పదం పలుకుతూ, పాదం కదుపుతూ వీనుల విందుగా… పల్లెనుంచి ప్రపంచ వ్యాప్తమైన ఒగ్గు కథ ప్రస్థానం ఎంతో గొప్పది. అంతరించిపోతున్న ఒగ్గు కళకు ఆధునికతను జోడించి జీవంపోస్తున్నాడు చౌదరిపల్లి రవి కుమార్ (ఒగ్గు రవి). ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్యకు వరుసకు మనువడైన ఈ యువకుడు ఒగ్గుడోలు విన్యాసాలతో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాడు. ఇటీవల గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పరేడ్లో ఒగ్గు డోలు సప్పుడుతో విన్యాసాలు ప్రదర్శించిన ఈ యువ కళాకారుడు బతుకమ్మతో ముచ్చటించాడు. ఆవిశేషాలు తన మాటల్లోనే..

ఒగ్గు కథా పితామహుడిగా పేరున్న చుక్క సత్తయ్య అంటే తెలియనివారుండరు. జనగామ జిల్లాలోని మాణిక్యపురంలో విరిసిన కళాతపస్వి ఆయన. పల్లె పదాలను బాణీలుకట్టి ‘హరిహర నారాయణ..ఆదినారాయణ..మమ్మేలు మాతల్లి కనకదుర్గా’ అంటూ ఒగ్గు కథకు జీవం పోశారు. ఆయన అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. కాళ్లకు గజ్జెలుకట్టి, తువ్వాలను చీరకొంగుగా మలిచి… ఒగ్గు కథను ఎల్లలు దాటించిన సత్తయ్య నాకు తాతయ్య వరుస అవుతారు. పల్లె పదాలతో అలవోకగా పాటగా కూర్చి, సందర్భానుసారం బాణీ కట్టి, ఆడిపాడటంలో ఆయన ప్రత్యేకతే వేరు. తాతయ్య వారసత్వాన్ని కొనసాగించడానికే ఒగ్గు రవిగా కాళ్లకు గజ్జెకట్టి, డోలు చేతపట్టాను.
అంతర్జాతీయ వేదికలపై
ఒగ్గు డోలు అందుకున్నది మొదలు అందులోని మెలకువలన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టిన. ఆ కళమీద మమకారంతో కష్టంతో కాకుండా ఇష్టంతో నేర్చుకున్నా. ‘ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం’ లాంటి అనేక రకాల డోలు విన్యాసాల్లో పట్టు సాధించాను. దశావతారాలు, పోతురాజులు, విష్ణురూపం, శివసత్తుల విన్యాసాలు లాంటి ప్రదర్శనల్లో ఆరితేరాను. తెలంగాణ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్ ఇలా 12 దేశాల్లోని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోని తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలప్పుడు ప్రదర్శనలు ఇస్తుంటాను. జానపద సాహిత్య రంగంలో నా ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ జాతీయ పురస్కారంతో సత్కరించింది.
సంతోషంగా ఉంది
ఇటీవల సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లాను. జనవరి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో తొలిసారి ఒగ్గుడోలు విన్యాసంతో తెలంగాణ కళకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాను. తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందంతో రిపబ్లిక్ డే పరేడ్లో ఒగ్గు డోలు ప్రదర్శన ఇచ్చాం. ఓ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఒగ్గు డోలే. అంతరించిపోతున్నదన్న ఈ కళ నేడు అందరి మదిలో నిలిచిపోయినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు సుమారు ఐదువేల మందికిపైగా యువ కళాకారులకు ఈ రంగంలో శిక్షణనిచ్చాను. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికి, రేపటి తరానికి ఈ కళను పరిచయం చేయాలన్నదే నా లక్ష్యం.
…? రాజు పిల్లనగోయిన

