభకు గురై మరణించారు. అ యినా పాలకులకు ఇది కనబడడం లేదు, వినబడడం లేదు. ప్రభుత్వం నెలనెలా ఠంచనుగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రూ.700 కోట్లు కూడా ఇవ్వడం లేదు. రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి మరో పదేండ్లు పడుతుంది. అప్పటివరకు వందలాది పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులతో మరణించాల్సిందేనా? పెన్షనర్ల చావులకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే.
ఉద్యో విరమణ చేసిన వారిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కనీసం మెరుగైన వైద్యం కూడా అందడంలేదు. హెల్త్ కార్డులు ఇస్తామని రెండేండ్లుగా చెప్తున్నారు. కానీ ప్రకటనలు తప్ప ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం కానరావడం లేదు. ఇటీవల రిటైరైన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎస్ఐ శ్రీనివాస్ కాలికి శస్త్రచికిత్స కోసం రూ.25 లక్షలు ఖర్చయింది. తనకు రావలసిన పెన్షన్ డబ్బులు రాకపోవడంతో ఆయన అవస్థలు పడుతున్నారు. మరో ఎస్ఐ మూర్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ దవాఖానలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అతని కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దాదాపు ఇదే.
ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగులు, పెన్షనర్లు వారి మూలవేతనంపై 1.5 శాతం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా రూ.600 కోట్లు ప్రభుత్వ ట్రస్ట్‌కు ప్రతి సంవత్సరం జమ అవుతుంది. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.600 కోట్లు విడుదల చేస్తుందా? అనే అనుమానం వారిలో నెలకొన్నది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత ప్రభుత్వం రూ.600 కోట్లు జమ చేసి, ఖర్చయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఉద్యోగుల నుంచి వసూలు చేసే అవకాశం ఉన్నది. కానీ మొదట ఉద్యోగుల నుంచి వసూలు చేసి, ఆ తర్వాత చేతులు ఎత్తేస్తే ఎలా? వాటి కోసం ధర్నాలు, పోరాటాలు చేయాలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందుతాయనే విషయం అందరికీ తెలిసినా కాంగ్రెస్ పాలకులకు అర్థం కాకపోవడం బాధాకరం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పు చేసింది. అందులో రిటైర్డ్ ఉద్యోగుల కోసం రూ.10 వేల కోట్లు ఒకేసారి ఇచ్చి ఉంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవి. అందాల పోటీల కోసం, మూసీ పునర్జీవం, గాంధీ సరోవర్ పేరిట వేల కోట్లు ఖర్చు చేసే వాళ్లకు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఇవ్వడానికి మనసు ఎందుకు రావడం లేదో తెలియదు. ‘మీకు ఇవ్వడానికి ఏ సంక్షేమ పథకం ఆపాలి’ అని ఉద్యోగులను సీఎం అడగడం బెదిరించే ప్రక్రియలో భాగమే. రైతు భరోసా, రైతు రుణమాఫీలో కోత, పెన్షన్ పెంపు, వితంతువుల పెన్షన్, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ వంటి వాటిని ఎగ్గొట్టి మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ పేరిట అవసరం లేని పథకాలు తెచ్చి ఖజానాను, ప్రజల సంపదను కొల్లగొట్టడం తప్ప రెండేండ్లలో చేసిందేమీ లేదు.
ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. పీఆర్సీ జాడే లేదు. అయిదు డీఏలు అందని ద్రాక్ష పండ్లు. సీపీఎస్ రద్దు ఏమైందో తెలియదు. ఒకటవ తారీఖున వేతనం, వేలాది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అందడం లేదు. మూడు నెలలుగా జీతాలు లేవని ప్రశ్నించిన ఆశా కార్యకర్తలపై పోలీస్ నిర్బంధం. చిన్న తరగతి ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినా ఉన్న జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. స్వీపర్‌కు రూ.2 లక్షల జీతం అని చెప్పి ప్రజల్లో దుష్ప్రచారం చేయడం, రాబోయే రోజుల్లో వేతనాలు పెంచబోమని చెప్పే కుట్రలో భాగమే.
