Roads | రాయపోల్, ఆగస్టు 01 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో నిత్యం ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి రావాలంటే రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రజలు, ప్రయాణికులు జంకుతున్నారు. రోడ్ల మరమ్మత్తులను చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాహనాదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయపోల్ మండల కేంద్రం నుండి రాంసాగర్ గ్రామం వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్డుపై గుంతలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. రాంసాగర్, కొత్తపల్లి, రాయపోల్ మధ్యలో ఉన్న రోడ్డు పూర్తిగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మండల కేంద్రానికి రావాలంటే రోడ్డు పరిస్థితి చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మత్తు చేయాలని సంబంధిత అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకున్నా రోడ్లు అభివృద్ధి కావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు. ప్రజా ప్రతినిధులు స్పందించి అద్వానంగా మారిన రోడ్లను మరమ్మత్తు చేపట్టి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

