న్యూఢిల్లీ, మే 31 : ‘వడ్డించే వాడు మనవాడే అయితే’ అన్న సామెత చందాన కేంద్రంలోని పెద్దల అండ ఉంటే ఏ రంగంలోనైనా, ఏ కాంట్రాక్టునైనా తామే దక్కించుకుంటామని అదానీ సంస్థ మరోసారి రుజువు చేసింది. ఎఫ్‌సీఐ రెండు దశల్లో చేపట్టిన ‘హబ్ అండ్ స్పోక్’ సైలో పథకాన్ని అదానీ అగ్రీ లాజిస్టిక్స్ లిమిటెడ్, లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలే దక్కించుకున్నాయి. మొత్తం 134 సైలో కాంట్రాక్టుల్లో 16,500 కోట్ల విలువైన 110 కాంటాక్టులను ఈ రెండు సంస్థలే చేజిక్కించుకున్నాయి. మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 46.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రెండు సంస్థలకు చెందిన సైలోలలో నిల్వ చేసే కాంట్రాక్టులు పొందాయి. దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం తన ఆహార ధాన్యాల నిల్వలను భద్రపరిచే విధానాన్ని ఆధునీకరించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్ణయించింది. దీంతో 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో సైలో కార్యక్రమం చేపట్టింది.
అయితే వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులన్నీ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యేలా ఈ కార్యక్రమం పరిణమించింది. ప్రాజెక్టులను ఏ ఒక్క కంపెనీ కూడా గుత్తాధిపత్యం చేయకుండా నిరోధించడానికి ఎఫ్‌సీఐనే స్వయంగా మొదట్లో ఒక గుత్తాధిపత్య వ్యతిరేకత నిబంధనను ప్రతిపాదించింది. కానీ 2022లో జరిగిన ఒక కీలక సమావేశంలో నీతి ఆయోగ్, ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ ఆంక్షలను వ్యతిరేకించాయి. మార్కెట్ శక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని వాదించి ఆ నిబంధనను తొలగించాయి. అదానీ కోసమే ఆ నిబంధనను తొలగించారని విమర్శలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. దాంతో తర్వాత కథ మామూలే. తర్వాత ఫేజ్ 1లోని రెండో రౌండ్లో అదానీ ప్రతి సింగిల్ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడం ప్రారంభించింది. అయితే రెండో దశ నాటికి ఒక ద్వంద్వాధిపత్యం ఆవిర్భవించింది. ఈసారి అదానీ, లీప్ సంస్థలు కలిసి ఆధునిక ధాన్య నిల్వ వ్యవస్థ కార్యక్రమంలో పూర్తిగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.
చిత్రంగా భారత దేశపు పోటీ నియంత్రణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అన్ని రంగాల్లోనూ మితిమీరిన మార్కెట్ నియంత్రణ, గుత్తాధిపత్య ధోరణులను ఎత్తి చూపుతుంది. సైలో ప్రాజెక్టు విషయంలో పెద్ద కార్పొరేషన్లకు అనుకూలంగా ఉండే నిబంధనలు రూపొందించినా అది నోరు మెదప లేదు. తమ అనుకూల సంస్థలకు కాంట్రాక్టులు వచ్చేలా చూసే కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉండటంతో అదానీ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.