రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పేరు ఖరారు కాగానే ప్రగతిభవన్ ముందు ఉన్న సెక్యూరిటీ గేట్లను తొలగించి ‘గడీలను బద్దలు కొట్టాం, ఇది ప్రగతిభవన్ కాదు, ఇకనుంచి ప్రజా భవన్, రేపటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తాం,ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలను చెప్పుకోవచ్చు, ఆ సమస్యలన్నీ చిటికెలో తేల్చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి వీరావేశంతో ప్రకటించారు.
అంతే కాదు, ‘ఇక నుంచి నేను వచ్చి, వెళ్లేటప్పుడు ఎక్కడా ట్రాఫిక్‌ను ఆపొద్దు, ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, నేను సీఎంను అయినా సామాన్య వ్యక్తిలానే తిరుగుతాను’ అని ప్రకటించారు. రేవంత్ అనుకూల మీడియా, వందిమాగదులు రేవంత్ నిర్ణయాలను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి ‘ప్రతి రోజూ సచివాలయానికి వస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను’ అని కూడా ప్రకటించారు.
ప్రజాభవన్ ముందు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు తొలగించి వాటి స్థానంలోనే ముళ్ల కంచెలను వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ఉండకుండా, అందులో ఉన్న రెండు భవనాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలకు కేటాయించారు. గతంలో కేసీఆర్ సమావేశాలు నిర్వహించే జనహిత భవన్‌ను ప్రజాదర్బార్‌కు కేటాయించారు. ఇక సీఎం రేవంత్ అధికారిక నివాసం కోసం మొదట మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని, ఆ తర్వాత బేగంపేటలోని పైగా ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఏడాది దాటినా ఇంకా జూబ్లీహిల్స్‌లోని తన ప్యాలెస్ నుంచే రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. కంచెలు లేని పాలన అని ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి తన ఇంటికి రెండు కిలో మీటర్ల దూరం నుంచే బారికేడ్లు పెట్టి ఎవరినీ రాకుండా నియంత్రిస్తున్నారు. ఇక రోజూ సచివాలయానికి వస్తానని ప్రకటించిన రేవంత్ అసలు దానివైపే కన్నెత్తి చూడటం లేదు. సచివాలయంలో వాస్తు దోషం ఉన్నదంటూ గేట్లను మార్చడమే కాకుండా, 6వ అంతస్తును పూర్తిగా దిగ్బంధం చేశారు. ఆ అంతస్తులో రహస్యంగా మార్పుచేర్పులు చేస్తుండటం గమనార్హం. సచివాలయం ఎదురుగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. వాటిని పక్కదారి పట్టించడం కోసం సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్న నగలు, కిరీటం తొలగించి తెలంగాణ తల్లిని పేద తల్లిగా ఏర్పాటు చేయడం, ఆ పేద తల్లే తెలంగాణకు ప్రతీక అని తనకు తాను ప్రకటించుకోవడం విడ్డూరం. ఇక అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు ఉద్యమబాణీకి బదులు ఎం.ఎం.కీరవాణితో కొత్త బాణీ కట్టించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం, టీఎస్ (తెలంగాణ స్టేట్) స్థానంలో టీజీ అని మార్చడం, అందుకోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం గమనార్హం.
ఈ ఏడాది పాలనలో టీఎస్ స్థానంలో టీజీ ఎందుకు పెట్టారు? బలవంతంగా రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడానికి కారణం ఏమిటి? ఆ తర్వాత హడావుడిగా సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ఎందుకు? ఆ విగ్రహంలో కూడా మార్పులు చేయడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఒక్కదానికీ రేవంత్ వద్ద గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద గానీ సహేతుకమైన సమాధానం లేకపోవడం గమనార్హం. ఇక రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు గానీ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గానీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఎవరూ రాకపోవడం, ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనించాల్సిన అంశం.
ఇక ఈ విషయాలన్నీ పక్కనపెట్టి 14 నెలల రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే అంతా బభ్రాజమానం, భజగోవిందం. హైదరాబాద్‌లో చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు అం టూ హైడ్రాను తీసుకువచ్చారు. పద్నాలుగు నెలల కాలంలో పేదల ఇండ్లు కూల్చడమే లక్ష్యంగా శని, ఆదివారాలు హైడ్రా రేయింబవళ్లు పనిచేస్తున్నది. హైకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ సర్కార్ పేదల ఇండ్లను కూల్చడం ఆపలేదు. ఇదిలా ఉంటే ఆ హైడ్రా పెద్దల ఇండ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇక లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటూ ఊదరగొట్టి ఏకంగా మంత్రులు, జర్నలిస్టులతో కూడిన బృందాన్ని అట్టహాసంగా సియోల్‌కు పంపి హడావుడి చేసిన రేవంత్ మూసీ పరీవాహక ప్రాంతంలో ఇండ్లను కూల్చేందుకు మార్కింగ్ చేయడం, కొన్ని ఇండ్లను కూల్చడంతో పలువురు పేదలు ఆవేదనతో మరణించారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం కలగలేదు. ఇక నుంచి పేదల ఇండ్లను కూల్చబోమని భరోసా ఇవ్వలేదు.
ఇక ట్రిపుల్ ఆర్ పేరుతో దక్షిణ భాగంలోని రహదారిలో చేస్తున్న మార్పుచేర్పులు, దాని కోసం లాక్కుంటున్న పేదల భూముల విషయంలో బాధితులు రగిలిపోతున్నారు. అవసరం లేని అత్యంత విశాల రహదారులు నిర్మిస్తూ తమ ఆస్తులను పెంచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చేపట్టాల్సిన ఈ రహదారికి సంబంధించిన డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తయారుచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇక రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మొదట ఫార్మా క్లస్టర్ పేరుతో లగచర్ల, దాని చుట్టుపక్కల తండాలలో గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం గిరిజనులు, రైతులు తిరగబడటంతో రివర్స్ గేర్ వేసుకున్నది. అంతేకాదు, వారిని నిర్బంధించి, కేసులు పెట్టి 33 రోజుల పాటు జైలుపాలు చేసింది. దీంతో విషయం జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్లింది. అయినా పేదల భూములను వదలకుండా ఫార్మా క్లస్టర్ స్థానంలో ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ కొత్త రాగం ఎత్తుకొన్న కాంగ్రెస్ ప్రభు త్వం ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నది. ఈ వేధింపులకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-శ్రీధర్ ప్రసాద్