ఆసేతుహిమాచల పర్యంతం వ్యాపించి ఉన్న పన్నెండు పవిత్ర నదులకు, పన్నెండేళ్లకు ఒకసారి,
పన్నెండు రోజులపాటు జరిగే పుష్కర మహోత్సవాలలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది.
పూర్వం తుందిలుడనే పరమధార్మికుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి, ‘జలమయత్వ సిద్ధి’ అనే అపూర్వ వరాన్ని పొందాడు. దానివల్ల అతనికి నదులలో సంచరిస్తూ వాటిని పవిత్రం చేసే అద్వితీయమైన మహత్తు లభించడంతో, తుందిలుడు ‘పుష్కరుడు’గా ప్రసిద్ధి చెందాడు. ఈ పదానికి ‘పాపాలను హరించే వాడు’, ‘జగత్తును పోషించేవాడు’ అనే అర్థాలున్నాయి. జగత్తుకు ఆధారం జలమే కదా మరి! బ్రహ్మపురాణ అంతర్గత తీర్థమాహాత్మ్యంలో, దేవగురువు బృహస్పతి ఏ రాశిలో అడుగు పెడితే, పుష్కరుడు ఆ రాశికి సంబంధించిన నదీజలాల్లోకి ప్రవేశిస్తాడని పేర్కొని ఉంది. పుష్కర పర్వదినాల్లో నదుల్లో ప్రవేశించే పుష్కరుడికి, మిగిలిన సమయంలో రాజస్థాన్‌లోని ‘పుష్కర్’ పుణ్యక్షేత్రం శాశ్వత నివాసమని కూడా కొందరు విశ్వసిస్తారు.
ఖగోళశాస్ర్తానుసారం, బృహస్పతి పన్నెండు రాశుల గుండా, ఒకటి తరువాత వేరొకటిగా ప్రయాణిస్తాడు. ఈ కాలచక్రంలో- మొదటి మూడు రాశులైన మేష, వృషభ, మిథున రాశులను దాటుకొని; నాల్గోదైన కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించే క్రమాన్ని వివరించే ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది:
మేషే గంగా వృషే రేవా మిథునే చ సరస్వతీ
కర్కటే యమునా చేవ సింహే గోదావరీ తథా..
ఈ కాలచక్ర నియమానుసారం… గంగ, నర్మద, సరస్వతి నదుల పుష్కరాల తర్వాత; గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నది.. పుష్కరశోభను సంతరించుకుంటుంది. ఈసారి జూన్ 2వ తేదీ నుంచి 12 రోజుల పాటు యమునా నది ‘ఆది పుష్కరాలు’ వైభవోపేతంగా జరుగనున్నాయి. సంవత్సరాంతంలో 12 రోజుల పాటు ‘అంత్యపుష్కరాలు’ జరుగుతాయి.
