తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విద్యుత్తు రంగం కీలకమైన స్థానం కలిగి ఉన్నది. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, సేవ, వంటి అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్తు సరఫరా ప్రధాన ఆధారం. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో తీవ్ర కరెంట్ కొరతతోపాటు అనేక ఇబ్బందులు రాష్ర్టాన్ని వేధించాయి. విద్యుత్తు కోతలు, సరఫరాలో అంతరాయాలతో వ్యవసాయం, పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపి రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా నిలిచాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో మనకు తీవ్ర అన్యాయం జరిగింది. అప్పటికే విద్యుత్తు సంక్షోభంలో ఉన్న కొత్త రాష్ర్టానికి ఈ పరిణామం మరింత భారంగా పరిణమించింది. రాష్ట్ర విభజన సమయంలో ఉత్పత్తి కేంద్రాలు, వినియోగం, పంపిణీ వ్యవస్థల మధ్య సమన్వయం లోపించడం వల్ల తెలంగాణకు తగినంత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం అందలేదు. తెలంగాణ భూభాగంలో ఉన్న కొన్ని ఉత్పత్తి కేంద్రాలను కూడా పరిపాలనా నిర్ణయాల నెపంతో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఫలితంగా తెలంగాణ కొత్త రాష్ట్రం ప్రారంభ దశలోనే విద్యుత్తు రంగంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నది.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని అత్యవసర ప్రాధాన్యంగా దృఢ నిర్ణయాలు తీసుకున్నది. వాటిలో ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొనుగోలు, పంపిణీ వ్యవస్థల బలోపేతం, కొత్త ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ఉన్నాయి. దీర్ఘకాలికంగా థర్మల్, సౌర, జలవిద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి, కొన్నేండ్లలోనే తెలంగాణను విద్యుత్ లోటు రాష్ట్రం నుంచి మిగులు రాష్ట్రంగా మార్చింది.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం ద్వారా సాగు విస్తీర్ణం పెరిగింది. పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగి రైతులు ఆర్థికంగా బలపడ్డారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వల్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. ఐటీ, పరిశ్రమలు, సేవారంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి విద్యుత్ రంగం బలమైన పునాది వేసింది. ఫలితంగా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగి, తెలంగాణ విద్యుత్ రంగం దేశానికే ఆదర్శ మాడల్‌గా నిలిచింది.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ (మూడవ డిస్కం)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థను కంపెనీగా నమోదు చేసి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అనుమతి పొందింది. ఈ సంస్థకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ముషారఫ్‌ను నియమించింది. ఇప్పుడీ సంస్థకు విద్యుత్తు పంపిణీ లైసెన్స్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలిని ప్రభుత్వం సంప్రదించే అవకాశం ఉన్నది. చట్టపరమైన విధానాల ప్రకారం, కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి వినియోగదారులు, ఉద్యోగ సంఘాలు, ఇతర వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి ప్రజా విచారణ నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.
మూడవ డిస్కం ఏర్పాటు వెనుక ఉన్న కాంగ్రెస్ సర్కార్ అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వ్యవసాయం, నీటిపారుదల, పేద వర్గాలకు ఇచ్చే విద్యుత్తు సబ్సిడీలు ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడవ డిస్కం ఏర్పాటు చేసి, వ్యవసాయ రంగం, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర సబ్సిడీ వినియోగదారులను ఈ కొత్త సంస్థ కిందికి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల పరిధుల్లో అధిక ఆదాయం ఇచ్చే పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు మాత్రమే మిగిలే అవకాశం ఉన్నది.
ఈ విధమైన నిర్మాణం భవిష్యత్తులో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే అవకాశాన్ని పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్తు రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మూడవ డిస్కం ఏర్పాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతున్నది. కొన్ని రాష్ర్టాల్లో విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరణకు గురై, ఆ రంగంలో అదానీ గ్రూప్ వంటి సంస్థలు ప్రవేశించాయి. కొన్ని రాష్ర్టాల్లో ప్రైవేటీకరణ పలు వివాదాలకు దారితీసింది. ఉదాహరణకు.. రాజస్థాన్‌లో ఒక ప్రైవేటు సంస్థ (అదానీకి చెందినది) రూ.1,470 కోట్లు అదనపు చార్జీలు వసూలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కమర్షియల్ కోర్టు జోక్యం చేసుకొని రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా ఆడిట్ చేయాలని ఆదేశించింది.
ఈ నిర్ణయం విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగ భద్రత, వేతనాలు, సేవా నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ప్రైవేటీకరణ జరిగితే వినియోగదారులపై అధిక ధరల భారం పడే అవకాశం ఉన్నది. విద్యుత్తు ధరలు పెరగడం, అదనపు ఛార్జీలు విధించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మూడవ డిస్కం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రభుత్వం విస్తృత ప్రజా చర్చ జరుపకపోవడం శోచనీయం. విద్యుత్తు నిపుణులు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, వినియోగదారుల సంఘాలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలి. ముఖ్యంగా, విద్యుత్తు నియంత్రణ మండలి లైసెన్స్ మంజూరు చేసే ముందు నోటిఫికేషన్ జారీ చేయాలి. అభ్యంతరాలు స్వీకరించాలి. ప్రజా విచారణ నిర్వహించాలి. అనంతరం అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి తుది నిర్ణయం ప్రకటించాలి.
తెలంగాణ విద్యుత్తు రంగం ఇప్పటివరకు సాధించిన పురోగతి యాదృచ్ఛికం కాదు. అది ఒక పాలకుడి దూరదృష్టి, దృఢ సంకల్పం, సమర్థ నాయకత్వ ఫలితం. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు, విఙ్ఞప్తులు ఎదురైనా విద్యుత్తు రంగం ప్రైవేటీకరణకు కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన సబ్సిడీ నిధులకు ముడిపెట్టినా దాదాపు రూ.9 వేల కోట్లను వదులుకున్నది. కానీ ప్రైవేటీకరణకు దారితీసే పరిస్థితులకు తలొగ్గలేదు. ఇది తెలంగాణ ప్రజలు, రైతులు, పరిశ్రమలకు అందుతున్న లాభాలను కాపాడే దృఢ సంకేతం.
ఇప్పుడు మూడవ డిస్కం ఏర్పాటు వంటి నిర్ణయాలు ఆ పురోగతిని బలోపేతం చేసేలా ఉండాలి తప్ప బలహీనపరిచేలా కాదు. భవిష్యత్తులో ప్రైవేటీకరణకు దారితీసే అవకాశాలను నివారించాలి. వినియోగదారులకు అన్ని అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రజాప్రయోజనాలను కాపాడే విధంగా పారదర్శకంగా, సమగ్రంగా నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం.
(వ్యాసకర్త: మాజీ ఛైర్మన్,తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి)
-తన్నీరు శ్రీరంగారావు