అంతులేని అసహనం, అధికారం శాశ్వతం అనుకొని వ్యవస్థల హననం, విపక్షాల ఉనికిని సహించలేని మొండితనం వెరసి మోదీ పాలనలో దేశం దుఃఖం దిగమింగుకుంటున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో విచ్చలవిడిగా ఈడీ, సీబీఐలతో సాగిస్తున్న వేధింపుల పర్వం ప్రజాస్వామ్య వ్యవస్థను అంపశయ్యపై పడుకోబెట్టింది. గుజరాత్‌లోని నాటి అమానవీయ అల్లర్ల నేపథ్యంలో ఎదిగిన మనస్తత్వాన్ని ప్రధాని పీఠంపై కూర్చున్నా వదిలించుకోకపోవడం వల్ల వజ్రోత్సవ దేశంలో విలువైన రాజకీయాలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఎండమావుల చుట్టూ ఎంక్వైరీ ఏజెన్సీలను సర్కస్‌లోని కోతుల్లా ఆడిస్తున్న ఢిల్లీ పెద్దల ధోరణి రాజ్యాంగ మౌలిక విలువలకు చితి పెడుతున్నది.
ఇప్పుడు దేశం రాజకీయ ఖైదీల నిలయం. బేడీల భారతదేశంగా మార్చేసిన మోదీ, అమిత్ షాలు ఇండియన్ హిట్లర్ల అవతారమెత్తారు. ఒకవేళ నేడు గాం ధీజీ, నెహ్రూ జీవించి ఉంటే, లోహి యా, అంబేద్కర్, భగత్‌సింగ్ బతికే ఉంటే క్విట్ బీజేపీ పోరును ఊరూరా రగిలించేవారు. భిన్న భావజాలాలు వర్ధిల్లాల్సిన దేశంలో నమో మోదీ తప్ప ఏ నినాదం వినిపించరాదనే మోషా (మోదీ, అమిత్ షా) శాసనం అమలుపరుస్తున్నారు. ఎవరికోసం ఇదంతా?
భారతదేశ ఎకానమీని దోసుకుపోతున్న నయా ఆర్థిక ఉగ్రవాదుల నేరాలపై విచారణ ఏది? దేశాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న వ్యవస్థీకృత నేరాలపై చర్యలెందుకు తీసుకోరు? భారతదేశం నలుమూలల నుంచి అదానీ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరిపించాలని కోట్లాది గొంతులు కోరుతున్నా, జేపీసీని విపక్షాలు విధానసభ సాక్షిగా డిమాం డ్ చేస్తున్న ప్రధాని పట్టించుకోరేం? లక్షల కోట్ల రూపాయల భారీ నష్టం ఆర్థికవ్యవస్థకు కలిగినా, నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉండగలుగుతున్నారు?
ఢిల్లీ ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని స్కాంగా చిత్రీకరించడంలో ఈడీకి ఎటువంటి అభ్యంతరం కనిపించకపోవడం విడ్డూరం కాదా? గుజరాత్‌లోని అటవీభూమి క్యాటగిరీని మార్చి చూపి, తక్కువ ధరకే ఆదానీకి ముంద్రా పోర్టు భూములను కట్టబెట్టడం నేరమని ఆ రాష్ట్ర శాసనసభ బీఏసీ నిర్ధారించింది. అయినా మోదీకి మోకరిల్లిన ఈడీ, సీబీఐలకు ఇది ఏ మాత్రం కనిపించదు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి మాదకద్రవ్యాల దిగుమతికి కేరాఫ్ అడ్రస్‌గా గుజరాత్‌లోని కచ్ తీర ప్రాంతం మారిందని ఆ రాష్ట్రంలోని ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 26న వ్యాఖ్యలు చేసినా సీబీఐ, ఈడీల చెవికెక్కనే ఎక్కదు. 2021 సెప్టెంబర్ 16న ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా తరలించిన 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్‌లోని ఆదానీ ముంద్రాపోర్టులో పట్టుబడినా సమగ్ర దర్యాప్తు జరగనే జరగదు. ఇలా ఎన్ని నేరాలు, దేశ యువతను నిర్వీర్యం చేసే దారుణ దందాలు సాగుతున్నా, దొంగలను మాత్రం పట్టుకోరెందుకు?
