సవాళ్లు విసరడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముందూ వెనుకా ఆలోచన లేనట్టున్నది. తనను మించిన పాలకులు ఈ దేశంలోనే లేరని పదే పదే పలకడం ఆయనకు అలవాటైపోయింది. ఎవరి పాలననైనా అక్కడి ప్రజలు మెచ్చుకోవాలి, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించాలి కానీ, తనకు తానే గొప్పగా చెప్పుకోవడం సంస్కారం కాదు. సవాళ్లు చేయాలనుకుంటే రేవంత్‌రెడ్డి తనలాగే కొత్తగా, తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో పోల్చుకోవాలి. దాన్ని సమఉజ్జీ అంటారు. ఆ పోలికకు కూడా అర్థం ఉంటుంది. దశాబ్దానికి పైగా వివిధ హోదాల్లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసిన వారితో ‘నాతో సవాలుకొస్తారా!’ అనడం తన హద్దులను మీరి మాట్లాడటమే అవుతుంది.
ప్రధానంగా ఒకరి పాలన మరొకరితో పోల్చి చూసేందుకు కుదరదు. ఇలాంటి సవాళ్లు, చర్చలు కాలయాపనకే పనికివస్తాయి. రేవంత్ రెడ్డి అడిగారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వాటి అధికారులు లెక్కలన్నీ ముందేసుకొని సమాధానాలు సిద్ధం చేయరు. ఆయన సవాళ్లను రాజకీయ ఎత్తుగడగానే తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి చేసే ప్రసంగాల్లో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడటమే ఎక్కువగా ఉంటుంది. ఆయన మాటల్లోని దురుసుతనం ఇతరులను అగౌరవపరిచేలా, తన కుర్చీ విలువ తగ్గేలా కనబడుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకురాగానే నిండు సభలో శివాలెత్తడం ఆయనకు సహజ ధోరణి అయిపోయింది. నిజానికి కేసీఆర్ పోరాటం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ప్రత్యేక రాష్ట్రం రాకుంటే రేవంత్‌కు ముఖ్యమంత్రి సీటు దొరికేదే కాదు. మిగులు రాష్ర్టాన్ని అప్పుల కుప్ప చేశారని గెలిచిన రోజు నుంచి వల్లించడం కాంగ్రెస్ పెద్దలకు మామూలైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పాలనా అవకాశం వడ్డించిన విస్తరిలా దొరికింది. అలవికాని హామీలతో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అంచనా వేయలేని కబోదితనం కాంగ్రెస్ పెద్దలది. గెలిచిన తర్వాత పాత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం చేతగాని తనమే అవుతుంది. చేతికొచ్చిన పాలనలో తమ శక్తియుక్తులేమిటో ప్రదర్శించి ప్రజల మెప్పు పొందడం కాంగ్రెస్ ముందున్న కర్తవ్యం.
ఈ మధ్య నారాయణపేట బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి తన పాత సవాల్‌ను మరోసారి విసిరారు. తన ఏడాది పాలనతో కేసీఆర్, నరేంద్ర మోదీ పదేండ్ల పాలనను పోల్చి చర్చించేందుకు ఆ పార్టీల నేతలు సిద్ధమా అని ప్రకటించారు. నిజానికి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న పథకాలన్నీ కేసీఆర్ సృష్టియే. వాటికే కొంత మొత్తాన్ని పెంచి చెప్పి ఓటర్లను తమ వైపు తిప్పుకొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడా అమలుచేస్తున్నారు. దీనివల్ల గిరాకీ తగ్గి నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి, వారికి ఇంతవరకు ప్రభుత్వం చేసిందేమీ లేదు.
కేసీఆర్ పథకాలకు పేర్లు మార్చి, సొమ్ము పెంచామన్నా వాటి అమల్లో ఎన్నో వైఫల్యాలున్నాయి. రైతు రుణమాఫీ అందరికీ అందలేదు. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడలేదని రైతులంటున్నారు. పంటల బీమా ఊసే లేదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అభ్యర్థనల్లో సగం మందికి 2024, ఆగస్టులో నిధులు విడుదల కాగా, మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. తులం బంగారం మాత్రం ఎవరికీ ముట్టలేదు.
పదవీ విరమణ పొందిన వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఏడాదిగా మూలన పడ్డాయి. సర్వీసు కాలంలో కూడబెట్టుకున్న మొత్తం, ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సొమ్ము విశ్రాంత ఉద్యోగులకు ఎంతో అవసరం. ఎక్కడివాళ్లక్కడ అసంతృప్తితో బేజారవుతుండగా ‘నాసాటి లేరెవ్వరు’ అని అనడం మన ముఖ్యమంత్రికే చెల్లింది. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, రైతులకు రూ.22 వేల కోట్ల రుణమాఫీ.. ఈ రెండింటినీ పదే పదే ప్రస్తావిస్తూ పది నెలల కాలంలో దేశంలో ఎవరైనా ఈ ఘనకార్యం చేశారా అని సవాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తన గొప్ప అని చెప్పుకొనే ప్రతి మాట వెనుక తెలంగాణ ప్రజల త్యాగం, బీఆర్ఎస్ కృషి ఉన్నవి. అయితే, అంతా తన ప్రతిభతోనే మొదలైనట్టు, తాను ముఖ్యమంత్రి అయ్యాకే సాధించినట్టు చెప్పుకోవడం ఆయనకు అలవాటైపోయింది.
నిజానికి ఆయన ఎక్కుతున్న ప్రతి మెట్టు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిలో భాగంగా నిర్మించబడినవే. ఆ విషయం స్పష్టంగా తెలిసినా పాత ప్రభుత్వానికి ఏ కీర్తి దక్కవద్దని జాగ్రత్త పడుతూ, అంతా నా గొప్పతనమే అని చెప్పుకొంటున్నారు. 2024, జనవరిలో సుమారు 7 వేల నర్సు పోస్టులకు నియామక పత్రాలు అందజేసినప్పుడు కూడా ఈ ప్రక్రియను గత ప్రభుత్వం ఆరంభించింది అని ఒక్క మాట అనలేదు. మొన్నటికి మొన్న యాదగిరిగుట్టలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యారు. భక్తులు, దాతల నుంచి బంగారాన్ని సేకరించిన ఘనత గత ప్రభుత్వానిది. రేవంత్‌రెడ్డి అదృష్టజాతకుడు. పిసరంత బంగారం కూడా ఇవ్వకుండా తన చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించే అవకాశం ఆయనకు దక్కింది. గోపురానికి అవసరమైన బంగారం, నిధుల సేకరణ అంతా కేసీఆర్ హయాంలో జరిగింది. దాతల్లో కిలో బంగారం ఇచ్చినవారు కూడా ఉన్నారు. అయితే, ఈ ఉద్ఘాటన సందర్భంగా దాతలందరికీ ఆహ్వానం అందిందో లేదో కానీ, వారికోసం ఏర్పాటుచేసిన కుర్చీలు చాలావరకు ఖాళీగా ఉన్నాయని పత్రికల్లో వచ్చింది.
ఇక బీజేపీపై ఆయన చేస్తున్న సవాళ్లు ప్రధాని మోదీ లక్ష్యంగా సాగుతుంటాయి. మోదీ 14 ఏండ్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క సంవత్సరమైనా 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశారా అని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను ప్రశ్నిస్తూ.. చర్చకు రమ్మంటున్నారు. ఒక ప్రభుత్వం చేసినదాన్ని మరో ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రాథమ్యాలు వారికి ఉంటాయి. ఇప్పుడు రేవంత్‌రెడ్డి అడిగాడని ఆ ప్రభుత్వం పాత లెక్కలన్నీ ముందేసుకొని సమాధానం చెప్పదు. మరోసారి కేంద్రంలో పన్నెండేండ్ల మోదీ పాలన, తెలంగాణలో 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రులకు సవాలు విసురుతారు. ఈ చర్చలో తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తాననడం చౌకబారుగా ఉన్నది. రేవంత్‌రెడ్డి సవాలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సరే అంటూ తారీఖు, స్థలం నిర్ణయిస్తే చర్చకు వస్తామన్నారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం ఇంతవరకు రాలేదు.
ప్రధానంగా ఒకరి పాలన మరొకరితో పోల్చి చూసేందుకు కుదరదు. ఇలాంటి సవాళ్లు, చర్చలు కాలయాపనకే పనికివస్తాయి. రేవంత్ రెడ్డి అడిగారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి అధికారులు లెక్కలన్నీ ముందేసుకొని సమాధానాలు సిద్ధం చేయరు. ఆయన సవాళ్లను రాజకీయ ఎత్తుగడగానే తేలిగ్గా తీసుకుంటున్నారు. మొదటి సంవత్సరం సరే.. మరో ఏడాది కూడా కాంగ్రెస్ పాలన గడవనీ.. మరో 55 వేల మంది ఉద్యోగాల్లో చేరనీ, స్థానిక ఎన్నికలు పూర్తవనీ, రైతులకు రెండు పంటల భరోసా అందనీ, కులగణన ప్రయోజనాలు బీసీలకు దక్కనీ.. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కానీ.. సవాళ్లు విసరడమే కాదు, వాటిని ఎదుర్కొనే కాలం కూడా కాంగ్రెస్‌కు వస్తుంది. అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకొంటే చాలు.
-బద్రి నర్సన్
9440128169