“యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతాః” అన్నది భారతీయుల జీవన సంస్కృతి విశ్వాసం, నమ్మిక, జీవన విధానంలో భాగం. కవి డా. సి. నారాయణరెడ్డి కూడా తన కవిత్వంతోపాటు సినీ గీతాల్లోనూ స్త్రీమూర్తికి పెద్ద పీట వేశారు. అమ్మ గురించి, ఆలి గురించి, చెల్లె, కూతురు ఇలా అనేక విధాలుగా అతివకు సమగ్ర మూర్తిమత్వాన్ని తన గీతాల్లో వ్యక్తీకరించారు.
ఒకచోట ఆమెను శక్తిగా వర్ణిస్తే, మరోచోట ఆదిపరాశక్తిగా కీర్తించారు.చాలా సినిమాల్లో మహిళను మహోన్నతంగా చిత్రీకరించిన గీతాలు సినారె రాశారు. వాటిలో ప్రధానంగా 1969లో వచ్చిన ‘మాతృదేవత’, 1977 లో వచ్చిన ‘పచ్చబొట్టు’లోని గీతాలను విశేషంగా చెప్పుకోవచ్చు. ‘మాతృదేవత’ చిత్రానికి మహానటి సావిత్రి దర్శకత్వం వహించారు. ఇందులోని ‘మానవజాతి మనుగడకే/ ప్రాణం పోసింది మగువ! త్యాగంలో అనురాగంలో/ తరగని పెన్నిధి మగువ’ గీతం విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఇందులో… ‘సీతగా… ధరణిజాతగా సహన శీలం చాటినది/ రాధగా… మధురబాధగా ప్రణయగాథల మీటినది/ మొల్లగా కవితలల్లగా.. తేనె జల్లు కురిసినది/ లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకినది…’ వంటి వాక్యాలు స్త్రీమూర్తికి ఉన్న వివిధ కోణాల్ని, కవి సినారెకు ఉన్న భావన, గౌరవాలను ఆవిష్కరిస్తాయి.
1977లో వచ్చిన ‘పచ్చబొట్టు’ సినిమాలోని ‘ఆడదంటే ఆటబొమ్మ కాదురా’ గీతం అతివను గొప్పగా చూపించిన వాటిలో ఒకటి. శ్రీ నళినీ కంబైన్స్ బ్యానర్‌పై బి.ఎన్.ఆర్. గురుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. సినారెతోపాటు కొసరాజు, దాశరథి, జి. విజయరత్నం ఈ చిత్రం కోసం గీతాలు రాశారు. ఈ చిత్రం కోసం సినారె రాసిన గీతం తెలుగు సినీగీతాల్లో పచ్చబొట్టులాగా నిలిచిందని అనడంలో అతిశయోక్తికాదు.
పల్లవి:
ఆడదంటే బొమ్మ కాదురా
నమ్మరా.. ఇది నమ్మరా!
నమ్మరా! ఇది నమ్మరా!
నిన్నూ నన్నూ అందరిని కన్న అమ్మరా!
ఆమె నిప్పుల్లో నడిచే.. సీతమ్మరా! ॥ఆడదంటే॥
సృష్టికి మూలమైన ‘అమ్మ’ గురించి అనేక గీతాల్లో… ‘అమ్మ బొమ్మ’ వంటి కవితల్లో ఎన్నోసార్లు విలక్షణంగా చెప్పిన సినారె ఇందులో ‘అందరిని కన్న అమ్మ’ ఆ స్త్రీ మూర్తి అని చెబుతూ…. ఆమె ఎవరో కాదు అనేక అవమానాలు, కష్టాలు భరించి నిలిచిన అగ్నిపునీత సీత అంటారు.
