ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయ్. గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయ్. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే.. అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఫలితంగా ఎన్కౌంటర్ అనే మాట సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో అర్థం అయ్యింది అనుకుంటా. అదే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఆపరేషన్ కగార్’.
దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన కార్యాచరణే ‘ఆపరేషన్ కగార్’. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా వారిని ఏరివేయడం కోసం కేంద్రప్రభుత్వం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు సంచలనంగా మారాయి. ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఛత్తీస్‌గఢ్ అబూజ్మడ్ అడవులు కాల్పుల మోతతో హోరెత్తగా.. తాజాగా భూపాలపల్లి సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోనూ తుపాకుల గర్జన వినిపించింది.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌ను వేగవంతం చేస్తూ.. వేల మంది పోలీసు, కేంద్ర బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తున్నది. తెలంగాణలోని ములుగు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లోని ఎత్తయిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 21 రోజులపాటు ఆపరేషన్ కగార్‌ను నిర్వహించారు.
ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆపరేషన్ కగార్ పొలిటికల్ టర్న్ తీసుకున్నది. దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఈ ఆపరేషన్‌ను గిరిజనులు, యువతపై జరుగుతున్న హింసాత్మక దాడిగా మానవ హక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికగా పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కగార్ పేరిట గిరిజనుల ఊచకోత తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట యువకులు, గిరిజనులను ఊచకోత కోస్తున్నది. అది ధర్మం కాదు. నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నరు. మేము ప్రభుత్వం దగ్గరికొచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నమని అంటున్నరు. నేను కేంద్రాన్ని కోరుతున్నా… బలం ఉంది కదా అని చంపుకొంటూ పోవడం సరికాదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయండి. నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్లేం మాట్లాడుతరో చూడండి. అది గూడ నల్లనా, తెల్లనా దేశం ముందటికి రానీయండి. అట్ల కాదు, మొత్తం నరికి పారేస్తం, కోసి పారేస్తం అంటే ఎలా? మిలటరీ మీ దగ్గర ఉన్నది కాబట్టి కొడతరు. కానీ, అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఉత్తరం రాసి ఈ మాటను ఢిల్లీకి పంపిద్దామా? మీరంతా చప్పట్లు కొడితే తీర్మానంగా భావించి కేంద్రానికి పంపిద్దాం’ అంటూ ఎల్కతుర్తి వేదికగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఏప్రిల్ 21న ‘ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్ (కర్రెగుట్టలు)’ ప్రారంభమైంది. మూడు వారాల్లో 28 సార్లు ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, 18 మంది జవాన్లకు గాయాలైనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. చర్చలకు కేంద్రంలోని మోదీ సర్కారు సిద్ధంగా ఉందో, లేదో? స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ ద్వారా ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్‌ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రజాస్వామిక వాదులు, శాంతికాముకులు, అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే విపక్షాలు, ప్రజల నుంచి ఆపరేషన్ కగార్‌పై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందా, లేదా? అనేది చూడాలి.
– (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి