‘2024 పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదు, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర’ అని నాలుగేండ్ల కిందటే కేసీఆర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలపై ఆధారపడకుండా, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమం దిశగా సాగుదామని సూచించారు. కేసీఆర్ మాటలు నిజమవుతాయని నాడు ఎవరూ ఊహించలేదు. కానీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మాటల్లోని అంతరార్థం అందరికీ అర్థమైంది.
‘తల్లిని చంపి బిడ్డను బతికించార’ని చెప్పిన ప్రధాని మోదీ మొదటినుంచీ తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. నిధుల కేటాయింపుల్లో మొండిచెయ్యే చూపుతున్నారు. కేంద్రంలో మరోసారి గెలిస్తే తెలంగాణకు నిధుల వరద పారిస్తామని ఎన్నికల సమయంలో గప్పాలు కొట్టిన బీజేపీ నాయకులు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తాజా బడ్జెట్ కేటాయింపులే అందుకు నిదర్శనం. తెలంగాణకు ఏటా రిక్తహస్తం చూపుతున్న బీజేపీకి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లను ప్రజలు కట్టబెట్టారు. అయినా ఆ పార్టీలో మార్పు రాలేదు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తే తమ బతుకులు మారుతాయని, తెలంగాణ బాగు పడుతుందని ఆశించి ఓట్లేసిన ప్రజలు మళ్లీ మోసపోయారు.
2014 నుంచి ఈ పదేండ్లలో బీజేపీ నేతలు అనేక హామీలిచ్చారు. ఐఐఎం ఏర్పాటు చేస్తామని, తెలంగాణలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని, మిషన్ కాకతీయకు నిధులిస్తామని, ఆదిలాబాద్లో సిమెంటు ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని.. ఇలా ఒక్కటా, రెండా ఎన్నో హామీలిచ్చారు. కానీ, వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి కనబరచలేదు.
అసలు మోదీ సర్కార్ది మొదటినుంచీ ఇదే తీరు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తొలినాళ్లలో కేంద్ర ప్రభుత్వంతో ఆయన సఖ్యతతోనే వ్యవహరించారు. అయినప్పటికీ తెలంగాణకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. అంతేకాదు, నిలువెల్లా విషం నింపుకొని తెలంగాణపై వివక్ష చూపడంతో కేంద్రంపై కేసీఆర్ పోరాటానికి దిగారు. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా అంతే. నాడు తెలంగాణ ఉద్యమంలోనూ, నేడు స్వరాష్ట్రంలోనూ ఆ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నాయి.
బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపుల కోసం బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం గాని, ఆరాటం గాని ఏమీ లేదు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే.. పార్లమెంట్ లోపల, బయట గాయిగత్తర చేసేవారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసనగా పార్లమెంట్ ముందు బైటాయించేవారు. మోదీ సర్కార్ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బడే భాయ్’ అంటూ ప్రధాని మోదీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆయన రాష్ర్టానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. కేంద్రంతో సఖ్యతతో ఉంటే నిధులు వరద పారుతుందని, కేసీఆర్ వ్యవహార శైలి కారణంగానే తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతున్నదని మొన్నటి వరకు దుష్ప్రచారం చేసిన ఆయనకు మోదీ అసలు రూపం ఇప్పుడు తెలిసివచ్చింది. నీతి ఆయోగ్ సమావేశాలను కేసీఆర్ సర్కార్ బహిష్కరించినప్పుడు గాయిగాయి చేసిన రేవంత్ నేడు కేసీఆర్నే అనుసరిస్తున్నారు. ఆయన ఇప్పటికైనా అసలు వాస్తవాలను గ్రహించాలి.
తెలంగాణ రాష్ట్రంపై మోదీ సర్కార్ వివక్షను తెలంగాణ సమాజం ఇప్పటికైనా గ్రహించాలి. ఈ నేపథ్యంలో తెలంగాణపై వివక్ష చూపుతున్న మోదీ సర్కార్ మీద కేసీఆర్ పోరుకు దిగడం తప్పవుతుందా, లేదా? అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఏదేమైనప్పటికీ మనోడు మనోడే. నాటికి, నేటికీ తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్సే ఆత్మగౌరవ ప్రతీక. ఈ వాస్తవం తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ర్టానికి శుభసూచకం.
-జీడిపల్లి రాంరెడ్డి
96666 80051