‘ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు.. ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలి’ అని ఆంగ్ల రచయిత అలెన్మూర్ చెప్తే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి భయపడాలని ప్రజలను హెచ్చరిస్తున్న వైఖరి దుర్మార్గం. గత 13 నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. హైడ్రా, మూసీ పేర జరుగుతున్న విధ్వంసం వలన ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఫార్మా కంపెనీ, రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ పేరిట జరిగిన నిర్బంధకాండ వల్ల రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రజా సమస్యలపై పోరాడితే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు, నేతలపై కేసులు, అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్నది. హామీలు అమలు చేయాలన్న ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేస్తున్నారు. గుండెపోటు వచ్చిన లగచర్ల రైతును బేడీలతో దవాఖానకు తీసుకెళ్లారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అడిగితే ప్రతిపక్షాల కుట్ర అంటున్నారు. మొత్తంగా ఇదీ తెలంగాణ ముఖచిత్రం. తెలంగాణ వస్తే 10 శాతం మాత్రమే విజయం సాధించినట్టని, మిగతా 90 శాతం పూర్తికావాలంటే నిరంతరం పోరాడాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాటలు మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి.
కేసీఆర్ పదేండ్ల పాలన దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. సబ్బండ వర్గాల ఆకాంక్షలే పరిపాలన విధానాలుగా మారి అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల లాగా సాగుతూ పయనించింది. నీటి గోస తీరింది. కరెంట్ కోతలతో తల్లడిల్లిన ప్రజలు నిరంతర వెలుగులను ఆస్వాదించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల న్యాయం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. కానీ, కేసీఆర్ ప్రభుత్వానికి మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపించింది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. అనేక ఆంక్షలతో రుణమాఫీని 50 శాతం మాత్రమే అమలు చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారో తెలియదు. ఎన్నికల్లో ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 12 వేలకు కుదించి గొప్పలు చెప్పుకుంటున్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు ఎగిరిపోయాయి. కేసీఆర్ పథకాలపై విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. ఒక్క కొత్త పథకమూ రాలేదు సరికదా, ఉన్న పథకాలను కూడా సరిగా అమలు చేయడం లేదు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రెసిడెన్షియల్ విద్యను రేవంత్ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నది. గురుకులాల్లో సరైన పర్యవేక్షణ లేక 13 నెలల్లో 50 మందికిపైగా విద్యార్థులు చనిపోయారు. విద్యను సంక్షోభంలోకి నెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి.
సమైక్య పాలనలో యువత వలస బాట పట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. తెలంగాణ పల్లెల్లో కొత్త వెలుగులు నింపారు. వలస వెళ్లిన వారు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటూ రాష్ట్ర సాధన ఫలాలు అందుకున్నారు. దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి రైతులకు కేసీఆర్ అండగా నిలిచారు. సాగునీటి కోసం కాకతీయ మిషన్, ప్రాజెక్టులు నిర్మించి నీటి వసతి కల్పించారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తూ నాణ్యమైన కరెంటును నిరంతరాయంగా అందించారు. అలా పదేండ్లపాటు రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ 13 నెలల్లోనే సంక్షోభంలోకి నెట్టేసింది.
రైతులను పూర్తిగా కష్టాల్లో ముంచింది. ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలకు వేలాది ఎకరాల వ్యవసాయ భూములను అప్పగించి రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లగచర్ల రైతులు ఎదురుతిరిగితే అరెస్టులు, జైళ్లు, నిర్బంధాలతో పోలీసు రాజ్యంగా మార్చారు. అదానీ, అంబానీలను ఢిల్లీలో వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం వారికి నజరానాలు ప్రకటిస్తుండటం గమనార్హం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి ఏడో గ్యారెంటీగా నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని కూడా నిర్బంధిస్తున్నారు. ఇక, హామీల అమలుకు పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. గృహనిర్బంధాలు సర్వసాధారణమయ్యాయి.
రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ ర్యాలీ చేస్తానని అంటుంటే.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని, మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని రాజ్యాంగ ఉల్లంఘన ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 13 నెలలుగా బీఆర్ఎస్ పోరాడుతున్న తీరు ప్రజలకు కొండం త విశ్వాసాన్ని కలిగించింది. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొని విజయం సాధించిన చరిత్ర మన కండ్ల ముందు ఉన్నది.
ఎన్కౌంటర్లతో తెలంగాణ మళ్లీ ఎరుపెక్కింది. 13 నెల్లలో 16 మందిని చంపారు. కిడ్నాప్‌లు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ తన సొంత సైన్యంలా వాడుకుంటున్నది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీ అటకెక్కింది. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసిన ఉద్యోగాల ప్రక్రియలో మిగిలిపోయిన 40 వేల ఉద్యోగాలను భర్తీచేసి తమ ఖాతాలో వేసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ఆర్థిక ఇబ్బందులను బూచిగా చూపిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు. హామీల గురించి ప్రశ్నించినప్పుడల్లా కేసీఆర్ ప్రభుతం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్తూ తప్పించుకుంటున్నారు.
2014-15లో రూ. లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ పదేండ్ల కాలంలో మూడు రెట్లు పెరిగి రూ. లక్షల కోట్లకు చేరింది. తలసరి ఆదాయంలో 2014-15లో రూ.1,03,889 ఉండగా 2023-24లో రూ. 3,56,564కు పెరిగింది. సొంత పన్నుల రాబడి రూ.29 వేల కోట్ల నుంచి పదేండ్లలో రూ.1.36 లక్షల కోట్లకు పెరగడం కేసీఆర్ పరిపాలన విజయం.
రాష్ట్ర జీఎస్డీపీ రూ. 4.3 లక్షల కోట్ల నుంచి పదేండ్లలో రూ.15.01 లక్షల కోట్లకు పెరగడం కేసీఆర్ పరిపాలన దక్షత కాదా? కేవలం రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ర్టాన్ని ఆర్థిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాల పునర్నిర్మాణం కోసం వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఆస్తులు సృష్టించి అభివృద్ధి చేసింది వాస్తవం. అప్పులు మాత్రమే చెప్పి జరిగిన ఆర్థిక అభివృద్ధిని కుట్రపూరితంగా దాచివేసి కేసీఆర్ పరిపాలన విజయాలను తుడిచేసే వెకిలి ప్రయత్నం జరుగుతున్నది. తలసరి విద్యుత్తు వినియోగంలో 1,151 యూనిట్ల నుంచి 1,748 యూనిట్లకు చేరుకున్నాం. పదేండ్లలో రూ. 97,321 వేల కోట్లు వెచ్చించి విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల విస్తరణ, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసి చీకటి తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.
జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ కథ వొడవని ముచ్చట. పదేండ్ల వికాసాన్ని విధ్వంసంగా చూపే పిచ్చి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలు నిత్యం నిఘా వేసి, వారిపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నాయి. వారిని ఎలాగైనా జైలుకు పంపి బీఆర్ఎస్ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా చేయాలని కుట్ర చేస్తున్నారు.
కవితను అక్రమంగా అరెస్ట్ చేసి క్షణికానందం పొందిన బీజేపీకి, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం కలిసి ఎదుర్కొంటామని హరీశ్‌రావు ప్రకటించి పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యం కల్పించారు.
రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ ర్యాలీ చేస్తానని అంటుంటే.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని, మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని రాజ్యాంగ ఉల్లంఘన ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 13 నెలలుగా బీఆర్ఎస్ పోరాడుతున్న తీరు ప్రజలకు కొండం త విశ్వాసాన్ని కలిగించింది. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొని విజయం సాధించిన చరిత్ర మన కండ్ల ముందు ఉన్నది. 2001 నుంచి బీఆర్ఎస్ ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలంగాణ ఉద్యమంలో అనుభవించిన నిర్బంధం నుంచి నేర్చుకున్న పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ముందుకు సాగడమే మన కర్తవ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ప్రజల పక్షాన పోరాడటం ద్వారా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోదాం.
– (వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్) జి.దేవీప్రసాద్ రావు 90006 33404