PDS Rice |నెన్నెల: ప్రభుత్వం రేషన్ (Ration) కార్డు దారులకు మూడు నెలలకు చెందిన బియ్యం ఒక్కసారే పంపిణీ చేస్తున్నారు. దీంతో బియ్యం దళారులు కొనుగోలు చేయడానికి గ్రామాల్లో చక్కర్లు కొడుతున్నారు. మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మూడు నెలలకు ఒకసారి అందిస్తుంది. గతవారం నుంచి మూడు నెలల బియ్యం పంపిణి చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోలు అందిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న బియ్యం దళారులు రేషన్ దుకాణాల వెంట క్యూ కడుతున్నారు.
పంపిణీ కేంద్రానికి వచ్చిన వినియోగదారునితో ధర మాట్లాడుకొని కొనుగోలు చేస్తున్నారు. సన్నబియ్యం కావడం తో ధర పెరిగింది. కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు చెల్లిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని (Rice) దళారులు మహారాష్ట్ర, ఆసిఫాబాద్ ప్రాంతాలకు ఆటోలు, బొలేరోల్లో తరిలించి అక్కడ కిలో రూ. 25 కు విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతి రేషన్ ముందు ఒక దళారీ ఉండి మరి వినియోగదారుల నుంచి బియ్యం సేకరిస్తున్నాడు. ఈ క్రంలోనే మంగళవారం రాత్రి బెల్లంపల్లి వైపు నుంచి నెన్నెల మీదుగా మహారాష్ట్ర కు బొలేరో వాహనంలో దాదాపు 4 టన్నులు బియ్యం తరలిస్తుండగా నెన్నెల టీ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.