కాంగ్రెస్ పాలనలో రైతులు చావలేక బతుకుతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అటు రైతు భరోసా అందక, ఇటు రుణమాఫీ కాక సాగు చేసేందుకు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సాగుకు నీళ్లు అందకపోవడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేసిన పంటను కాపాడుకునేందుకు నిన్నటివరకు భగీరథ ప్రయత్నం చేశారు. అయితే, రాత్రనక, పగలనక చెమట చిందించి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పంటల సాగు, నీటి నిర్వహణలో సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ ఏడాది యాసంగిలో గతం కంటే చాలా తక్కువగా పంటలు సాగయ్యాయి. వరి విస్తీర్ణం చాలావరకు తగ్గింది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం… 56 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. అందులోనూ నాట్లేసిన తర్వాత నీళ్లు అందక చాలామటుకు పొలాలు ఎండిపోయాయి. ఇప్పుడు ఆ వచ్చిన కొంత దిగుబడిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతున్నది. ఈ రబీలో 137 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే అందులో సగం వరకు అంటే 70 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే రైతులను నిండా ముంచింది. కొనుగోలు చేసే ఆ కొంత ధాన్యాన్ని సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ.. ఇప్పటివరకు వందల్లోనే కేంద్రాలను ప్రారంభించడం విడ్డూరం. ఇదే అదనుగా దళారులు అందినకాడికి రైతన్నలను దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని రైతన్నలను రైస్ మిల్లుల యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి.
వాస్తవానికి క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,300 మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ ధర ఏ ఒక్క రైతుకు కూడా దక్కడం లేదు. ఇటీవల కురిసిన నాలుగు చినుకులను సాకుగా చూపుతూ దళారులు, మిల్లర్లు రైతులకు మద్దతు ధర రాకుండా ఎగనామం పెడుతున్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతన్నలు దిక్కులేక దళారుల చేతుల్లో చిక్కి మోసపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ క్వింటాలు వరి ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని వాగ్దానం చేసింది. వానకాలం పంట కొనుగోలు సమయంలో ఈ హామీని కాంగ్రెస్ సర్కార్ తూతూ మంత్రంగా అమలుచేసి చేతులు దులుపుకొన్నది. ఇప్పుడైతే ఏకంగా బోనస్ మాటనే ఎత్తడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, వడ్లు కొనుగోలు చేస్తే బోనస్ చెల్లించాల్సి వస్తుందేమోనని ప్రభుత్వం జంకుతున్నది. రైతులు ఈ దుస్థితికి చేరడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. సాగునీటి నిర్వహణపై రేవంత్ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు. కేవలం కేసీఆర్‌పై అక్కసు తో రైతులపై రేవంత్ కక్షగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి, పంటలను పండబెట్టారు. కాళేశ్వరం సహా రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. రైతులతో ఓ దిక్కు ప్రభుత్వం పరాచికాలాడుతుం టే ఇంకోదిక్కు ప్రకృతి కూడా వారిపై పగబట్టింది. అకా ల వర్షాలు, వడగండ్ల కారణంగా రైతులకు కన్నీళ్లే మిగిలాయి. అకాల వర్షానికి వడ్ల రాశులు తడిసిపోవడంతో ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన రైతు దంపతుల కన్నీటి రోదన అందర్నీ కలచివేసింది.
నా నియోజకవర్గమైన జనగామ, సిద్దిపేట సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అకాల వర్షం కారణంగా ఒక్క గింజ కూడా మిగలకుండా వడ్లు రాలిపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం వరి గడ్డి కూడా పనికి రాకుండా పోయింది. రాష్ట్రంలోని రైతన్నలు రాజులవుతున్న దశలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే అప్పటి నుంచి రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు దెబ్బ మీద దెబ్బ తాకుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో కర్షకులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. కేంద్రం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.2,300 మద్దతు ధరతో పాటు రూ.500 చొప్పున బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలవాలి. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులతో పాటు తప్పని పరిస్థితుల్లో మిల్లర్లకు విక్రయిస్తున్న వారికి కూడా బోనస్ చెల్లించాలి. వస్తూ వస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట తీసుకువచ్చిన కరువు కారణంగా రైతు కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాడు. ఈ సమయంలో రైతును ఆదుకోకపోతే, ఒకప్పుడు రైతు ఉండేవాడని భవిష్యత్తు తరాలు పుస్తకాల్లో చదువుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.