రిటైరయ్యాక ఆనందంతో గడపాల్సిన పెన్షనర్లు మానసిక ఆందోళనకు గురై ఇందిరా పార్క్, జిల్లా కలెక్టర్ కార్యాలయం, సచివాలయం వద్ద పదులసార్లు నిరసనలకు దిగడం, అరెస్టులు కావడం ప్రజా పాలనకు పరాకాష్ట. ప్రతి సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం కారణమంటూ అసత్య ప్రచాం చేస్తూ తప్పించుకుంటున్న కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు కలిసి పోరాటాలు చేస్తున్నా ‘మార్పు’ కోసం తపించిన మేధావులు నోరు తెరువకపోవడం దారుణం. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రెండుసార్లు పీఆర్సీ, 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. సకాలంలో పీఆర్సీ వేసి 5 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చారు. 2014 జూన్ నుంచి 2020 వరకు జీతాలు ఒకటవ తేదీన ఇచ్చిన విషయం తెలిసిందే. ఇతర రాష్ర్టాల ఉద్యోగుల వేతనాల కంటే తెలంగాణ ఉద్యోగుల వేతనాలు ఎక్కువగా ఉండాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించారు. పెన్షనర్ల వయస్సు పెరుగుతున్నకొద్దీ అవసరాలు తీర్చడానికి పెన్షన్ హెచ్చింపు చేశారు. పీఆర్సీ జాడే లేదని అనుకుంటున్న తరుణంలో విద్యా కమిషన్ రాష్ట్రంలో పీఆర్సీ కమిషన్‌గా మారి ఉపాధ్యాయులకు వేతనాలు తగ్గించాలని, కాం ట్రాక్టు టీచర్ వ్యవస్థనే ఉండాలని, పర్మనెంటు ఉద్యోగులు వద్దని చెప్పడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సిద్ధాంతాన్ని వల్లించడమే.
తెలంగాణ నేలపై జరిగిన సామాజిక ఉద్యమాలను, అనాదిగా ఉన్న అసమానతలను, అర్థం చేసుకొని పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సిఫారసు చేయాల్సిన కమిషన్.. విద్యాశాఖను నిర్వీర్యం చేసి ఇప్పటికే అందుతున్న వివిధ రకాల విద్యను విద్యార్థులకు అందకుండా సూచనలు చేయడం అమానుషం. ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలతో చర్చించకుండా నివేదిక రూపొందించడం సరికాదు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వివిధ వర్గాల ప్రతినిధులపై కమిషన్ ఎదురుదాడికి దిగడం దుర్మార్గం.
దేశంలోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వంగా రేవంత్‌రెడ్డి పేరు చిరకాలం గుర్తుండిపోతుంది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత, వాటిని మరిచిపోయి తూతూమంత్రం చర్యలతో ప్రభుత్వ పెద్దలు నటిస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతను వివిధ రూపాల్లో నిరంతరం గుర్తు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి కొత్త ఎత్తుగడలతో రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తున్నది. అక్రమ కేసులు నమోదు చేస్తూ బెదిరించడం సహజ ప్రక్రియగా మారింది. ఈ నేపథ్యంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కలిసి తమ సమస్యలపై పోరాడే సమయం ఆసన్నమైంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొడపాశం పెట్టినా, మున్సిపల్ ఎన్నికల్లో చెంపదెబ్బ కొట్టినా తేరుకోని, స్పందించని కాంగ్రెస్ పాలకులు రానున్న రెండున్నరేండ్లు ప్రజా పోరాటాలు ఎదుర్కొనక తప్పదు. తెలంగాణ మట్టిలోనే పోరాడే శక్తి ఉన్నది. త్యాగాల చరిత్ర ఉన్నది. తస్మాత్ జాగ్రత్త.
( వ్యాసకర్త : కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-దేవీప్రసాద్