‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ ఈ నినాదం తెలంగాణ ఉద్యమ త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన ఆ మూడు మూలసూత్రాలు ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు వేస్తున్నాయి. తెలంగాణ ప్రజలది రక్తంతో రాసిన చరిత్ర. తెలంగాణ ఉద్యమం బానిసత్వం నుంచి విముక్తి కోసం జరిగింది. అలాంటిది మళ్లీ ఆ బానిసత్వంలోకే తోసేస్తే ఎట్లా? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి పరికించి చూస్తే… మళ్లీ రాష్ట్ర ప్రజలను ఆ ఊబిలోకితీసుకెళ్తున్నట్టు అవగతమవుతున్నది. సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరును చూసి… తెలంగాణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తే… తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు పాలన నడుస్తున్నదేమోనన్న అనుమానం ప్రజలకు కలుగుతున్నది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వెనుక 60 ఏండ్ల కష్టం దాగి ఉన్నది. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ అన్న నినాదంతో సాగిందీ పోరాటం. ఆ మూడు హక్కుల్లో ప్రధానమైనదే నీటి హక్కు. మా నీళ్లు మాక్కావాలంటూ సాగిన ఉద్యమం విజయతీరాలకు చేరి… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి… తెలంగాణ తల్లి దాహార్తి తీర్చింది. అలాంటిది సీఎం రేవంత్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వలసాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధిలో, నీటిలో, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. మన ప్రాంతం వనరులలో 40 శాతం పోయినా.. వినియోగంలో మాత్రం మన ప్రాంతానికి తీరని పక్షపాతమే జరిగింది.
తెలంగాణను బాబుకు అప్పగిస్తున్న రేవంత్!: తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నది తిండి పెట్టే భూముల కోసమని నాటి ఉద్యమ నాయకులు గర్జించారు. గోదావరి, నాగార్జునసాగర్, కృష్ణమ్మ, శ్రీశైలం జలాలు తెలంగాణ రైతన్నల జీవనాధారం అన్నారు. ‘నీళ్ల పంపకంలో-తెలంగాణకు తీరని అన్యాయమే’ అనే నినాదంతో.. 2004 నుంచి 2014 వరకు ఉద్యమం జరిగింది. జల వారసత్వం విషయంలో తెలంగాణ రాష్ర్టానికి సరిగ్గా వాటా ఇవ్వడం లేదంటూ.. అనధికారికంగా ఏపీ నీటిని పైకి మళ్లించేసుకుంటుందని పోరాటం చేశారు. దీనికోసం ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా అర్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ డెల్టాలకు నీరు మళ్లించకుండా, ఆంధ్రకు ప్రధాన ప్రాధాన్యాన్నిచ్చారని ఆ నాటి పాలనా విధానాలను నిరసిస్తూ తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘం లాంటి పలు వేదికల్లో తెలంగాణ హక్కులు, న్యాయం కోసం పోరాడారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టులతో తెలంగాణకు నీటి హక్కును నిలబెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రం సహకరించకపోయి నా, ఏపీ తరఫున అడ్డంకులు వచ్చినా ఉద్యమం ఆపలేదు.
రేవంత్ వైఖరి ఏమిటి?: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుతో కలిసి రెండు రాష్ర్టాల మధ్య నీటి బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులు చేయాలన్నారు. ఇది రాజకీయ పరంగా ఓ స్టేట్మెంట్ అయినా దీనివల్ల తెలంగాణ ప్రజల్లో ఒక అసంతృప్తి, అనుమానం ఏర్పడ్డాయి. తెలంగాణకు అన్యాయం చేసిన చంద్రబాబుతో నీటి విషయంలో రేవంత్ ఎలా మైత్రి చేయగలరు? నాగార్జునసాగర్, శ్రీశైలం నీటిపై అప్రూవల్ లేకుండా నీళ్లు తీసుకుపోతున్న విషయమై… గత ప్రభుత్వాలు చేసిన రిప్రెజెంటేషన్ ఇప్పుడెలా విస్మరించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక జాయింట్ స్టేట్మెంట్ మాత్రమే అనుకుంటే పొరపాటు.
తెలంగాణకు తక్కువగా ఇచ్చిన వాటా విషయంలో పోరాడే స్థానం నుంచి… ఇప్పుడు వాటిని బహుళ ప్రయోజనాల పేరుతో పంచుకుంటామనే స్థితి రావడం దేనికి సంకేతం? చంద్రబాబు మీద తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం నమ్మకం లేదు. మితృత్వపు ముసుగులో ఉద్యమ గౌరవాన్ని తాకట్టు పెట్టడం చూస్తుంటే, ఇది ఒక రాజకీయ లబ్ధిగా అవగతమవుతుంది. ఇప్పుడు ఆంధ్రా ప్రభుత్వానికి నీటి విషయంలో సర్దుబాటు చేస్తే.. అది తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టే.
