తెలంగాణ వారి దిష్టి తగిలి కోస్తాలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయని తెగ బాధపడినవారు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తాను 11 రోజుల పాటు అన్నపానీయాలు మానేసి ఓ గదిలోనే కూర్చున్నానని చెప్పిన ఆ మహా నాయకుడు తెలంగాణ ప్రజల ఓట్ల కోసం ఇప్పుడు ఎందుకొస్తున్నాడబ్బా…ఇది ఇప్పుడు సగటు తెలంగాణ వాది ప్రశ్న…2009లో వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెనక్కి నెట్టి వందలాది మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకుడైన నాయకుడిని, ఆ పార్టీని మళ్లీ తెలంగాణలోకి బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నాలను కొందరు కుట్రల రూపంలో చేయడాన్ని ఇక్కడి ప్రజానీకం నిశితంగా గమనిస్తున్నారు. గురుదక్షిణ సత్వరమే చెల్లించాలని ఆతృత పడుతున్న శిష్యుడు తాను ఉన్న పార్టీ ఏమిటో కూడా మర్చిపోయి ఉద్యమ పార్టీ జెండా గద్దెలను కూల్చివేయాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపునివ్వడం పట్ల యావత్తు తెలంగాణ ఆశ్చర్యపడిన పరిస్థితి… ఇన్ని జరుగుతుంటే తెలంగాణ సమాజం ఇంకా చూస్తూ ఊరుకోవాలా?
వేచి చూసింది చాలు. ఇక నోరు తెరువకతప్పదు. అడుగు ముందుకేయపోతే మొదటికే మోసం. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుంటే చూస్తూ ఎట్లా ఊకుంటది? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారు మన రాష్ట్రంపై మరోమారు కన్నేశారు. ఇక్కడ కాలుపెట్టాలని చూస్తున్నారు. అందుకు భారీ కుట్రలకు తెరలేపారు. సీమాంధ్ర పెత్తనాన్ని మరోసారి మనపై రుద్దేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని తమ అడ్డాగా చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి కూటమి పేరుతో అడుగు పెట్టబోతున్నారనేది ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తున్నది. తెలంగాణలోని కొందరు ద్రోహులు వారికి వంతపాడుతున్నారు. దీనిని ముమ్మాటికీ అడ్డుకొని తీరాల్సిందే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రక్షించుకోవాల్సిందే. అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా చూడాల్సిందే. ఈ చారిత్రక బాధ్యత మరోసారి వివిధ వర్గాలతో పాటు జర్నలిస్టు సమాజంపై కూడా పడింది. అందరూ కదలాల్సిన సమయమిది. కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేసి తీరాల్సిందే.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీలు మెల్లమెల్లగా ఇక్కడ కాలుమోపేందుకు యత్నిస్తున్నాయి. ఇక్కడి తమవారైన కొందర్ని మచ్చిక చేసుకుంటున్నాయి. వారి ద్వారా కూటమిగట్టి తెలంగాణలో పాగా వేయాలని గట్టిగానే యత్నిస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు జనసేన ఇప్పటికే ప్రకటించింది. దాని వెంట తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇది హఠాత్పరిణామం కాదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే చంద్రబాబు తన కుట్రలకు తెరతీశారు. ఇక్కడున్న తన శిష్యగణం ద్వారా రహస్య ఎజెండా అమలు చేస్తునట్టు రెండేండ్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తూనే ఉన్నది. నీటి ప్రాజెక్టులపై కుట్రల నుంచి ఆంధ్రుల విగ్రహాల ఏర్పాటు వరకు, సంస్థల పేర్ల మార్పు నుంచి తెలంగాణ తల్లి రూపంలో మార్పు వరకు చంద్రబాబు ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రాకు ఈ రెండేండ్ల కాలంలో బహిరంగంగానే ఇక్కడి ప్రభుత్వం సహకరిస్తున్నది.
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని తెలంగాణ పౌర సమాజం గొంతెత్తి నినదించినా వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా విగ్రహావిష్కరణ చేసి ఉద్యమ సోయి కలిగిన తెలంగాణ వారికి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సవాలు విసిరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని రేవంత్ ప్రకటించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ రెండు విగ్రహాల ఏర్పాటుతోనే వీరు ఆగుతారని అనుకోలేం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు చర్చ నడుస్తున్నది. ఇక్కడ జిల్లాల సంఖ్యను భారీగా కుదించనున్నట్టు తెలుస్తున్నది. వీటి వెనుక ‘బాబు’ హస్తం లేదంటే నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తుల విగ్రహాలు మాకెందుకు అనేది సగటు తెలంగాణ పౌరుడి ప్రశ్న. అయితే, వీరి లెక్కలను సరిచేయాల్సింది తెలంగాణ సమాజమే.
తెలంగాణ నీళ్లు, నిధులను కొల్లగొట్టిన చంద్రబాబు ఒకపక్క కుట్రలు చేస్తుండగా అతని అడుగుజాడల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణపై కన్నేశారు. రెండు రాష్ర్టాల్లో పోటీ చేయడానికి జనసేన ఏమైనా జాతీయ పార్టీయా? ఆ పార్టీ ఇక అక్కడ అంతా చేసినట్టు ఇక్కడికి రావడానికి తయారైంది. తమ రాష్ర్టానికి సక్కగా రాజధానిని ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నవారు, దోపిడీ, ఆధిపత్యం కోసం కాకపోతే ఇక్కడ ఏం వెలగబెట్టేందుకు వస్తున్నారనేది పెద్దప్రశ్న.
