తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16లో రాష్ట్రవ్యాప్తంగా 13.18 శాతం మంది పేదరికంలో ఉండగా, 2019-21 నాటికి ఆ సంఖ్య 5.88 శాతానికి తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు పేదరిక సూచిలో తెలంగాణ 21వ స్థానంలో నిలిచింది.
అభివృద్ధి, సంక్షేమంలో అంగలు వేస్తున్న తెలంగాణ రాష్ట్రం కీర్తికిరీటంలో, పేదరికంపై సాగిస్తున్న పోరులో గణనీయమైన ముందడుగు సాధించింది. ‘సంపద పెంచు-ప్రజలకు పంచు’ అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలాలు సామాన్యులకు అందుతున్నాయి. పేదరిక నిర్మూలనలో జాతీయ సగటు కన్నా మన రాష్ట్రం ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. మెరుగుపడిన ప్రజల జీవన ప్రమాణాలే అందుకు తార్కాణం. పని పరిస్థితులు మెరుగుపడాలంటే ఆరోగ్య బీమా ఈ ప్రజలకు అందించాలని ఆర్థికవేత్తలు అంటున్నారు. అన్నిరంగాల్లో, పరిశ్రమల్లో ఉత్పాదకతను, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా ఈ విజయం సాధ్యపడింది.
తెలంగాణ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం బీమా భరోసా ఇస్తున్నది. ప్రభుత్వమే ప్రీమియం కట్టి సుమారు 93 లక్షల కుటుంబాలను పాలసీ పరిధిలోకి తేవడం సాధారణ విషయం కాదు. ప్రతి కుటుంబానికి బీమా దేశంలోనే తొలిసారి. బీమా హామీ కాదు, ఒక భరోసా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని దశలో అదొక రక్షణ ఛత్రం.
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బీమా పథకాలు:
1.రైతు బీమా పథకం: ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిదవుతుందనే ఉద్దేశంతో రైతు మరణించిన పది రోజుల్లోనే ఆ ఇంటికి రూ.5 లక్షల చెక్కు ప్రభుత్వం పంపిస్తున్నది. 2028-19లో ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా రూ.5,402 కోట్లు దాదాపు లక్ష కుటుంబాలకు అందాయి.
2.చేనేత బీమా: దాదాపు 50 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.2.5 కోట్ల బీమా పరిహారం అందింది. ఈ బీమా 2022 ఆగస్టు 7న ప్రారంభమైంది.
3.మత్స్యకారులకు బీమా: దాదాపు 3.73 లక్షల మందికి ఈ బీమా పరిహారం అందింది.
4.గొర్లకు బీమా సౌకర్యం: గొర్రెల పెంపకం దారులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందుతున్నది.
5.గీత కార్మికులకు ప్రమాద బీమా: గీత కార్మికులకు రూ.5 లక్షల బీమా ఇవ్వాలని 2015 జూన్ 10న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వారు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా సమాన పరిహారం అందిస్తుంది. సెప్టెంబర్ 2018 నాటికి ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం పొందిన 47 మంది గీత కార్మికులకు రూ.5 లక్షల చొప్పున రూ.2.35 కోట్లు చెల్లించారు. ఇటీవలనే ‘గీత కార్మిక బీమా’ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. కొత్త పథకం కింద బీమా మొత్తం రూ.5 లక్షల చొప్పున చనిపోయిన కల్లుతీసే వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. ఇది ప్రస్తుత ఎక్స్‌గ్రేషియా ప్రక్రియ కంటే చాలా వేగంగా ఉంటుంది.
6.జర్నలిస్టులు, హోమ్గార్డ్స్, డ్రైవర్స్‌కు ప్రమాద బీమా: రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులతో సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోమ్గార్డ్స్, వర్కింగ్ జర్నలిస్టులకు సంవత్సరానికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
బీమా పథకాల ప్రయోజనాలు:
1.ప్రమాదం జరిగిన వారంలోపు బీమా మొత్తాన్ని అందజేసి, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తారు.
2. బీమా పథకం మరణించిన వారి కుటుంబ సభ్యులకు, వారి నష్టాన్ని తట్టుకోవడానికి వారికి గణనీయమైన మొత్తంలో డబ్బు అందేలా చేస్తుంది.
3.మన దేశంలో బీమారంగం చాలా వెనుకబడి ఉన్నది. దేశ జనాభాలో 2 నుంచి 4 శాతం ప్రజలకు మాత్రమే బీమా సౌకర్యం ఉన్నదంటే ఆ రంగం పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. ఆధునిక సమాజంలో బీమా అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అధిక ప్రీమియం, అవగాహనా రాహిత్యం, ప్రైవేట్ బీమా కంపెనీల మోసాల కారణంగా బీమారంగం చాలా వెనుకబడి ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వం బీమా రంగం విషయంలో కీలకమైన విధానాలను తీసుకొచ్చింది. ఐరోపా, అమెరికాల్లో అక్కడి జనాభాలో సుమారు 80 శాతం ప్రజలకు ప్రభుత్వాలే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రపంచసంస్థలు, ఆక్స్ఫర్డ్ నివేదికైన బహుళ పేదరిక సూచి కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాల్లో బీమాను ఒకటిగా చూపిస్తున్నది. ఇలాంటి విధానమైన పద్ధతులను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం బీమారంగం అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది.
పేదరికం ఒక సామాజిక, ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ చెప్పారు. వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరినప్పుడే పేదరికం తొలగిపోతుంది.
ఆకలికి 3 కోణాలున్నాయని సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ నిర్వచించారు. 1.ఆహారధాన్యాలు సరిపడినంతగా అందకపోవడం. 2. పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలను కొని తినలేని అశక్తత వలన. 3. ఇనుము, జింకు, విటమిన్లతో కూడిన పోషకాహారం లభించకపోవడం.
ప్రస్తుతం తెలంగాణలో కరెంటు, నీళ్ల సమస్యలు కనుమరుగయ్యాయి. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి. పెట్టుబడి అవసరాలకు రైతుబంధు, కష్టకాలంలో బీమా పథకాలు అండదండగా నిలుస్తున్నాయి. పారిశ్రామికాన్ని సులభతరం చేయడంతో పెట్టుబడి పెరిగి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. పేదరికం అడుగంటుతున్నది. విద్య, వైద్యం మెరుగుదిద్ది సామాన్యులకు అందుబాటులోకి తేవడం, బాలింతల పోషణ, పేద అమ్మాయిల పెండ్లికి సాయం వంటి పథకాలు పేదల అభ్యున్నతికి సహాయపడుతున్నాయి.
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)
సీవీవీ ప్రసాద్
80196 08475