హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర మావోయిస్టులంతా లొంగిపోవాలని, వారి భవిష్యత్తు భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్‌లో ఉచిత వైద్యంతోపాటు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం 130 మంది మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించి, రివార్డులు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన మావోయిస్టుల రివార్డు చాలా తక్కువగా ఉన్నదని, కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా సరిపోదని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు తనతో చెప్పి వాపోయారని చెప్పారు. వారి అభ్యర్థన మేరకు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడమే కాకుండా, నిమ్స్ వంటి దవాఖానల్లో పూ ర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులకు భూమి కేటాయించే విషయంలో కొంత సందిగ్ధత ఉన్నదని, భూములు అందుబాటులో లేవని చెప్పారు. వరవరరావు వంటి మావోయిస్టులపై కేసులను ఎత్తివేస్తారా అని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ‘అవన్నీ ఎత్తేయగలిగే కేసులుగా ఉంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది.
గణపతి సహా మిగతా మావోయిస్టులు లొంగిపోవాలి
కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మావోయిస్టు అగ్రనేత గణపతి సహా సెంట్రల్, స్టేట్ కమిటీలు, ఇతర వివిధ హోదాల్లో అజ్ఞాతవాసంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం కోరారు. ‘లొంగిపోయేందుకు గణపతి ఎవరితో చర్చలు జరుపుతున్నారనేది మాకు స్పష్ట త లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ‘లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? లేక కుటుంబ సభ్యులతో గడుపుతారా? అనేది వాళ్లిష్టం. అని సీఎం తెలిపారు.
20 ఏండ్ల లోపు వారు 40మంది
సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో 18 నుంచి 20 ఏండ్ల లోపువారు 40 మంది, 21-30 ఏండ్ల లోపు 60 మంది, 31-61 ఏండ్ల వయసు మధ్యలో 30 మంది ఉన్నారు. పీఎల్జీఏ మొదటి బెటాలియన్‌లో 42 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, రీజినల్ కమిటీ సభ్యుడు, డివిజన్ కమిటీ సభ్యులు 10 మంది, ఏరియా కమిటీ సభ్యులు 46 మంది చొప్పున ఉన్నారు. సెంట్రల్ కమిటీ స్టాఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారు 10 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, గ్రేహౌండ్స్ డీజీ అనిల్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.