హైందవధర్మంలో నదులను నాగరికతకు పుట్టినిళ్లుగా, జీవనదాతలుగా, సాక్షాత్తు దైవ స్వరూపాలుగా ఆరాధిస్తారు. పురాణాలను అనుసరించి, ‘కాళింది’ అనే నామాంతరం గల యమున, మృత్యుదేవత యమధర్మరాజుకు ప్రియ సోదరి. అందువల్ల ఈ పుష్కర సమయంలో యమునా నదిలో స్నానమాచరిస్తే అపమృత్యుభయం తొలగిపోవడమే కాకుండా, తోబుట్టువుల మధ్య ఆత్మీయ బంధాలు బలపడతాయని పౌరాణికుల కథనం. దీపావళికి మూడోనాటి యమద్వితీయ పర్వదినాన జరుపుకొనే భగినీహస్తభోజనం ప్రాముఖ్యత మనకు తెలిసిందే. అంతేగాక, ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ (ఆరోగ్యాన్ని సూర్యుని వద్ద కోరుకోవాలి) అనే ప్రసిద్ధ సూక్తి ఆధారంగా, సూర్యపుత్రిక యమునలో పుష్కరస్నానం ఆరోగ్య ప్రదాయకమని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు పరమాత్ముడి ద్వాపర యుగావతారమైన శ్రీకృష్ణుడి బాల్యలీలలకు ఈ యమునాతీరమే వేదికైంది. కృష్ణుడి పాద స్పర్శతో పునీతమైన ఈ నది, భక్తి రసాన్ని పారించే అమృత వాహినిగా భక్తులమదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
హిమాలయాలలోని మంచుశిలల నడుమ, సముద్ర మట్టానికి దాదాపు పద్నాలుగున్నర వేల అడుగుల ఎత్తున ‘కాళింది’ పర్వతం ఉంది. ఆ పర్వత సానువుల్లోని ‘చంపాసార్ మంచుపలక’ వద్ద ఉద్భవించిన యమున కిందకు ప్రవహిస్తూ, ‘యమునోత్రి’ అనే దివ్యధామాన్ని చేరుకుంటుంది. పచ్చని ప్రకృతి, గైరికాది ధాతువులతో నిండిన ఆ పర్వతశిఖరం చిన్నికృష్ణుని శిఖలోని పింఛాన్ని; అక్కడి దేవదారు వృక్షాల మొనదేలిన ఆకుల మధ్యనుంచి వీచే వాయువు సవ్వడి వేణుగాన లోలుని మురళీరవాన్ని; ధవళవర్ణపు హిమశకలాలు కృష్ణుని కంఠసీమలోని మంచిముత్యాల సరాన్ని; నీలి రంగులో ఉన్న యమునా జలాలు నీలమేఘశ్యాముడి మేని వర్ణాన్ని తలపిస్తూ- భక్తిభావాన్ని ఇనుమడింపజేస్తాయి. ఆపై యమున కొండకోనల్లో పరవళ్లు తొక్కుతూ, మైదాన ప్రాంతాల్లో సోయగాలు చిందిస్తుంది. అలా, ఈ పన్నెండు రోజుల పండుగ ఉత్తరాఖండ్‌లోని హిమగిరులలో ఆరంభమై, దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలను పరవశింపజేస్తుంది. నదీ ప్రవాహం హర్యానాలోని పాంటా సాహిబ్, కురుక్షేత్ర పుణ్యభూముల సమీపంగా సాగుతూ; ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, బృందావన క్షేత్రాలకు చేరుకునేసరికి భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబిస్తుంది. లీలామానుష వేషధారి లీలా విశేషాలతో ముడిపడి ఉన్న మథురలోని విశ్రామ ఘాట్, బృందావనంలోని కేశి ఘాట్లలో యమునా నది అందుకునే హారతులు, పూజలు ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరిస్తాయి. వీటికి మకుటాయమానంగా, ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున, అంతర్వాహిని అయిన సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రంలో పుష్కర స్నానమాచరించడం, భక్తులు తమ సుకృతంగా భావిస్తారు.
పుష్కర ఘడియలలో ఆచరించాల్సిన విధుల గురించి మన స్మృతి గ్రంథాలు, ధర్మశాస్ర్తాలలో నిర్దుష్టంగా పేర్కొని ఉన్నాయి. భక్తులు ఉషోదయానికి చాలా ముందుగా – బ్రహ్మ ముహూర్తంలోనే – యమునా నదిలో ఆచరించే పవిత్ర స్నానం కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు; అంతఃకరణ ప్రక్షాళన కూడా. స్నానానంతరం తమ వంశవృక్షానికి మూలపురుషులు, పితృదేవతల మోక్షం కోసం పిండప్రదానాలు, తర్పణాలు వదలడం ఈ పుష్కరాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ పవిత్ర దినాలలో చేసే దానధర్మాలకు అనంతమైన ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. దాంతో, వస్త్ర-అన్నదానాలు, సత్ బ్రాహ్మణులకు భూరి విరాళాల కోసం సిద్ధం చేసిన ద్రవ్య రాశుల వైభవంతో, పుష్కర ఘాట్లన్నీ ఐశ్వర్యాలకు ఆలవాలమైన కుబేరుడి అలకాపురిని తలపిస్తాయి. పగటిపూట వేద మంత్రాల ఘోషతో, జపతపాలతో ఆధ్యాత్మికంగా విరాజిల్లే నదీ తీరాలు- రాత్రి వేళల్లో వేలాది ప్రమిదలతో చేసే నదీ హారతులు, భజన కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు ఒక దివ్యలోకాన్ని కండ్లముందు ఉంచుతాయి.
