హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవీ? ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణకు ఎట్లా వస్తవ్?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీకి దమ్ముంటే అనంతగిరికి కాకుండా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి తమకు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
ఈ మేరకు నిరుద్యోగ జేఏసీ నేతలు ఆదివారం చిక్కడపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘మేం రేవంత్‌రెడ్డిని చూసి కాంగ్రెస్‌కు ఒట్లేయలేదు. ఎన్నికల సమయంలో చిక్కడపల్లి ల్రైబరీకి వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగుల భుజాలపై చేతులు వేసి, మాతో కలిసి టీ తాగుతూ కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకొస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం, యూపీఎస్సీ తర్వాత జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామంటే నమ్మి ఆ పార్టీకి ఓట్లేసినం. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా తెలంగాణలోకి ఎట్లొస్తవ్? రాహుల్ గాంధీ కబడ్దార్’ అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేశాకే తెలంగాణకు రావాలని ఆయనకు స్పష్టం చేశారు. ర్యాలీలో నిరుద్యోగ జేఏసీ నేతలు లక్ష్మణ్, వెంకటేశ్, కిరణ్ రాథోడ్, సురేశ్, మధు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని, రెండు వేల గ్రూప్-2, మూడు వేల గ్రూప్-3 పోస్టులతోపాటు మరో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చెప్పారు. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఇంత వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైపెచ్చు మాపై పోలీసులను, లాఠీలను ప్రయోగిస్తున్నారు. నిరుద్యోగులకు ఏం ఒరగబెట్టారని ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు? ఆయన చెప్పిన 2 లక్షల ఉద్యోగాలిచ్చిన తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలే.
– చెల్లెపాటి లక్ష్మణ్, నిరుద్యోగ జేఏసీ నేత
రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా మాకు న్యాయం జరుగుతుందని, 2 లక్షల ఉద్యోగాలొస్తాయని నమ్మి కాంగ్రెస్ విజయం కోసం కష్టపడ్డాం. గ్రామాల్లోకి వెళ్లి ఆ పార్టీకి ప్రచారం చేసినం. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 70 వేల పోస్టులను భర్తీ చేశామని అబద్ధాలాడుతున్నరు. ఇప్పటివరకు 14 మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు. ఇంత మంది చనిపోయినా మీకు కనికరం లేదా? మాకు తీవ్ర అన్యాయం జరిగినా స్పందించని రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగుపెడుతున్నావ్?.
– కయ్య వెంకటేశ్, నిరుద్యోగ జేఏసీ, చిక్కడపల్లి లైబ్రరీ