తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయి.. రాష్ట్రంలో ముఖ్యమైన పదవి సీఎం పీఠాన్ని అందుకున్న రేవంత్.. ఆంధ్రా పార్టీ టీడీపీని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబును ఇబ్బంది పెట్టిన బీఆరెస్‌ను బొంద పెట్టాలని కాంగ్రెస్ నేతగా పిలుపునిచ్చారు. ఇంతకన్నా విచిత్రం మరొకటి ఉండదేమో.
కాంగ్రెస్‌లో ఉన్న మిగతా వారి కన్నా తనకు రాజకీయ అనుభవం తక్కువ అని, అయినా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అవకాశం ఇచ్చిందని ఎన్నోసార్లు తనకు తాను గొప్పలు చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ఆ పార్టీకి ద్రోహం చేసే పనిలో పడ్డారు. సీనియర్లను కాదని తనకు అవకాశం ఇచ్చినందుకు ఆ పార్టీకి గుణపాఠం చెప్పే పనిలో ఉన్నారు. తన గురువైన చంద్రబాబుకు బహుమతిని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ టీడీపీ రాకకు బాటలు వేస్తున్నారు. లేకపోతే రేవంత్ మాటల్లో ఆంతర్యం ఏమిటి? ఖమ్మంలో రేవంత్ తన ప్రసంగంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ను తలుచుకున్నారు. చనిపోయిన వారిని గురించి స్మరించుకోవడం సాధారణమే. కానీ, ఆ తర్వాత ఆయన టీడీపీపై తనకు ఉన్న దురభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ వాళ్లంత బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను కూల్చాడని పిలుపునివ్వడం దురభిమానం కాకపోతే మరి ఏమిటి?
‘తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అనుచరులను నేను కోరేది ఒక్కటే. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో బొంద పెట్టాలని, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏమిటనేది తెలంగాణ సమాజం, ముఖ్యంగా కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు అర్థం చేసుకోవాలి. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 45 టీఎంసీలకు కుదించడం, వివిధ ప్రాజెక్టులపై పసలేని పిటిషన్లు వేయడం, సందర్భం, అవకాశం వచ్చినప్పుడు టీడీపీపై తన అభిమానాన్ని చాటుకోవడం, తెలంగాణలో టీడీపీ అభిమానులను మానసికంగా సిద్ధం చేయడం దేని కోసమో గ్రహించలేనంత అమాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాదనే అనుకుంటున్నాను.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. కేంద్రంలో రేవంత్ గురువు చంద్రబాబు మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. రేవంత్ ఏమో పదేపదే ఢిల్లీ వెళ్తున్నాడు. క్యాబినెట్‌లోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మొదట ఈడీ దాడులు జరిగాయి. ఆ తర్వాత కొండా సురేఖ వివాదం తలెత్తింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలను రేవంత్ మందలించాడు అనే వార్తలు వచ్చాయి. అటు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుకూల చానెల్లో సంచలన కథనం, మళ్లీ ఇప్పుడు భట్టివిక్రమార్క వంతు… ఇదంతా గమనిస్తే అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టుగా అనిపించడం లేదా?
రేవంత్‌రెడ్డి సీఎం పదవిలోనే ఉన్నాడు కదా, ఆయనకు ఇంకేం కావాలి, తెలంగాణలో టీడీపీకి జీవం పోయడం ద్వారా తనకు తానే తన రాజకీయ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాడు అని చాలామందికి అనిపించొచ్చు. కానీ కాంగ్రెస్‌లోని అంతర్గత వైరం ఎప్పుడో బద్దలయ్యే పరిస్థితి ఉన్నది. ఎన్టీవీ కథనం, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు వ్యాసం, భట్టివిక్రమార్క స్పందన.. వీటన్నింటినీ కలగలిపి చూస్తే ఎక్కడో తేడా కొడుతున్నది. సీఎం రేవంతే రాధాకృష్ణకు లీకులు ఇచ్చి వ్యాసం రాయించాడని రాజకీయాల్లో ఉన్నవారే కాకుండా సాధారణ ప్రజలు కూడా నమ్ముతున్నారు.
ఈ పరిణామాలను బట్టి రేవంత్‌కు, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని అర్థమవుతున్నది. పరిస్థితి చేయి దాటితే ఎలా అని ముందు జాగ్రత్తగా రేవంత్ తన కనుసన్నల్లోనే, తను నడిపే పార్టీని తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. రేవంత్ కూడా అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పునరావాసం కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లాడే తప్ప, కాంగ్రెస్‌పై అభిమానంతో కాదు. ఇప్పుడు పదవి ఉన్నది, కావలసినంత డబ్బు సంపాదించుకున్నాడు. ఒక పార్టీ కూడా తన చేతుల్లో ఉంటే ఇక ఎవరినీ ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉండదని రేవంత్ ఆలోచన. అంటే, రేవంత్ కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉంటూ తెలంగాణలో టీడీపీ పార్టీ అనధికార అధ్యక్షుడిగా పనిచేస్తారన్నమాట. రేవంత్ అక్రమాలు బయటికి వచ్చి, లేదా రేవంత్ ఒంటెద్దు పోకడలతో అధిష్ఠానం ఆయనను పక్కన పెడితే ఎలా అన్న దాని నుంచి పుట్టిన ఆలోచనే ఇది. ఇది రేవంత్ ’ప్లాన్ బీ. రైజ్ టీడీపీ’.