తల్లిగా నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసిన స్త్రీ తల్లిగా, భార్యగా బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో అటు పిల్లల నుంచి ఇటు భర్త నుంచి అన్నింటిని సహిస్తుంది. సహనమూర్తిగా… కుటుంబానికి మూలదీప్తిగా, ఓపికకు… ఓర్పునకు… శాంతానికి… ఆలంబనకు చైతన్యదీప్తిగా నిలుస్తుంది. ఇక్కడ ‘అన్నిటిని సైచే భూదేవి’గా చెబుతారు కవి. అయితే అటువంటి సహనమూర్తికి గుండెమండి కోపం వస్తే! వస్తే…. ‘అంతా బూడిదరా’ అంటారు సినారె తర్వాతి చరణంలో. నిజం కదూ! స్త్రీ కోపానికి… శాపానికి…. ఆవేదనకు గురై బూడిదైపోయిన ఎన్నో సంఘటనలకు చరిత్ర సాక్ష్యంగా నిలవడం మనకు తెలుసు. వీటన్నింటిని ఇందులో బలంగా చెబుతారు కవి.
చరణం
కడుపులోని శిశువు కాలదన్నుతున్నా
పుట్టిన ఆ శిశువే గుండెపై తొక్కినా
కట్టుకున్న మొగుడు తలపై మొత్తుతూ వున్నా
కన్నకొడుకు ఎదిగి తనపై కసురుతూ వున్నా
అన్నిటినీ సైచే భూదేవి ఆడదిరా! మరి
ఆ తల్లి గుండె మండితే అంతా బూడిదరా ॥ఆడదంటే॥
చరణం
సగం ఒంటిలో పార్వతమ్మను
నింపుకున్నాడు శివుడు
రొమ్ముపైన లచ్చుమమ్మను
నిలుపుకున్నాడు మాధవుడు
నాలుకపైన చదువులమ్మను
దాచుకున్నాడు బ్రహ్మయ్య
అంతటి దేవుళ్లే ఆడవాళ్లను
ఆదరించగా ఓరయ్య
నువ్వెంత నీ బతుకెంత
ఒక నువ్వు గింజంత! ॥ఆడదంటే॥
భారతీయులు నిత్యం కొలిచే త్రిమూర్తులు సైతం స్త్రీకి విశేష స్థానాన్ని ఇచ్చారన్న విషయాన్ని కవి ఈ గీతంలో చెబుతారు. మొదటగా లయకారుడైన పరమేశ్వరుడిని గురించి ప్రస్తావిస్తూ పార్వతీ పరమేశ్వర తత్త్వాన్ని వివరించి అర్ధనారీశ్వరుడుగా “సగం ఒంటిలో పార్వతమ్మను” శివుడు నింపుకొన్నాడంటారు. అటు తరువాత స్థితికారకుడైన మహా విష్ణువు తన వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గురించి “లచ్చుమమ్మను రొమ్ముపై” నిలుపుకొన్నాడు అంటూ రాస్తారు. చివరిగా సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుణ్ని చూపుతూ ఆయన ఏకంగా “నాలుకపైన చదువులమ్మ”ను దాచుకున్నాడని చెబుతారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ చివరిగా త్రిమూర్తులే వాళ్ల వాళ్ల అర్ధాంగులకు అంతటి ఉన్నత స్థానాన్నిచ్చి, ప్రకృతి స్వరూపిని అయిన స్త్రీకి ఎనలేని గౌరవాన్ని, విలువను కల్పించారు అన్నారు. సినిమా సందర్భంలో చెప్పినా సరే.. మామూలు మనిషివి నువ్వెందుకు ఇంతగా ఎగిసి ఎగిసి పడుతున్నావు. ఒక్కమాటలో చెప్పాలంటే నువ్వు “ఒక నువ్వు గింజంత” అన్నారు సినారె. ఇలా స్త్రీ కేంద్రబిందువుగా ఉండి సమస్యలు, కష్టాలు, సాధకబాధకాలు వంటివి అనేకం సినారె తన గీతాల్లో రాశారు.
-పత్తిపాక మోహన్