తాండూర్, ఆగస్టు 1: మహారాష్ట్ర నుంచి నిషేధిత గడ్డిమందులను అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిని తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 1.44 లక్షల విలువైన 290 లీటర్ల గడ్డి మందులు, ఒక టయోటా ఇన్నోవా కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలను వెల్లడించారు.
తెలంగాణలోకి గడ్డి మందు అక్రమంగా రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో తాండూర్ సీఐ ఆదేశాల మేరకు భీమిని ఎస్ఐ కోటేశ్వర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా గడ్డి మందులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులు ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గడ్డిమందు ప్లాస్టిక్ క్యాన్లు, ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కాగజ్ నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన గుండా రాజు, బట్టుపల్లి గ్రామానికి చెందిన పార్వతి కిరణ్, భీమిని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుకుం వెంకటేష్, పల్లె రవీందర్గా గుర్తించారు. విచారణలో నలుగురు నిందితులు మహారాష్ట్రలోని రాజురా పట్టణం నుంచి గడ్డి మందులను కొనుగోలు చేసి, భీమిని మండల పరిధిలో రైతులకు ఆక్రమంగా విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు.

గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వాడకం వల్ల భూసారం తగ్గిపోవడం, పంట దిగుబడి తగ్గడం, పర్యావరణానికి హాని కలగడం, రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డీసీపీ తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన, లైసెన్సు కలిగిన ఎరువులు, పురుగుమందుల దుకాణాల నుంచే రైతులు గడ్డి మందులు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
దళారుల మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా గడ్డి మందులు విక్రయాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ బి శ్రీనివాస్ రావు, తాండూర్ సీఐ దేవయ్య, భీమిని ఎస్ఐ కోటేశ్వర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు దీకొండ రమేష్, లక్ష్మణ్ రావు, తాండూర్, మాచారం ఎస్ఐలు ప్రసాదరావు, సౌజన్య సిబ్బంది లవన్, రాజేందర్, మట్ట రమేష్, మైకాంత్, నీలిగొండ అంజయ్య, ముస్తఫా, రమేష్, కిరణ్, సుబ్బారావు పాల్గొన్నారు.