ఉమ్మడి పాలనలో గోస పడ్డ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు కేసీఆర్. అంతేకాదు, సబ్బండ వర్గాలకు ఫలాలను అందించేందుకు ‘బంధు’ పేరిట పలు పథకాలను ప్రారంభించారు.
సాగును బాగు చేసేందుకు ‘రైతుబంధు’వై ఎకరాకు ఏటా రూ.10 వేలు అందించారు. చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు ‘రైతుబీమా’ ద్వారా రూ.5 లక్షలు సాయం చేశారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇచ్చి కర్షకులకు ఆదెరువయ్యారు. సమాజంలో అత్యంత పీడనకు గురైన సమాజాన్ని ఆదుకునేందుకు ‘దళిత బంధు’ పేరిట ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి వారిని వ్యాపారులను చేశారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం బీసీ బంధు ద్వారా ఆర్థిక సాయం చేశారు. గొల్ల, కురుమ సోదరులకు ‘గొర్రెల పంపిణీ’, మైనార్టీ సోదరులకు ‘మైనార్టీ బంధు’ ఇచ్చారు. గర్భిణులకు కేసీఆర్ కిట్‌తో పాటు రూ.11 వేలు సాయం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ ఇచ్చి వారికి బంధువయ్యారు.
కానీ, మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో బంధులన్నీ బంద్ అయిపోయాయి. మాటల గారడీతో అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీకి పైరవీల కోసం ఢిల్లీకి పోవ డం, కూల్చివేతలు, అక్రమ కేసులు తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ఈ నేపథ్యంలో తన పథకాల రూపంలో ప్రజల మనసుల్లో ప్రజా బంధువు గా మారిన కేసీఆరే మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారు.
– కూనూరు శ్రీనివాస్ గౌడ్ 96405 42509
(వ్యాసకర్త: న్యాయవాది)