హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డిని 2024 ఫిబ్రవరి 26న రెండేండ్ల పదవీకాలానికి ప్రభుత్వం నియమించింది. మంగళవారం సాయంత్రం ఆయన పదవీకాలం ముగిసింది. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీ, జిల్లా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు జరుగుతున్న కీలక సమయంలో పదవీ విరమణ ముగిసిన శ్రీనివాస్‌రెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త చైర్మన్‌ను నియమిస్తారా? అనే సందేహం జర్నలిస్టు వర్గాల్లో వ్యక్తమైంది. చివరి రోజు సాయంత్రం పదవీకాలం ముగిసే వరకు ప్రభుత్వం నుంచి పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు రాలేదు.
దీంతో పదవీకాలం ముగిసిన అనంతరం చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి .. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ధన్యవాదాలు, విధుల్లో సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేన్నట్లు స్పష్టమైందని జర్నలిస్టు వర్గాలు భావిస్తున్నాయి. అయితే తన పదవీకాలం పొడిగింపునకు ఆయన ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.