Revanth Reddy | ఒక స్థాయికి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరికీ విలువల గురించి చెప్పాలని ఉంటుంది. ఇది అత్యంత సహజమైన లక్షణం. దీనిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. జర్నలిస్ట్‌ల హౌజింగ్ సొసైటీకి చెందిన దాదాపు 1100 మంది జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాలో విలువలు, యూట్యూబ్ చానల్స్ విశృంఖలత, రాజకీయాల్లో విలువల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద తమను విమర్శించారని యూట్యూబ్ ఛానల్స్ చర్చలతో తీవ్రంగా స్పందించినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం పెద్దగా స్పందించలేదు.
కాంగ్రెస్‌లో జూనియర్ అయినా ‘కాంగ్రెస్‌కు ఏకైక ఆశాకిరణం’ రేవంత్‌రెడ్డి అనే విధంగా ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి సొంత యూట్యూబ్ బృందాలు విశేషంగా కృషిచేశాయి. మంచి కన్నా, చెడు ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది. అలా అప్పుడు రేవంత్‌రెడ్డి యూట్యూబ్ బృందం విజయవంతంగా పనిచేసింది… రేవంత్‌రెడ్డి తక్కువ కాలంలో రాజకీయాల్లో ఎదగడానికి, కాంగ్రెస్ సీనియర్లను పక్కనపెట్టి ఏకైక ఆశాకిరణం అనుకునే స్థాయికి చేరుకోవడానికి మీడియాతో పాటు రేవంత్‌రెడ్డి సొంత యూట్యూబ్ సైన్యం గణనీయమైన పాత్ర పోషించింది.
రవీంద్రభారతిలో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో మీడియా, రాజకీయ పార్టీల అనుబంధం గురించి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల అనుబంధం లేని మీడియా కూడా ఉందా? ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా?
మీడియా గురించి, విలువల గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాక దాదాపు 15 ఏండ్ల కిందట రేవంత్‌రెడ్డి సమక్షంలోనే జరిగిన ఒక చర్చ గుర్తుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నది. టీడీపీ అప్పటి అధికార పక్షానికి చెందిన పత్రిక సాక్షిని టార్గెట్ చేసింది. అప్పటివరకు మీడియా అంటే దాదాపు 90 శాతం టీడీపీ అనుకూల మీడియానే. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మీడియా నిలవడం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు కంటగింపుగా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు లాబీలోని తన ఛాంబర్లో మీడియాతో బాబు మాట్లాడుతూ ‘అక్రమ సంపాదనతో పెట్టిన మీడియాలో మీరు ఎలా పనిచేస్తారు, బయటకు రండి’ అని మీడియాను ఉద్దేశించి ఆగ్రహంగా పలికారు. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడే ఉన్నారు. టీడీపీ బీట్ రిపోర్టర్‌గా ఆంధ్రభూమి తరపున నేను అక్కడ ఉన్నాను.
బాబు ఆవేశం మీద నీళ్లు చల్లుతూ ‘కాంగ్రెస్ పత్రిక అక్రమ సంపాదనతో పెడితే మీ పార్టీకి అండగా ఉండే పత్రిక ఏ సంపాదనతో పెట్టారు? ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ పత్రికనే కొనేశాడు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడబెట్టి కొన్నాడా?’ అని నేను ప్రశ్నిస్తే బాబు సమాధానం చెప్పలేదు. ఛాంబర్ నుంచి బయటకు వచ్చాక రేవంత్‌రెడ్డి నాతో ‘నిజమే నువ్వు చెప్పేదాకా ఆ ఆలోచన రాలేదు. అన్ని పత్రికలు అంతే కదా?’ అని అబ్బురపడిపోయారు. రేవంత్‌రెడ్డి ఆనాటి అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆయన టీడీపీ శాసనసభ్యుడు మాత్రమే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అచ్చం ఆ రోజు చంద్రబాబు ఆలోచన విధాంలోనే ఈ రోజు రేవంత్‌రెడ్డి చెప్తూ రాజకీయాల్లో, మీడియాలో విలువల గురించి బోధిస్తున్నారు.
