CM Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలో ప్రస్తుతం గల కాకతీయ తోరణం, చార్మినార్ చిత్రాలు రాచరికానికి గుర్తులని, కనుక వాటిని తొలగించి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాల చిహ్నాలను చేర్చగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం అందుకు అనుగుణంగా ఉండగలవని కూడా అంటున్నారు. యథాతథంగా విన్నప్పుడు ఇవి గొప్ప ఆలోచనలుగా, ఇంకా చెప్పాలంటే విప్లవాత్మకంగా తోస్తాయి. అది కూడా వామపక్షాల నుంచో, విప్లవకారుల నుంచో, బడుగు వర్గాల ఉద్యమకారుల నుంచో గాక, కాంగ్రెస్ వంటి మధ్యేమార్గ వాద రాజకీయ నాయకుడు ఆ భాష మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానితో పాటు కొన్ని ప్రశ్నలను కూడా ముందుకుతెస్తుంది.
కాకతీయులు, నిజాం నవాబులు ఫ్యూడల్ రాజులనటంలో సందేహం లేదు. అదంతా, దేశంలో ఎక్కడైనా, ఫ్యూడల్ రాచరిక కాలమేనన్నది చరిత్రతో కొద్దిపాటి పరిచయం గలవారందరికి తెలిసిన విషయమే. అప్పటి పాలనలకు అది ఒక పార్శం కాగా, మరొక పార్శంలో వారు పరిపాలనా పరంగా ఏమి చేశారనే ప్రశ్న మరొకటి. ఆ రెండింటిని కలిపి అది కాకతీయ రాజులు, నిజాం నవాబుల పొలిటికల్ ఎకానమీ అయింది. ఆ ప్రకారం కాకతీయ రాజులు ఫ్యూడల్ ఆర్థిక నిర్మాణ వ్యవస్థను, రాజకీయ నిర్మాణ వ్యవస్థను ఆ నాటి కాలానుగుణంగా కొనసాగిస్తూనే, ప్రజల కోసం ఏమేమి మంచి పనులు చేశారో, సాహిత్య-సాంస్కృతిక రంగాలను ఏ విధంగా తీర్చిదిద్దారో మనకు చరిత్ర చెప్తున్నది. అదే చరిత్రలోని కొందరు రాజుల వలె వీరు కేవలం దోపిడీ ఆర్థికవ్యవస్థను కొనసాగించి, వ్యక్తిగత స్థాయిలో భోగలాలసులుగా మిగలలేదు. ఈ వివరాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమై ఉన్నవే.
కాకతీయులు, నిజాం నవాబుల పొలిటికల్ ఎకానమీ ఇది. దీనిలో ముఖ్యమంత్రి దేనినైనా ఇంత బలంగా వ్యతిరేకించటానికి ముందు, అసలు తన పొలిటికల్ ఎకానమీ ఏమిటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. ఆ పనిచేసినట్టయితే తన ప్రకటనలను, చర్యలను అర్థం చేసుకునేందుకు అదొక ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. అటువంటి ఫ్రేమ్‌వర్క్ ఏదీ ఆయన ఇవ్వకుండా ఇంత తీవ్రమైన ప్రకటనలు చేయటం వల్ల ప్రజలకు అయోమయం ఏర్పడుతుంది. ఒక చిహ్నం, ఒక విగ్రహం, ఒక గీతం అంటే అవి కేవలం రాజకీయం కాదు. ఆషామాషీ కాదు. అందుకు లోతైన అర్థం ఉంటుంది. దీర్ఘకాలికమైన భావన ఉంటుంది. కనుక కాకతీయులు, నిజాం నవాబుల పొలిటికల్ ఎకానమీపై, దాని గురించి తన అవగాహనపై, వర్తమానానికి వస్తే స్వాతంత్య్రానంతరం దేశంలో గాని, తెలంగాణలో గాని పొలిటికల్ ఎకానమీపై తన అవగాహనలు ఏమిటో రేవంత్‌రెడ్డి ఒక పత్రాన్ని ప్రకటిస్తే సముచితంగా ఉంటుంది. దానిపై ఎవరి అభిప్రాయాలు వారివి కావచ్చు. అది సహజం. కాని దేనికైనా ఒక ప్రాతిపదిక పత్రం అవసరం. అది తయారుచేసే సమయంలో ఆయన, ఇప్పటికే పలువురు ఎత్తిచూపుతున్న విధంగా, భారతదేశ అధికార చిహ్నంలో ఏమున్నాయి, ఇతర రాష్ర్టాల చిహ్నాలలో ఏమున్నాయి, ఇండియాకు స్వాతంత్య్రం రాకమునుపే ఏర్పడిన వివిధ దేశాల చిహ్నాలలో ఏమున్నాయనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంతకూ స్వయంగా రేవంత్‌రెడ్డి పొలిటికల్ ఎకానమీ ఏమిటి? ఆయన రాచరికాలతో ముడిబడిన ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకా? ఆ వ్యవస్థకు గ్రామీణ తెలంగాణలో ఆధిపత్యం వహించిన వర్గాలకు కూడా వ్యతిరేకా? ఆ వ్యవస్థలపై ఆయా కాలాల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఉద్యమిస్తూ వస్తున్న అన్నివర్గాలకు, వారి ఉద్యమాలకు, పోరాటాలకు, వారి సంస్థలకు, వారి లక్ష్యాలకు అనుకూలురా? వారందరిపై, వాటన్నింటిపై జరుగుతున్న అణచివేతలన్నింటిని వెంటనే నిలిపివేస్తారా? వారందరి డిమాండ్లను శీఘ్రంగా నెరవేర్చగలరా? అందుకు ఆటంకమయ్యే చట్టాలను మార్చివేస్తారా? ఇప్పటికే గల చట్టాలన్నింటిని సత్వరమే అమలుపరుస్తారా? అమలును అడ్డుకునే ఫ్యూడల్ సామాజిక వర్గాలను, వ్యక్తులను నిష్పాక్షికమైన రీతిలో శిక్షిస్తారా? ఆయా వర్గాలు అటువంటి ఫ్యూడల్ పొలిటికల్ ఎకానమీని ఆధారం చేసుకొని నిర్మించుకుంటూ వస్తున్న అన్నిరకాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సౌధాలన్నింటిని కూల్చివేయగలరా? ఈ రంగాలపై బడుగు, బలహీనవర్గాలకు, ఆదివాసీల నుంచి, దళితుల నుంచి, చిన్నకారు రైతుల నుంచి మొదలుకొని గ్రామాలలో, పట్టణాలలో గల శ్రమజీవుల వరకు భాగస్వామ్యాలు, ఆధిపత్యాలు కల్పించగలరా? స్వయంగా తనకు, తమ వర్గానికి, తమ వంటి ఇతర వర్గాలకు గల ఆధిపత్యాలను వదులుకోగలరా? ఇవి చేసేందుకు సిద్ధపడకుండా ప్రభుత్వ చిహ్నాలలో రాచరిక గుర్తులు తీసివేసి ప్రజల పోరాటాలు, త్యాగాల గుర్తులు తెస్తామనటం అర్థం లేని ఆర్భాటంగా, కపటపూరితమైన నటనగా మిగులుతుంది.
