రాజన్న సిరిసిల్ల, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సంక్షోభంలో కూరుకుపోయింది. బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వక.. పాత బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చూపడంతో నేతన్నల ఉపాధి కరువైంది. మళ్లీ ఆత్మహత్యలు, వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సాంచాలు తుక్కు కింద అమ్మకొనే పరిస్థితులు దాపురించాయి. దాదాపు 7వేలకుపైగా సాంచాలు తగ్గినట్టు తెలుస్తుండగా, ఎంతో మంది కార్మికులు ఇతర రంగాల్లోకి వెళ్లిపోయారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ తీవ్ర సంక్షోభం, ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలతో తల్లడిల్లింది. నేతకార్మికుల పరిస్థితి దయనీయగా ఉండేది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్, అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో ఉరిశాలగా ఉన్న సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. పదేండ్ల కాలంలో చేనేత, మరమగ్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, రూ.1,200 కోట్లు బడ్జెట్లో పెట్టి, కార్మికులకు చేతినిండా పనికల్పించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పునర్జీవం పోశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.3,964 కోట్లతో నిధులు వెచ్చించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అండగా నిలిచారు. ఏటా బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పనికల్పించారు. యజమానులు, ఆసాములు, నేతకార్మికులు, అనుబంధ కార్మికులు సంతోషంగా ఉన్నారు. కానీ 2023లో సర్కార్ మారడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. మళ్లీ పదేండ్ల కిందటి పరిస్థితులు ఉత్పన్నమై, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ క్రమంగా సంక్షోభంలోకి కూరుకుపోయింది.
ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక కార్మికులు ఆగమయ్యారు. చేతినిండా పనికరువై ఆందోళనలు చేశారు. పది మందికిపైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తప్పని పరిస్థితుల్లో సర్కార్ ఇందిరమ్మ చీరల పేరిట ఆర్డర్లు ఇచ్చినా చేతినిండా పని చూపలేకపోయింది. ఉపాధి చూపాలని నాయకులను కోరితే నేతన్నలను అవమానించారు. బెదిరింపులకు కూడా దిగారు. ఈ పరిస్థితుల్లో ఎంతోమంది మరమగ్గాల కార్మికులు ఇతర పనులకు మళ్లారు. బీఆర్ఎస్ పాలనలో 31 వేల మరమగ్గాలు ఉండగా, 2023 తర్వాత ఆసాములు, కార్మికులు ఎంతోమంది తమ ఖార్ఖానాలను ఎత్తేశారు. మరమగ్గాలను తుక్కుకు అమ్ముకొని ఇతర పనుల్లోకి వెళ్లారు. మరమగ్గాల సంఖ్య క్రమంగా తగ్గుతూ రాగా, ప్రస్తుతం 23,304 మరమగ్గాలే ఉన్నట్టు సర్కార్ తాజాగా చేస్తున్న సర్వేలో తేలింది. ఇది సిరిసిల్లలో చేనేతల అధ్వాన బతుకులకు అద్దం పడుతున్నది.
మరమగ్గాల కార్మికులను యజమానులుగా చేసే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ స్కీమ్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలోనే అత్యధిక మరమగ్గాలు ఉన్న సిరిసిల్లలోని కేటీఆర్ ప్రత్యేక చొరవతో 88 ఎకరాల్లో వీవింగ్ పార్క్ ఏర్పాటైంది. రూ.387.61 కోట్లతో వర్క్షెడ్లను నిర్మించి, మౌలిక వసతులు, రోడ్లు, అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. 1,104 మంది నేత కార్మికులకు ఒక్కో కార్మికుడికి 4 సాంచెలు ఇచ్చి యజమానులుగా చేయాలని భావించింది. అంతలోనే ప్రభుత్వం మారడం శాపంలా మారింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అటకెక్కించింది. దీంతో మరమగ్గాల కార్మికులు నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా కోల్పోయారు. రెండేండ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. అయినా పట్టించుకునేవారు లేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సర్కార్ మరమగ్గాలకు జియోట్యాగింగ్ చేస్తున్నది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన వాటికి, అలాగే యజమానులుగా మారిన వాటికి కార్వీ సంస్థ సర్వే చేస్తున్నది. నూతనంగా 2,791 మరమగ్గాలకు సర్వే చేసి, బార్కోడ్ ఇచ్చింది. వీటితో కలిపి ప్రస్తుతం మొత్తం 23,304 మరమగ్గాలే ఉన్నట్టు అధికారుల ద్వారా తేలింది. అందులో డాబీ, జకార్డులు కలిపి 16,357 మరమగ్గాలు ఉన్నాయి. అయితే సర్కార్ మాత్రం ఆర్డర్లు ఇవ్వకపోవడం, బకాయిలు చెల్లించకపోవడం వంటి వాటిపై నేతన్నలు మండిపడుతున్నారు.
కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలు, నేతన్న సంక్షేమ పథకాలు మంచిగ వచ్చినయి. మేం కూడా సంతోషపడి మా నాన్న దత్తుతో కలిసి రూ.4 లక్షలతో ఐదు జోడీల మరమగ్గాలను కొన్నం. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో మంచిగా నడిపినం. ప్రస్తుత ప్రభుత్వం నిర్వాకంతో ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. కొంతమంది పనిలేక ఆత్మహత్యలు చేసుకున్నరు. మేం పెట్టిన చిన్నపాటి ఖార్ఖానాకు కిరాయి కట్టలేక ఐదు జోడీల మరమగ్గాలను అమ్ముకున్నం. నేను ట్రాక్టర్ షోరూమ్‌లో పనికి చేరిన.
ప్రభుత్వం మారిన తర్వాత పరిశ్రమ సంక్షోభంలో పడింది. నేను 1999 నుంచి మరమగ్గాలు నడుపతున్న. 4 జోడీలతో ఖార్ఖానా ప్రారంభించిన. తర్వాత క్రమంగా పెంచుతూ 125 జోడీలు వేసుకొని ఐదు, ఆరు షెడ్లను కిరాయికి తీసుకున్న. వస్త్ర ఉత్పత్తి చేసిన. ఆసామిగానే ఉంటూ సుమారు 70 మంది కార్మికులకు ఉపాధి కల్పించిన. 2014 తర్వాత కేసీఆర్ సర్కార్ సిరిసిల్ల పరిశ్రమను మంచిగ చేసింది. సిరిసిల్ల దశ మారింది. కాంగ్రెస్ సర్కార్ రాగానే వస్త్ర పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సాంచెలను అమ్ముకొని మా వీధిలోనే కిరాణా దుకాణం పెట్టుకొన్నం.