బిందెలతో యుద్ధం, కుండలతో కొట్లాట, ట్యాంకర్ల వద్ద సిగపట్లు, కుళాయి సమీపంలో ముష్టిఘాతాలు, నీళ్లడిగితే అన్నం తినిపోగానీ నీళ్లయితే ఇవ్వలేం అనే దుస్థితి. ఇదంతా కేరాఫ్ హైదరాబాద్ నగరిలోనే కండ్లకు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని, ప్రపంచ ప్రసిద్ధ నగరి భాగ్యనగరంలోని బస్తీల గొంతెండిపోతున్నది. పేరుగొప్ప..తీరు దిబ్బ అనేట్టుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల వైఖరితో కనీసం తాగునీరు దొరక్క జనం అల్లాడుతున్నారు. మసకబారిన బస్తీల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పొద్దంతా కాయకష్టం చేసుకుని ఇంటికొచ్చిన తర్వాత కనీసం కాళ్లు, చేతులు కడుక్కుందామన్నా నీరు లేని కొంపల్లో ఎలా బతికేది దేవుడా.. అని అటు కనిపించని దేవుడిని, ఇటు కండ్లముందు తిరుగుతున్న పాలకులను వేడుకుంటూ బతుకులెళ్లదీస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జనాలకు నిజంగా నీటి విలువ తెలియలేకుండా సరఫరా సాగింది. కేసీఆర్ మిషన్ భగీరథను ప్రతి గడపకు తీసుకెళ్లి తాగునీటి సమస్య లేకుండా సకల ఏర్పాట్లు చేశారు. నీటి సరఫరా సక్రమంగా జరిగేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా అధికారులను పురమాయించి వ్యూహాత్మకంగా అమలుకు చొరవ చూపి జనాలకు గొంతెండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమయానుకూలంగా జరిగే నీటి సరఫరాతో నీటి వృథాను అరికట్టటమే కాకుండా, పంపిణీ కార్యక్రమాన్ని బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవటంతో ప్రజలు గుండెల నిండా ఊపిరి పీల్చుకుని నీటి గోస లేకుండా హాయిగా ఎన్నో ఎండాకాలాలను వెళ్లదీశారు.
కోటికి పైగా గల జనాభాను కడుపుల పెట్టుకుని సాదుకుంటున్న మహానగరం నేడు నీటి కరువుతో విలవిల్లాడుతున్నది. తన బిడ్డల గొంతులు ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మాటపెగలక మౌనంగా రోదిస్తున్నది. మండువేసవిలో కడుపు నిండా నీళ్లు తాగడానికి కూడా నోచుకోని బిడ్డల దీనాన్ని చూసి హస్తం పాలకులనేమీ చేయలేక తన అసమర్థతను తానే తిట్టుకుంటూ నిశ్చేష్ఠురాలుగా నిలుచున్నది. సముద్రం తలాపునే ఉన్నా.. చేప దూపకేడ్సినట్టు రాష్ర్టాన్ని పాలించే పాలకులు, అపర మేధావులు, మహామహా నేతలు నిత్యం తన నీడలోనే బిజీబిజీగా గడుపుతున్నా తన పిల్లలకు తాగునీటిని ఇవ్వాలనే సోయిలేనితనాన్ని చూసి సిగ్గుపడి సైలెంట్ అయ్యింది.
అపార్ట్మెంట్లు, కార్యాలయ సముదాయాలు, ఉన్నతంగా నివసించే ప్రముఖ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయటానికి చూపించే ఉత్సాహంలో తమబోటి పేదలుండే కాలనీలకు పంపించటానికి కొంతైనా చూపితే ఎంతబాగుండునో కదా అని వేడుకొంటున్నారు. నగరమంతా నీటి కోసం మహా సంగ్రామం చేస్తున్నది. చర్లపల్లి డివిజన్ పరిధిలోని రెడ్డికాలనీ, సోనియాగాంధీ నగర్, భగవాన్ కాలనీ, మారుతి కాలనీ, సాయినగర్, కృష్ణారెడ్డినగర్, శివసాయినగర్, బీఎన్‌రెడ్డి కాలనీల్లో నీళ్ల కోసం పడిగాపులు పడుతున్నారు.
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ, ఖాజాబాగ్ బస్తీల్లోకి నీటి ట్యాంకర్లే దిక్కు, అవి రాకుంటే దూపతో చావాల్సిందే. బంజారాహిల్స్ పరిధిలోని బంజారాహిల్స్, తట్టిఖానా జలమండలి సెక్షన్ల పరిధిలోని బస్తీల్లో నీటి సమస్య అంతాఇంత కాదు. నందినగర్, వెంకటేశ్వరనగర్, వడ్డెర బస్తీ, లంబాడీ బస్తీ, కేఎల్ టవర్స్ తదితర ప్రాంతాల్లో సుమారు రెండునెలలుగా నీళ్ల సరఫరా లేదంటే జనం ఎంత అల్లాడుతున్నారో విశదమవుతున్నది. దాహార్తిని తట్టుకోలేకనే ప్రజలు జలమండలిని ముట్టడించిన ఘటనలూ ఎన్నో ఉన్నాయి.
కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గబ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కొత్తగూడ, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్ మెంట్లు, హాస్టళ్లు, కార్పొరేట్ ఆఫీసులకు ఇష్టారీతిన నీటి సరఫరా చేసే పాలకులకు బస్తీలోని జనాలకు కావాల్సిన నీటిని అందించటానికి మాత్రం మనసు రావటం లేదు. కనీస అవసరమైన నీటిని కూడా సక్రమంగా అందించలేని కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం ఎక్కడికక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కేసీఆర్ హయాంలో పకడ్బందీ ప్రణాళికలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండబట్టే తొమ్మిదిన్నరేండ్లలో జనం రోడ్డెక్కిన ఛాయలే లేవు. రేవంత్ ప్రభుత్వం జనం గోడు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుతోనే ఈ దుస్థితి దాపురించిందని భాగ్యనగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొంతెండుతున్న బస్తీలకు గుక్కెడు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకొంటున్నారు.
– (వ్యాసకర్త : తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 9849816817