జీవీకే గ్రూప్‌పై కేసుల ఫలితంగా ఎయిర్‌పోర్టులు అదానీ వశమయ్యాయి. గంగవరం పోర్టు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే సహాయం చేసి పెట్టాయి. తాజాగా 13 వేల కోట్లకు పైగా ముంచి పరారైన మెహుల్ చోక్సీపైన జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు ఉపసంహరించుకున్నారనే వార్త విన్న తర్వాత మోదీది దేశభక్తుల ప్రభుత్వమా? దేశభుక్తల బంధుగణమా నిర్ధారణకు రాలేమా?
ఒక్కరా, ఇద్దరా, ఎంతమందో ఆర్థిక నేరగాళ్లు దోచుకొని దేశం వదిలి ఎగిరిపోయారు. 9 వేల కోట్ల కుంభకోణం చేసిన విజయ్ మాల్యా, 11,356 కోట్ల స్కామ్ చేసిన నీరవ్ మోదీ ఎగిరిపోతుం టే దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు ఎవరి ఆదేశాలతో చూపు కోల్పోయిన బసవన్నల్లా మారిపోయాయో బుద్ధిజీవులు అర్థం చేసుకోలేరనుకుంటున్నారా?
మోదీ పాలనలో కొన్ని చిన్న సంస్థలు సైతం దేశం దిమ్మతిరిగే ఆర్థిక నేరాలను అలవోకగా చేస్తున్నాయి. ఏబీజీ షిప్‌యార్డు అనే సాధారణ షిప్పింగ్ కంపెనీ 28 బ్యాంకులను మోసం చేసి 22 వేల కోట్లను కొల్లగొట్టింది. డీహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ 17 బ్యాంకులను ముంచి 31 వేల కోట్లను దోచేసింది. కేంద్రమే స్వయంగా రాయితీల పేరిట బడా కంపెనీలకు దోచిపెట్టింది. దేశ ఆర్థికరంగాన్ని దివాళా తీయించిన అక్రమాలపై విచారణ జరిపి, సత్వరమే దోషులను తేల్చాల్సిన బాధ్యతను వదిలి, బిస్కెట్ ఆరోపణలపై పోస్ట్‌మార్టం చేస్తున్న ఈడీ, సీబీఐలను ఏ పేరుతో పిలవాలో మనమంతా తేల్చుకోవాలి. ఉన్నత ఆశయాలతో చట్టబద్ధంగా ఏర్పడిన ఈడీని మోదీ బీజేపీ ఎనిమీస్ ఎరాడికేషన్ (బీఈడీ)గా మార్చేశారు. వారికి ఎరాడికేషన్ ఆఫ్ డెమోక్రాట్స్ డ్యూటీని నిర్దేశించారు. ఇప్పుడు ఈ దర్యాపు ్తసంస్థలు విశ్వసనీయత కోల్పోయి, వాటిపైనే దర్యాప్తు జరిపించాల్సిన పరిస్థితి వచ్చిపడింది. అపరిమిత అధికారాల బెత్తం తో అన్యాయమైన విచారణ జరుపుతున్నా రు. మోదీ పరివారం కంట్లో ఆనందం కోసం వ్యవస్థల కుత్తుకలు నరుకుతున్నారు.
బీజేపీ పెద్దలు ప్రజాస్వామ్య వధ వేటలో ఎంతదూరం వెళ్లగలిగారంటే న్యాయవ్యవస్థనూ బెదిరించే బరితెగింపునకు వెనుకాడటం లేదు. ఈ దారుణాలను నిలదీస్తూ, జనం బాధల విముక్తి కోసం, దేశ భవిష్యత్ కోసం కేసీఆర్ కార్యాచరణకు దిగడమే మోదీ పార్టీకి కంటగింపుగా మారింది. రాజకీయ పోరాటంలో విధానాలు పునాదిగా తలపడాలి. కార్యాచరణ ద్వారా జనామోదం పొందాలి. కానీ, అద్వానీ లాంటి నేతలనే వంచించిన, ఎదగడానికి ఏ తలనైనా తొక్కే కర్కశత్వానికి అలవాటుపడ్డ మోదీ, అమిత్ షాలకు ఈ ప్రజాస్వామ్య సూత్రం తలకెక్కదు కదా? అందుకే నియంతల మెడలు వంచిన ప్రజా చరిత్రను అందుకొని అందరం కదులుదాం. దేశం కోసం కేసీఆర్ నాయకత్వంలో మరో ధర్మ పోరాటానికి దుంకుదాం. గులాబీ రాజ్యంలో గోల్డెన్ ఇండియా సాధించేదాకా అందుకో.. జెండందుకో.. గులాబీ జెండందుకో’
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242