కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) గత పక్షం రోజులుగా చేస్తున్న ఉద్యమానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ధర్నా టెంట్ల వద్దకు వచ్చి ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా’మని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, నేడు ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో 479 కేజీబీవీలు ఉండగా.. వాటిల్లో 1.25 లక్షల మంది విద్యార్థినులు చదువుతున్నారు. సుమారు 20 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. అదే విధంగా మండల, జిల్లా కార్యాలయాల్లో చాలామంది సేవలందిస్తున్నారు. అయితే, వెట్టిచాకిరి చేస్తున్న వారికి కనీస వేతనం కూడా అందడం లేదు. ఉద్యోగ భద్రత కూడా లేదు. రెగ్యులర్ ఉద్యోగులు పొందుతున్న సౌలభ్యాలు వారికి అందడం లేదు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పు వర్తింపజేయడం లేదు. పంజాబ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లోని సమగ్ర శిక్ష ఉద్యోగులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయి. తమను కూడా రెగ్యులర్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయం.
‘ఇవేమీ గొంతెమ్మ కోర్కెలు కావు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే సచివాలయానికి పిలిచి, మీ డిమాండ్లను నెరవేరుస్తాం’ అని సమగ్ర శిక్ష ఉద్యోగులకు గతేడాది అట్టహాసంగా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. చాయ్ తాగినంత సమయంలో వారి సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పారు. కానీ, ఇప్పుడు పక్షం రోజులుగా ఆందోళన చేస్తున్నా పాలకులు మాత్రం కనికరించడం లేదు. ‘మేము కడుపు మండి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తుంటే, విజయోత్సవాలు చేసుకుంటూ అధికారులు పట్టించుకోవడం లేద’ని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతున్నది. కాబట్టి, దీన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి వెంటనే వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలి. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి. రూ.20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.