తెలంగాణ నీళ్లు, తెలంగాణ మట్టి.. తెలంగాణ పాలకుడి చేతిలోనే ఉండాలని కేసీఆర్ అన్నారు. కానీ, నేడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించేదే తెలంగాణ ముఖ్యమంత్రి ఆమోదిస్తున్నారా? ఢిల్లీలోనో, అమరావతిలోనో నిర్ణయాలు అవుతున్నాయే గానీ, హైదరాబాద్‌లో తెలంగాణ హక్కులు పట్టించుకునే నాయకుడు లేకుండాపోయారు. బనకచర్ల వలస ప్రాజెక్టులపై తెలంగాణ మౌనంగా ఉంటే.. నీళ్లపై మళ్లీ
ఆంధ్రా ఆధిపత్యం పెరగనిస్తే… రేపు తెలంగాణ ఆందోళన 2.0 ఆరంభం తథ్యం.
బాబు, బీజేపీ, రేవంత్ పొత్తుల వెనుక గుట్టు ఏమిటి?: తెలంగాణ రాజకీయాలను తెలియని మబ్బు కప్పేస్తున్నది. ఒకవైపు చంద్రబాబు, బీజేపీ, రేవంత్‌రెడ్డి మధ్య కనిపిస్తున్న మౌన రాజకీయ స్నేహం. మరోవైపు రాష్ర్టానికి రావాల్సిన హక్కు నిధులు, ప్రాజెక్టులు ఏపీకి మళ్లిపోతుండగా, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు మౌనంగా ఉండటం. ఈ నేపథ్యంలో మూడు పార్టీల నేతలు ఒకే వ్యూహంలో భాగమా? అనే ప్రశ్న ప్రజలకు కలుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం… కేంద్రాన్ని అనేకమార్లు నిధుల కోసం అభ్యర్థించింది.
జాతీయ పథకాలకు విభజన నిధులు, గ్రాంట్లు, ఉమ్మడి రాష్ట్రంలో పన్నుల వాటాలు కావాలని తెలంగాణ అడుగుతున్నది. కానీ, కేంద్రం ఇవన్నీ తెలంగాణకు ఇవ్వకుండా ఉండటమే కాదు, అదే కేంద్రం బాబుకు మాత్రం నిధులు ఏరులై పారేలా ఇస్తున్నది. ఇందులో కొత్తగా ఏమీ లేదు. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కాని విషయం. ఒక రాష్ర్టానికి రావాల్సిన వాటిని మరో రాష్ర్టానికి మళ్లించడమంటే.. అది వాటిపై హక్కు ఉన్నవారి పాలు తీసుకొని, ఇతరులకు పంచడమే! అలాంటి సమయంలో, తెలంగాణ ప్రభుత్వాధినేత ఆక్షేపించకపోవడం విడ్డూరమే.
బీజేపీది రాజకీయ వ్యూహమా లేక పక్షపాతమా?: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తరచూ విమర్శించింది. కుటుంబ పాలన అని, అధికారం దుర్వినియోగం అని ఆరోపించింది. అయితే రేవంత్ ప్రభుత్వం మీద మా త్రం విమర్శలకు దూరంగా ఉంటున్నది. బీజేపీ ఎందు కు తెలంగాణ అభివృద్ధి మాటను ఎత్తడం లేదనేది జవా బు లేని ప్రశ్ననే. ఇవన్నీ చూస్తే బీజేపీ.. కాంగ్రెస్‌కు సాయం చేసే పార్టీగానే కనిపిస్తున్నది.
పాత మితృత్వం.. కొత్త లావాదేవీలు: చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలో చేరడంతో బీజేపీతో ఆయన బంధం బలపడింది. దీని ఫలితంగా విధ్వంసమైన గోదావరి జలాల అంశం, విభజన హామీల అమలు, అమరావతికి నిధుల విడుదల వంటి అంశాల్లో కేంద్రం విశేషంగా సహకరిస్తున్నది. అదే సమయంలో తెలంగాణకు చెందిన డిమాండ్ల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నది. ఇదంతా చూస్తే… ఇది వెనుకటి టీడీపీ శాసనం తెలంగాణపై మళ్లీ ప్రభావం చూపుతున్నదనిపిస్తున్నది.
అనుభవాల మేళవింపు: రేవంత్ సీఎం అయ్యాక.. టీడీపీ శైలిలో రాష్ట్రంలో పాలన సాగుతున్నదన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణలో ముందడుగు లేదు. నీటి సమస్యలపై ఏపీ అధికారులతో ఎదురెదురుగా పోరాటం లేదు. విభజన చట్టంలోని హామీలపై కేంద్రంపై ఒత్తిడి లేదు. ఇవి అంతా ఒక సాంకేతిక సహకారంగా కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీగా కనిపిస్తున్నాయి. ఇదే బీజేపీకి నచ్చిన రాజకీయం కావచ్చు. ఇదే, చంద్రబాబుకు అవసరమైన సంధి కావచ్చు. ఇదే రేవంత్‌కు చట్టబద్ధతగా మిగిలిన ధర్మం కావచ్చు. కానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం ఇది తీరని అన్యాయం. అందుకే, మరో పోరాటం అనివార్యం.
– (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి