అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్సిన పనిలేదు, ఒక బస్తీలోని నాలుగు గడపలు దాటి, స్థానికులైన నలుగురిని పలకరిస్తే చాలు తెలిసిపోతుంది. నాడు కేసీఆర్ చెప్పిందేమిటి, ఇప్పుడు రేవంత్ చేష్టలతో జరుగుతున్న నష్టాలేమిటనేవి అన్నీ అనుభవంలోకి వస్తున్నాయి. తామేం కోల్పోతున్నామో ప్రజలు గుక్క తిప్పుకోకుండా చెప్పుకొని బాధపడుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్‌గూడ, ఎల్ఎన్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, కృష్ణానగర్, షేక్‌పేట, కార్మికనగర్ ప్రాంతాల్లో జనాలను కదిలిస్తే చాలు కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఇంత్తెతున లేస్తున్నారు. గులాబీ కండువాను కండ్ల చూసుకుంటూ, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తిరుగుతున్న ప్రతి కార్యకర్తను మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంటున్నారు. ముదనష్టపు సర్కార్ తీరును చెప్పలేని మాటలతో తిట్టిపోస్తున్నారు. ‘ఎంత దరిద్రపు ముఖ్యమంత్రి వచ్చెరా భగవంతుడా..’ అని నెత్తీ నోరు కొట్టుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
‘హైడ్రాల మన్నువడ కండ్లు మూసుకుపోతున్నా కనిపెట్టుకొని ఉండేటట్టు చెయ్యబట్టె కదరా’ అని భయాందోళన వెలిబుచ్చుతున్నారు. ‘పొద్దంతా పనుల్జేసి బుక్కెడు తిని పందామంటే ఎవడెటునుంచి వస్తడో, ఏ బుల్డోజర్ వచ్చి ఎక్కడ మీదపడ్తదోనని బెంగటిల్లి సచ్చేకాలం మోపైంది’ అంటున్నారు. ‘ఈ ఆలోచన ఎవనికచ్చిందో, ఏ పుణ్యాత్ముడు పుణ్యం గట్టుకుంటున్నడో గానీ హైడ్రా అంటే కరోనాకు కూడా అంతగనం భయపడలేదయ్యా.. గంతకన్నా ఎక్కువ భయపెట్టిస్తాంది’ అని కంటనీరు పెట్టుకుంటున్రు. ‘గదొచ్చిన కాడినుంచి ఓ పండుగ లేదు, పబ్బం లేదు. మంచి, చెడు లేదు. అసలు ఎన్నేండ్ల నుంచి ఉంటున్నారో అడిగినోడు లేడు. ఇండ్లకు కాయిదాలున్నాయా.. లేవా.. అని అర్సుకున్నోడే కనిపించలేదు. రాత్రయితే చాలు జేసీబీలు వస్తయ్.
ఇండ్ల మీద ఇర్సుకుపడ్తయ్. గింత పైశాచికం ఏందిరా నాయినా..’ అని వాపోతున్నారు. ‘హైదరాబాద్‌ల ఉన్నమా, పాకిస్థాన్‌ల ఉన్నమా, మూడు నాలుగు తంతెల నుంచి ఈన్నే బతుకుతూ పోరగాండ్లతో జీవితాలు గడుపుతుంటే ఇయ్యాల్నే కొత్తగొచ్చి ఇండ్లు కట్టుకున్నట్టుగా ఎందుకు జేస్తున్నరో అర్థం కావడం లేదు’ అని నిలదీస్తున్నారు. పగోడైనా కొంచెం టైం ఇస్తడేమో గానీ ఈ హైడ్రా ఆఫీసర్లు మాట్లాడనిచ్చుడే లేదని, ఏమన్న చెప్తమనుకుంటే సర్కార్ చెప్పింది చేసి తీరుతమని అడ్డదిడ్డంగా కూలగొడ్తనే ఉన్నారు. ఓ వాన లేదు, చలి లేదు, బురద లేదు, వరద లేదు. ముల్లెమూట సదురుకునే సమయం ఇయ్యకుండా మెడలు పట్టి రోడ్డుకు గుంజి కట్టుబట్టలతోని నిలబెడుతాండ్రని బిక్కుబిక్కున నక్కిన చేదు ఘటనలను నెమరేసుకొని చలించిపోతున్నారు. పండుగ పూట అని గూడ సూడకుండా తడిబట్టలతో పిల్లాజెల్లతో కూలిన ఇండ్ల పక్కన బతికున్న శవాల లెక్క పన్నం అని రేవంత్ ప్రభుత్వ నిర్వాకంపై దుమ్మెత్తి పోస్తూ చేదు ఘటనలను తలుసుకొని ఉలిక్కిపడుతున్నారు.
అతార పోయింది, పతారా కూడా పోతున్నది. ఇప్పటికైనా మేల్కోకపోతే మొదటికే మోసం వస్తదని జనాలకు మాత్రం స్పష్టత వచ్చింది. పోయిన ఎన్నికల్లో అంటే 2023 ఎన్నికల్లోనే కేసీఆర్ నెత్తినోరు కొట్టుకొని చెప్తే ఇనకపోతిమని, ఇప్పుడు చేసుకున్నోళ్లకు చేసుకున్నంతనే విషయం అనుభవంలోకి వచ్చిందనే వారి మాటల్లో తెలుస్తున్నది. ఆ పూట ఎన్నికల ప్రచారంల గులాబీ బాస్ ఇప్పుడిప్పుడు కుదురుకుంటాన్నం. మాట నమ్మి మోసపోతే గోసపడాల్సి వస్తదని చెప్పిన మాటలు నియోజకవర్గ ప్రజలంతా వల్లె వేసుకుంటున్నారు. రెండేండ్లు కూడా కాలేదు రేవంత్ సర్కార్ నగరం అందాన్నే రూపుమాపే పనికి దిగిన చర్యలు, అధికారుల సమన్వయ లోపాల ఫలితాలు, బీదాబిక్కిని కష్టాలపాలు జేస్తున్న ఘటనలు, ఫలాలు ఒక్క గడపకు కూడా అందకుండా హస్తం నాయకుల ఇండ్లకు మాత్రమే చేరుతున్న చేదు నిజాలు ప్రజలను మరింత ఉసిగొల్పుతున్న చాయలు నియోజకవర్గంలోని ఏ గల్లీలో చూసినా స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాలే.
గప్పుడు జేసిన తప్పును మళ్ల చేయకుండా ఈ సారి రాష్ట్ర సర్కార్‌కు చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలని, కనికట్టు చేష్టలతో, మభ్యపెట్టే మాటలతో వచ్చే ఒక్కొక్కడిని చెండి లెక్క ఆడుకొని ఉరికియ్యాలని నిర్ణయించుకున్నారు. సర్కార్‌కు సోయి రావాల్నంటే ఈ తీర్పుతోనే సాధ్యమని, ఖర్మగాలి ఇక్కడ ఆ రౌడీ గెలిస్తే తమ బతుకులు ఆగమే అని అంతా ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ గా జెండా ఎగిరితే మనల్ని మనం మోసం చేసుకున్నోళ్లమే అవుతామని, తప్పు దిద్దుకుని రాబోయేది కారు సర్కార్ అని, కేసీఆర్ మళ్లోసారి ముఖ్యమంత్రి అయితే బతుకులు గాడిన పడ్తాయని సోయితో ఓటేసి చూపాలని నియోజకవర్గ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారు. గులాబీ పార్టీకి జూబ్లీహిల్స్ పట్టా ఇచ్చినట్టే మల్లోసారి గెలిపించిద్దామని, లేదంటే అతార పతార కాదు, ఏకంగా ఆశలే ఆవిరైపోతాయని గమనించి కృత నిశ్చయంతో ఓటింగ్ కోసం కాచుక్కూర్చున్నారు.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817