‘ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మరో దేశంలో నిర్మిస్తే ప్రజలు జేజేలు కొట్టేవారు. కానీ, ఇంతటి బహుళార్థక ప్రాజెక్టు ఇక్కడ నిర్మిస్తే, ఇక్కడ కూలేశ్వరం అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ మాటల్లో నిజమున్నది. అభివృద్ధి అనేది నిత్య నూతనం. ప్రభుత్వాలు మారుతుంటాయి. నాయకులూ మారుతారు. వ్యవస్థ శాశ్వతం కాబట్టి ప్రజలకు శాశ్వతకాలం ఉండే అభివృద్ధిని చూపించినప్పుడు తప్పకుండా ఆ ప్రభుత్వానికి పట్టం కడతారు. శాశ్వతమైన అభివృద్ధి అంటే రవాణా రంగానికి సంబంధించిన రోడ్లు, హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వే స్టేషన్లు, దవాఖానలు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలతో పాటుగా ప్రజలకు అవసరమైన నీరు, విద్యుత్తు మొదలైనవి.
ఆసియా ఖండంలోని దేశాలు చైనా, జపాన్, సింగపూర్‌లో జరిగిన అభివృద్ధి గురించి మనం గొప్పగా చెప్పుకొంటాం. ఆసియా ఖండంలోనే ఉన్న పాక్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఛీ ఛీ అంటుంటాం. ఎందుకు ఇలా అంటే చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. 143 కోట్ల జనాభా ఉన్న చైనా 17.79 లక్షల కోట్ల జీడీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఇండియా జీడీపీ 3.57 లక్షల కోట్లు మాత్రమే. చైనాలో మౌలిక సదుపాయాలైన నిర్మాణ ప్రాజెక్టులు అనేకం ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడే విశాలమైన రోడ్లు, వంతెనలు, గంటకు 500 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైళ్లు, ఆధునిక రీతిలో నిర్మించిన విమానాశ్రయాలు, పెద్ద పెద్ద ఓడరేవులతో ప్రపంచాన్ని శాసించే దిశగా చైనా పరుగులు పెడుతున్నది.
మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులతో గుండుసూది మొదలు ప్రపంచ జనావళికి అవసరమైన అన్నిరకాల ఉత్పత్తులను చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్నది. ఈ రోజు అమెరికాను శాసించే దిశగా చైనా ఉన్నది. కారణం ‘నా దేశం.. నా దేశాభివృద్ధి..’ అనే భావన అక్కడి ప్రజల్లో నాటుకొని ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల దాడుల్లో హిరోషిమా, నాగసాకి పట్టణాలు ధ్వంసమైనా నిలదొక్కుకొని ప్రపంచ ఎలక్ట్రానిక్ రంగంలో జపాన్ అగ్రభాగంలో ఉన్నది. జపాన్‌లో తయారవుతున్న సోని, పానాసోనిక్, తోషిభా, షార్ప్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు ప్రపంచం మొత్తం వాడుతున్నారు. కాసియో ఎలక్ట్రానిక్ చేతి గడియారాలు ఈ రోజుల్లో ఫ్యాషన్. కెనాన్ జిరాక్స్ మిషన్ లేని నగరం లేదు. ప్రజలు వాడే కెమెరాలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లలో ఎక్కువ భాగం జపాన్ ఉత్పత్తులే. ప్రజలు వాడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు బ్యాటరీలు, ఛార్జర్లు కూడా జపాన్ దేశం తయారు చేసినవే. కారణం నా దేశం… నా దేశాభివృద్ధి.
ఇక సింగపూర్ అభివృద్ధి అందరికీ తెలిసిందే. చిన్న దేశమైనా అక్కడి ప్రజల క్రమశిక్షణకు ప్రపంచ దేశాలే అబ్బురపడుతాయి. పైన చెప్పిన ఈ మూడు దేశాల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారు. తమ దేశం గురించిన ఆలోచనలే చేస్తారు. అక్కడ కూడా ప్రభుత్వాలు మారినా ప్రజల ఆలోచనలు అభివృద్ధి వైపే ఉంటాయి. కాబట్టి కొత్త ప్రభుత్వాలు వచ్చి రావడంతోనే గత ప్రభుత్వాలు చేసిన పనులపై విచారణలు చేస్తూ, కమిటీలు వేస్తూ, కాలయాపన చేస్తూ కల్లబొల్లి మాటలు మాట్లాడవు.
ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం గత పదేండ్ల కాలంలో హైదరాబాద్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లు, రోడ్లు, వంతెనలు, ఐటీ హబ్స్, అండర్‌పాస్‌లు చూసి నగరంలోని అన్ని సీట్లలో బీఆర్ఎస్ను గెలిపించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా పేరొందిన గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, కోకాపేటలోని ఆకాశ హర్మ్యాలు విదేశీ నగరాలకు తీసిపోవు. ఇక్కడున్న అనేక ఐటీ పార్కులు, షాపింగ్ సెంటర్లు, దవాఖానలు, పాఠశాలలు అన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మితమైనవే. లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన అనేక ఐటీ పరిశ్రమల్లో వేలమంది పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి.
ఇక గ్రామీణాభివృద్ధికి వస్తే బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సంఖ్య పెరిగి పట్టణీకరణ విస్తృత స్థాయిలో పెరిగిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అందనంత స్థాయిలో అభివృద్ధి చెందింది. భూముల ధరలు వంద శాతం పెరిగాయి. కారణం.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రజల బాగు చూడాలనేది కేసీఆర్ ఆశయం. ఆ ఆశయ సాధనలోనే ఆయన అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అమలుచేశారు. డబ్బులు లేవని ఆయనెప్పుడూ ప్రజల ముందు మొర పెట్టుకోలేదు. మాటల గారడీలో ప్రజలు ఇంకా ఏదో మహాద్భుతాన్ని ఊహించుకొని ప్రస్తుత ప్రభుత్వానికి ఓటేస్తే గత ఏడాదిన్నరగా ఒక్క పరిశ్రమ, ఒక్క శాశ్వతమైన ప్రాజెక్టు లేదు.
తాత్కాలిక పథకాల కన్నా శాశ్వత పథకాలను ప్రజలు ఇష్టపడుతారు. నాటి కాంగ్రెస్, టీడీపీకి పూర్తి భిన్నంగా ఆలోచించి రూపొందించిన పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసింది. ప్రజలు తాము ఏమి కోల్పోయామో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నాటి తెలంగాణను, నేటి తెలంగాణతో పోల్చి చూసుకుంటున్నారు.
-కన్నోజు మనోహరాచారి