కాంగ్రెస్‌లో జూనియర్ అయినా ‘కాంగ్రెస్‌కు ఏకైక ఆశాకిరణం’ రేవంత్‌రెడ్డి అనే విధంగా ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి సొంత యూట్యూబ్ బృందాలు విశేషంగా కృషిచేశాయి. మంచి కన్నా, చెడు ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది. అలా అప్పుడు రేవంత్‌రెడ్డి యూట్యూబ్ బృందం విజయవంతంగా పనిచేసింది. చివరికి కాంగ్రెస్ పార్టీ వాళ్లే యూట్యూబ్ బృందాల ద్వారా కాంగ్రెస్ సీనియర్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ యూట్యూబ్‌లను నడిపించే స్థావరాలపై దాడులు కూడా జరిపారు. రేవంత్‌రెడ్డి తక్కువ కాలంలో రాజకీయాల్లో ఎదగడానికి, కాంగ్రెస్ సీనియర్లను పక్కనపెట్టి ఏకైక ఆశాకిరణం అనుకునే స్థాయికి చేరుకోవడానికి మీడియాతో పాటు రేవంత్‌రెడ్డి సొంత యూట్యూబ్ సైన్యం గణనీయమైన పాత్ర పోషించింది. అందుకే, రేవంత్‌రెడ్డి యూట్యూబ్ చానళ్ల అరాచకాన్ని లేవనెత్తడంపై ట్యూబ్స్ తీవ్రంగా స్పందిస్తున్నాయి. సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే.. దానికి మీరు ఎక్కువగా విలువలు ఆపాదిస్తున్నారని దార్శనికులు, స్వయంగా జర్నలిస్ట్ అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1950 ప్రాంతంలోనే చెప్పారు. సబ్బుల వ్యాపారం, చెప్పుల వ్యాపారం, కూల్‌డ్రింక్స్ వ్యాపారం ఎలాగో రాజకీయ వ్యాపారం అంతే. సంపాదనే నేటి రాజకీయాల్లో సిద్ధాంతం.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాదు, పీసీసీ అధ్యక్షునిగా, అంతకుముందు టీడీపీ అధ్యక్షునిగా,టీడీపీలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా మీడియా గురించి సంపూర్ణ అవగాహన ఉన్నది. తనకు వ్యతిరేకంగా రాస్తే మీడియా సమావేశంలో ‘మీడియా వాళ్లు తమ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి’ అని తిట్టినవారు ఆయన.
యూట్యూబ్ చానళ్లు, పత్రికలు, చానళ్లు అన్నీ ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. గతంలో ఎన్నికల ముందు రాజకీయపార్టీలు పుట్టుకువచ్చేవి. ఇప్పుడు ఎన్నికల ముందు డజన్ల కొద్ది యూట్యూబ్ చానళ్లను రాజకీయ నాయకులే పుట్టిస్తున్నారు. ఏదైనా తేడా వస్తే సీనియర్ల కోటాలో సీఎం కావచ్చు అని ఆశిస్తున్న సంపన్న సీనియర్ నాయకుడు ముందుచూపుతో రెండు పత్రికలు, రెండు చానళ్లు పెట్టే సన్నాహాలు చేస్తున్నట్టు మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది. రవీంద్రభారతిలో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో మీడియా, రాజకీయ పార్టీల అనుబంధం గురించి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల అనుబంధం లేని మీడియా కూడా ఉందా? ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? నిజానికి ఏ మీడియా, ఏ పార్టీకి అనుబంధమో రేవంత్‌రెడ్డికి అందరికన్నా ఎక్కువ తెలుసు. ఓటుకు నోటు ఉదంతంలో స్వయం గా రేవంత్‌రెడ్డినే ప్రధాన మీడియా చానళ్ల పేర్లు ప్రస్తావించి టీడీపీకి అనుకూల మీడియా గురిం చి స్టీఫెన్ సన్‌కు చెప్పారు.
ఇప్పుడు అన్ని పార్టీలకూ మీడియా ఉన్నది. ఆంధ్రలో ఒక పార్టీకి పెద్ద ఎత్తున తటస్థ మద్దతుదారులు ఉంటారు. వారు పార్టీ వాళ్లమని ఒప్పుకోరు. పార్టీకి అనుకూలమే కానీ, తటస్థులం అని చెప్పుకుంటారు. మీడియా సైతం అంతే ఏదో ఓ పార్టీకి తటస్థ మద్దతుదారులు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ కార్యాలయాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ప్రత్యర్థి పార్టీల మీడియా రిపోర్టర్లను బహిష్కరించాయి. మీడియా, రాజకీయపక్షాల అనుబంధం, రాజకీయ నాయకులే యూట్యూబ్ గుంపులను ప్రారంభించిన విష యం, తమ ప్రత్యర్థులపై ప్రచారదాడికి యూట్యూబ్ చానళ్లను నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ వ్యాపార క్రీడలో మీడియా ఎంతోకొంత తన విశ్వసనీయతను కోల్పోయిన మాట నిజం.
రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడిన మరుసటి రోజే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి దూకిన శాసనసభ్యులు అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యున్నే పీఏసీ చైర్మన్‌గా నియమించారు. నియంతృత్వంగా రాష్ట్ర ప్రభుత్వాలను తారుమారు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఆచారాన్ని పాటించారు.
తొలిసారి తెలంగాణలో వేరే పార్టీ నుంచి చేరిన వారిని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. మీడియాలో, వ్యాపారంలో, రాజకీయాల్లో విలువల గురించి ఉపన్యాసాలు వేరు, ఆచరణ వేరు. ఈ రంగాల్లో విలువలు ఆశించడం అత్యాశే అనిపిస్తున్నది.
-బుద్దా మురళి