కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై ఆదివారం మూక దాడి జరిగింది. హుగ్లీ జిల్లా చండీతల పోలీస్ స్టేషన్ బయట జరిగిన గొడవలో ఆయన తలకు గాయమైంది. అరెస్టయిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ కార్యకర్తలు పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించడానికి సమావేశమైనప్పడు బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకొన్నారు. పరిస్థితి హింసాత్మకంగా మారడంతో దొంగలకు మద్దతుగా ధర్నా చేస్తున్నారంటూ టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఘర్షణను నివారించడానికి భారీగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది.
‘ధర్నా జరుగుతున్న చోటుకు నేను వెళుతుండగా మెడలో కాషాయ వస్ర్తాలు వేసుకొన్న 10-15 మంది నాపై దాడి చేశారు. అందులో ఒకరు నాపై రాయి విసిరారు’ అని కల్యాణ్ బెనర్జీ తెలిపారు. అనంతరం ఆయన చండీతల ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగిస్తూ.. ‘వాళ్లు (బీజేపీ) నాపై, ఇతర ఎంపీలపై ఎలా దాడి చేశారో మీరు చూశారు. ఇది సరైందేనని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నను మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను’ అని అన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలపై జరిగిన దాడుల గురించి టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదన్నారు. మరోవైపు కల్యాణ్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన గాయపడలేదని.. ప్రజా మద్దతు కోసం బాధితుడి లాగా నటించారని తెలిపింది.
టీఎంసీ అధినేత, మాజీ సీఎం మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఎంపీ కల్యాణ్ బెనర్జీలపై దాడులు జరిగిన తర్వాత మమత ఇంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. కానీ 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది డుమ్మా కొట్టడంతో మీటింగ్‌ను క్యాన్సిల్ చేశారు. డుమ్మా కొట్టిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. దీంతో టీఎంసీలో చీలికలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేల గైర్హాజరుపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. వారంతా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దుతున్నారని తెలిపారు. తమ ఎంపీలపై దాడి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లారని.. అందుకే రాలేకపోయారంటూ తెలిపారు.