ఇవన్నీ వెర్రి ప్రశ్నలుగా, వితండవాదంగా తోచవచ్చు కొందరికి. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయా కాలాల పాలకుల పొలిటికల్ ఎకానమీతో, ప్రధానంగా తను ప్రస్తావించిన కాకతీయులు, నిజాం నవాబుల పొలిటికల్ ఎకానమీతో, అందులో గల ఒక వైపు చెడు ఒక వైపు మంచితో, చిహ్నాలకు సంబంధించి జాతీయంగా, వివిధ రాష్ర్టాలలో గల సంప్రదాయాలతో ఎటువంటి సంబంధం, అవగాహన లేకుండా విప్లవాత్మకమైన ప్రకటనలు పై పై మెరుగుల పద్ధతిలో గాలివాటంగా చేసినప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఈ విధంగానే ఉంటాయి. అందుకు ఆయన వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
ఆయన తన పొలిటికల్ ఎకానమీ గురించి రెండు స్పష్టీకరణలు కూడా ఇవ్వాలి. గత ఎన్నికలకు ముందు బెంగళూరులో జరిగిన తమ సామాజికవర్గం వారి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేనికైనా భూమి ఆధారమని, అందువల్ల తమ వర్గం వారంతా పదేసి ఎకరాల భూమి ఖరీదు చేయాలని అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. వాటిని ఆయన ఖండించినట్లు లేరు. తర్వాత ఒకచోట మాట్లాడుతూ, తెలంగాణలోని తమ సామాజికవర్గం వారంతా నాయకత్వం కోసం తనవైపు చూస్తున్నారనటం కన్పించింది. రాజశేఖర్‌రెడ్డి పాలనలో తమ వారు అనేకులు ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌తో బాగుపడ్డారని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయడం వల్ల వాటిలో అనేకం మూతబడి తమ వారు నష్టపోతున్నారన్నట్టు కూడా విన్నాము. నలుగురి దృష్టికి రానివి ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. విషయం అది కాదు. వీటిని బట్టి ముఖ్యమంత్రి పొలిటికల్ ఎకానమీ ఏమిటని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నది చివరికి తేలుతున్న ప్రశ్న. ఆయన ఫ్యూడల్ రాచరిక వ్యతిరేక ప్రజానుకూల భావనలు కలవారా?, లేక స్వయంగా ఫ్యూడల్ లక్షణాలు కలవారా?
ఇటువంటి పరిస్థితులపై ఇక్కడి ప్రజలు మొదటినుంచి ఈనాటివరకు సాగిస్తూ వస్తున్న ఉద్యమాలన్నింటిని బలపరచేవారు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో ఇపుడున్న చిత్రాలను మార్చి ప్రజల త్యాగాలు పోరాటాల చిహ్నాలను చేర్చగలమని గాని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చి ఒక రాష్ట్ర గీతాన్ని అదే ప్రకారం తేగలమని గాని ప్రకటించగలరు. తమకు అధికారం ఉందిగదా అని సదరు అధికార బలాన్ని ఉపయోగించి ఆ పని చేయటం వేరు, అందుకు అవసరమైన నైతిక బలం ఉండటం వేరు. తెలంగాణ ప్రజల స్థితిగతులలో, ఆరాట పోరాటాలలో ప్రతిఫలించే పొలిటికల్ ఎకానమీకి, రేవంత్ రాజకీయ జీవితంలో గతంలో గాని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కాని కనిపించే పొలిటికల్ ఎకానమీకి గల సంబంధం ఏమిటో ఆయనే చెప్పగలగాలి.
ఇంతకూ ఆ కొత్త చిహ్నాలలో, గీతంలో, తెలంగాణ తల్లి విగ్రహంలో ఏమి ఉండనున్నదో తెలియదు. అవి ఎట్లున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా, ముఖ్యమంత్రి చేసిన విప్లవాత్మకమైన వ్యాఖ్యల దృష్ట్యా, చరిత్రలో, వర్తమానంలో తెలంగాణ పొలిటికల్ ఎకానమీ గురించి, స్వయంగా తన పొలిటికల్ ఎకానమీ గురించి, వివిధ ఆర్థిక, సామాజికవర్గాల భిన్నమైన ఉద్యమాలు, పోరాటాల గురించి తన దృక్పథం ఏమిటో, అందుకనుగుణంగా తన ప్రభుత్వ విధానాలు, ఆచరణ ఏ విధంగా ఉండగలవో ఆయన ప్రజలకు తెలియజేయాలి.
అప్పుడు మాత్రమే ఈ చిహ్నాల మార్పులు కేవలం సంకేత ప్రాయాలుగా, యాంత్రికంగా మిగలక, అర్థవంతమవుతాయి. ఆ పని జరగకపోతే అంతా ఒక తమాషాగా మిగులుతుంది. ముఖ్యమంత్రి అటువంటి అపప్రథ తెచ్చుకోరని ఆశించాలి. పోతే గుర్తులలో ఇటువంటి విప్లవాత్మక మార్పులు తెచ్చే ముఖ్యమంత్రి పరిపాలన కూడా అదేవిధంగా విప్లవాత్మకంగా ఉండగలదని ప్రజలు ఆశించవచ్చునేమో ఆయన చెప్పాలి.
-టంకశాల అశోక్