హైదరాబాద్‌లో సెటిల్ అయిన సీమాంధ్ర వారితో కొత్తగా తమ పార్టీ శాఖలు ఇక్కడ తెరువాలని చూస్తున్నారు. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పరోక్షంగా ఇక్కడ కాంగ్రెస్‌కు లాభం చేకూర్చాలనేదే వారి ఎత్తుగడ. కానీ ‘తెలంగాణ నేతలు నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నయి కదా. మీ ప్రాంతం వారు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చారు కదా. అక్కడ అభివృద్ధిని గాలికి వదిలేసి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, ఒకవేళ ఒకటి, అర సీట్లు గెలిచినా మీరు సాధించేది ఏమిటి? ఎవరి ప్రయోజనాల కోసం ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమయ్యారో తెలుసుకోలేని స్థితిలో ఇక్కడి ప్రజానీకం లేరు’ అని రాజకీయంగా ఎప్పుడో చైతన్యవంతులైన ప్రజలు అంటున్నారు.
ఏపీలో కూటమి పాలన మొదలైన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి. రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత కక్షలతో కేసులు పెట్టుకుంటూ ముందుకు పోతున్న దుస్థితి చూస్తున్నాం. ఆ తరహా రాజకీయాలను తెలంగాణలో కూడా చేయడానికి, రాష్ర్టాన్ని ఆగం చేయాలని చూస్తున్నారు. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేనకు తోడు రేపు బీజేపీ కూడా ఇక్కడ జతకట్టే అవకాశాలను కొట్టి పారేయలేం. అయితే బీజేపీ నాయకులకు తెలంగాణ ఇప్పటికీ అర్థం కాలేదు అనిపిస్తున్నది. జాతీయ రాజకీయ పరిస్థితులను చూసి, ఇక్కడి ప్రజలు ఆ పార్టీకి ఎంపీ స్థానాలు ఇస్తూ వస్తున్నారు. కానీ అసెంబ్లీలో ఆశించిన స్థాయిలో వారికి ఎన్నడూ సీట్లు ఇవ్వలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. బీజేపీ తరహా రాజకీయ ఆలోచనా విధానంతో తెలంగాణ ప్రజలు లేరు. ఉండే అవకాశం లేదు. అందువల్లనే ఇక్కడ ఆ పార్టీ బలపడటం లేదు. అంతేకాదు.. ఆ పార్టీ స్థానిక నాయకులకు తెలంగాణ చరిత్ర కూడా తెలియదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి వారు ముడిపెట్టి మాట్లాడటం చూస్తే మనకు అర్థం అవుతుంది. కనుక తెలంగాణ ప్రజల ఆరాటాలు, పోరాటాలు ఇక్కడ జీవన నేపథ్యాల గురించిన లోతైన అవగాహన వారికి లేదని చాలాసార్లు రుజువు అయింది. ఆ పార్టీకి కొన్ని ఎంపీ సీట్లు ఇస్తున్నప్పటికీ, ఎమ్మెల్యే సీట్ల విషయంలో గాని, మొన్నీమధ్యనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గానీ ఇక్కడి ప్రజలు ఆ పార్టీని విశ్వసించ లేదనేది రుజువు అయింది. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు కూటమి పేరుతో ఇక్కడ బలపడాలని చూస్తున్నారు. బీజేపీని ఒంటరిగానే ఎవరూ నమ్మడంలేదు ఇక్కడ. ఇక ప్రతినిత్యం తెలంగాణపై కుట్రలు పన్నే దుష్ట కూటమిలో భాగంగా జత కట్టి వస్తే జరిగే నష్టం గురించి కూడా ఆ పార్టీ వారికి తెలిసితీరుతుంది.
రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరోవైపు సీమాంధ్ర మీడియా పెత్తనం మితిమీరిపోతున్నది. అదే మీడియా ఉన్నతాధికారులను సైతం అవమానిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నది. ఎమ్మెల్సీ స్థాయి పెద్ద మనుషులను టీవీ డిబేట్లకు అతిథులుగా పిలిచి ‘గెట్ అవుట్’ అంటున్నది. అదే ప్రాంతపు మీడియా మనకు నీతులు బోధిస్తున్నది. ప్రభుత్వాన్ని తామే నడుపుతున్నామనే సంకేతాన్ని బలంగా పంపించే ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్లంతా కిమ్మనకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.
మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ప్రభుత్వ పెద్దలే పదేపదే చెప్తున్నారు. అభివృద్ధి రథచక్రాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై పెత్తనం కోసం ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే తెలంగాణ ప్రజల బతుకు ఆగం కావడం ఖాయం.
బీజేపీ, కాంగ్రెస్ నేతలకు తెలంగాణ కష్టాలు తెలియవు. వారికి తెలంగాణ సోయి లేదు. మన రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో యావత్తు తెలంగాణ సమాజం మేల్కోవాల్సిందే. సీమాంధ్ర పెత్తనాన్ని అడ్డుకుని తీరాల్సిందే. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అంటూ ఉద్యమ సమయంలో నినదించిన గొంతులు మరోమారు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది . 13 ఏండ్ల మలిదశ ఉద్యమ ప్రస్థానంలో స్తబ్దత నెలకొన్న ప్రతిసారీ దానిని బద్దలు కొట్టడానికి ముందుకుసాగిన కలం వీరులు మరోసారి కలం కవాతు చేయాల్సి ఉన్నది. హైదరాబాద్ లాంటి నగరం పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కిక్కురుమనకుండా ఉన్న ఆంధ్ర పార్టీలు ఆ సమయం అయిపోగానే ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఎందుకు తహతహలాడుతున్నాయో బుద్ధిజీవులుగా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ జర్నలిస్టు కాపలాదారులుగా ఉండటమే కాదు.. కలాలకు పదునుపెట్టి అవసరమైతే కదనరంగంలోకి దూకడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-ఆస్కాని మారుతీ సాగర్
9010756666