ఎన్కటికొగడు సూర్యుడిపై కోపంతో దాన్ని మాయం చేయాలనుకున్నాడట. చంద్రుడిపై పగతో దాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నించాడట. సంద్రంపై ద్వేషంతో దానిముందు విర్రవీగాడంట. సూర్యున్ని మాయం చేయడం, చంద్రుని కనుమరుగు చేయడం, సంద్రాన్ని లేకుండా చేయాలనుకోవడం సాధ్యపడుతుందా? అలాగే చరిత్ర పుటలకు పట్టిన చెదను దులిపి తెలంగాణ చరిత్రను తిరగరాసిన కేసీఆర్ చరితను మాయం చేయడం సాధ్యపడుతుందా? ఆ దిశగా ప్రయత్నం చేయడమూ మూర్ఖత్వమే అవుతుంది.
సూర్యుడు మబ్బుల మాటున దాగినంత మాత్రాన మాయం చేశానని విర్రవీగడం, అమావాస్య నాడు చంద్రుడు కనిపించనంత మాత్రాన కనుమరుగు చేశానని గప్పాలు కొట్టడం, సంద్రపు అలలు వెనక్కి వెళ్లినంత మాత్రాన నన్ను చూసి భయపడిందని ప్రగల్భాలు పలకడం ఎంతటి అవివేకమో.. కేసీఆర్ ఒకడుగు వెనక్కు వేసినంత మాత్రాన చరిత్రను చెరిపేస్తామని విర్రవీగడం కూడా అంతే అవివేకం.
ఆరు గ్యారెంటీల పేరిట అబద్ధాలు, మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మొదటి నుంచి కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. నడమంత్రపు సిరి ఎక్కువ కాలం నిలువదన్నట్టు.. అనుకోకుండా అందివచ్చిన సీఎం కుర్చీ ఆయనకు నెత్తి మీద కండ్లను మొలిపించి కుదురుగా కూర్చోనివ్వడం లేదు. అందుకే, కేసీఆర్ ఆనవాళ్లను కనుమరుగు చేస్తానని, ఆయన చరిత్రను చెరిపేస్తానని మాట తూలుతున్నారు. ఆచరణకు సాధ్యం కాని శపథాలు చేస్తున్నారు.
దేశంలో చాలామంది చాలా రాష్ర్టాలకు ముఖ్యమంత్రులయ్యారు. కానీ, కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కించారు, ప్రపంచ పటంపై నిలిపారు. ఆ రాష్ర్టానికే ఇప్పుడు తాను సీఎం అయ్యాననే విషయం రేవంత్‌రెడ్డి మర్చిపోతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. కేసీఆర్ రాసిన చరిత్రను చెరపడం ఎలాగో సాధ్యం కాదని తెలిసీ.. ఆయన సాధించిన అభివృద్ధి నివేదికలను కనుమరుగు చేస్తున్నారు. ప్రగతి ఫొటోలను మాయం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ సాధించిన అనేక అవార్డులు, రివార్డులకు సంబంధించిన డేటాను ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి తొలగించేశారు. కులగణన సర్వే తప్పులు బయటపడటంతో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యర్థులు సహా అందరూ మెచ్చుకున్నారు. దీంతో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కానరాకుండా చేశారు. ఆఖరికి కాంగ్రెస్ సర్కార్ ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక నివేదిక (అట్లాస్) కూడా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ప్రగతికి పట్టం గట్టింది. ఆ నివేదిక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి దర్పణం పట్టింది. అందులోని మొదటి పుట నుంచి చివరి పుట వరకు కేసీఆర్ అమలుచేసిన పథకాలను కండ్లకు కట్టింది. దీంతో సెల్ఫ్‌గోల్ అయిందని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి.. వెంటనే దాన్ని కూడా ప్రభుత్వ వెబ్సైట్ నుంచి మాయం చేసేశారు.
కేసీఆర్‌ను చూస్తేనే రేవంత్ రెడ్డికి బుర్ర పనిచేయడం లేదేమో. అందుకే ఆయనకు సంబంధించిన వివరాలు ఎక్కడ కనిపించినా వెంటనే డిలిట్ చేయిస్తున్నారు. ఆఖరికి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలనూ వదల్లేదు. కేటీఆర్ ఫొటో పెట్టుకున్నాడని టీ స్టాల్‌ను తొలగించడం రేవంత్ రెడ్డి విద్వేషానికి,
నియంతృత్వానికి పరాకాష్ఠ.
దేశాన్ని ఐదు దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తనకు నచ్చినట్టుగా చరిత్రను నిర్మించుకున్నది. ఇప్పుడు బీజేపీ పాలకులు దాన్ని చెరిపే క్రమంలో తాము చెప్పిందే చరిత్ర అంటున్నారు. ఆ క్రమంలోనే చరిత్రను వక్రీకరిస్తూ పలు సినిమాలు కూడా తీస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న రేవంత్ రెడ్డి వారి బాటలోనే నడుస్తున్నారు. అయితే కేసీఆర్ చరిత్రను చెరిపేయడానికి అది శతాబ్దాల కిందట జరిగింది కాదు. మనందరి కండ్లముందే దశాబ్దాల కిందట జరిగింది. రేవంత్‌రెడ్డి ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెబ్సైట్లో వివరాలు తొలగించినంత మాత్రాన కేసీఆర్ చరిత్ర చెరిగిపోదు. ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
– (వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే వరంగల్)
నన్నపునేని నరేందర్