సామాజిక కోణంలో చూస్తే, పుష్కరపర్వం భారతదేశపు అఖండతకు, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనకు సజీవ ప్రతీక. భిన్న భాషలు, భావజాలాలు, సంస్కృతులు, నేపథ్యాలు కలిగిన లక్షలాది మంది భక్తులు తరతమభేదాలు లేకుండా నదీస్నానంలో మమేకమైపోతారు. అంతే కాదు, ఈ మహా సమ్మేళనం పర్యాటక రంగానికి ఊతమిస్తుంది కూడా. అయితే, ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నదిని రక్షించుకోవాలనే సామాజిక స్పృహను, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని కూడా ఈ పుష్కరాలు పంపుతాయి. నదులను పూజించడమే కాదు, వాటిని స్వచ్ఛంగా ఉంచడం కూడా మన విద్యుక్తధర్మం. నదీ పరిరక్షణకు పెద్దపీట వేసే ప్రసిద్ధమైన శ్లోకం ఇలా ఉంది:
‘న దద్యాన్మలినాన్ ద్రవ్యాన్ నదీషు చ కదాచన
మాతృవత్ పరిపాలేత నదీః పుణ్యాః విశేషతః॥
అంటే, పవిత్రమైన నదులను కాలుష్య కాసారాలుగా మార్చరాదని, వాటిని కన్నతల్లిలా భావించి సంరక్షించుకోవడం మన ధర్మమని దీని భావం. ఇంతటి మహా సమ్మేళనాలలో స్వీయ క్రమశిక్షణ, సాటిభక్తుల పట్ల సహనం కూడా ఎంతో అవసరం. లక్షలాది మంది ఘాట్లకు పోటెత్తడం వల్ల, తొక్కిసలాటలు అరికట్టడానికి ప్రభుత్వ భద్రతా నియమాలను, సూచనలను భక్తులు తప్పక పాటించాలి. పన్నెండు రోజులూ నదీ జలాలు పవిత్రతను కలిగి ఉంటాయన్న విశ్వాసంతో, పుష్కర స్నానం కోసం చివరి రోజునే వెళ్లాలనుకోకుండా; అనుకూలమైన రోజును ఎంచుకోవడం మేలు. యమునా ప్రవాహం అంతా పుష్కర మహిమతో పవిత్రమైనదే; ఒకే ఘాట్ వద్ద గుమిగూడ కుండా, భక్తులు రద్దీ తక్కువగా ఉన్న ఘాట్లను ఎంచుకొని ప్రమాదాలు నివారించ వచ్చు. అంటువ్యాధులు ప్రబలకుండా, శుచి-శుభ్రతలకు ప్రాధాన్యం ఇవ్వడం; పవిత్ర నదీ జలాలు ప్లాస్టిక్ భూతం బారిన పడకుండా చూడటం యమునమ్మకు మనం సమర్పించు కునే వెలకట్టలేని కానుకలు. మొత్తానికి, పుష్కరాలనేవి తరాల అంతరాన్ని చెరిపేస్తూ మన సంస్కృతిని సజీవంగా ఉంచే ఒక అద్భుత సాంస్కృతిక వారసత్వం.