16 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ గతం పునరావృతమవుతుండటం శోచనీయం. తొమ్మిదిన్నరేండ్లలో స్వరాష్ట్ర తెలంగాణ సాధించిన విజయాలన్నీ తెరమరుగవుతూ మళ్లీ తెలంగాణ పరాధీనంలోకి జారిపోతుండటం విషాదకరం. మరెందుకీ వ్యత్యాసం? ఎక్కడుందీ లోపం? పాలనా విధానాల్లో ఉన్నదేమిటీ? ఏలికల్లో లోపించిందేమిటీ? జాతీయ పార్టీలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలకు.. అమలుచేస్తున్న వ్యూహాల్లో ఎందుకింత వైరుధ్యం? ఇదీ నేడు సగటు తెలంగాణ పౌరుడి ఆవేదన, ఆక్రోశం.
ఒక వైపు వలసాంధ్రుల దోపిడీ.. మరోవైపు ఏలికల సంస్కరణల రాపిడి. వెరసి ‘తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో/ తడిగొంతులారిపాయె తుమ్మెదాలో/ రాక రాక నల్ల వస్తే తుమ్మెదాలో/ ఒక్క బిందె నిండదాయె తుమ్మెదాలో’, ‘తలాపునా పారుతుంది గోదారి.. నీ చేను.. నీ చెలక ఎడారి’, ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసె తెలంగాణలోనా.. మన పంట చేలలోనా’, ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’, ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’, ‘వాగు ఎండిపాయెరో.. పెద్దవాగు తడి పేగు ఎండిపాయెరో’.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో తెలంగాణ ఏర్పాటు ముందువరకూ తెలంగాణ జన దీనజీవన స్థితిగతులను.. మన్నుకొట్టుకుపోయిన ఊళ్లను.. మనుషులను.. అక్షరబద్ధం చేసిన పాటలు ఎన్నో. తెలంగాణ దుఃఖాన్ని.. కష్టాన్ని.. నష్టాన్ని దర్పణం పట్టినవి మరెన్నో.
తెలంగాణ వలపోతలను.. తలపోతలను ఎలుగెత్తి నినదించినవి ఇంకెన్నో పాటలు. అట్లాంటి విషమ పరిస్థితుల్లో… ఆగమై.. అతలాకుతలమైన తెలంగాణ పల్లెకు ఆలంబనగా నిలిచింది గులాబీ జెండా. బతుకుపై.. భవిష్యత్తుపై భరోసా నింపింది. ప్రగతి కోసం.. జాతి అస్తిత్వ పోరు కోసం భుజం కలిపింది, కదం తొక్కింది. తెలంగాణ సబ్బండ వర్గాలను కదిలించింది. యావత్ భారతాన్ని ఒప్పించి స్వరాష్ట్ర కలను సాకారం చేసి చూపింది. పాలనా పగ్గాలను చేపట్టినా ఆ ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ నేతృత్వంలో గులాబీ సర్కార్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చూపింది. దశాబ్దాలుగా పల్లె పల్లెన మార్మోగిన కరువు పాటల ఔచిత్యాన్ని పూర్తిగా తుడిచేసింది. ఆ రాతలను చెరిపేసింది. జీవన దృశ్యాలను మార్చేసింది. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు.. ఊటలు జాలువారుతున్న వాగులు.. కనుచూపు మేర తలలూపుతున్న పచ్చని పైర్లు.. ధాన్యపు రాసులు.. సొంత ఊళ్లకు చేరుతున్న వలసజీవులు.. ప్రగతి వికాసం పొందుతున్న పల్లెలు.. పెరుగుతున్న జీవన ప్రమాణాలు. నాటి, నేటి తెలంగాణ స్పష్టమైన, పరిణామాత్మక, గుణాత్మక మార్పును చూపింది. అభివృద్ధి సూచికలు.. వరిస్తున్న అవార్డులే అందుకు తార్కాణాలు.
ఘనత వహించిన ఏలికల కంటే భిన్నంగా కేసీఆర్ చేసిందేమిటి మరి? తెలంగాణే కాదు ఏ రాష్ట్రమైనా, దేశమైనా, ఏ రంగమైనా ఎదగాలంటే మొదట ఆ రాష్ట్రంలో ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి అనేదే సమస్త రంగాల అభివృద్ధికి, అవకాశాలకు పునాది. మరి ఉత్పత్తికి ప్రధానమైంది జలవనరులు. దాన్ని అర్థం చేసుకొని అమలుచేస్తే చాలు అభివృద్ధి సాగిపోతుంటుంది. ఒకనాడు ఆ నీటి వనరులు లేకపోవడం వల్లే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. ఇది తెలంగాణకు స్వానుభవ పాఠం.
అందుకే తెలంగాణ తన భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక జీవన విధానానికి అనుగుణమైన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నది. విభిన్న ఆలోచనలతో, పోటీ ప్రపంచానికి అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యావసాయిక రాష్ర్టాన్ని ఆ రంగం ద్వారానే అభివృద్ధి చేసే విధానాలను అమలుచేసింది. అందుకు అవసరమైన మౌలికరంగాల్లో ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో భారీగా పెట్టుబడులను పెట్టింది.
ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యాన్నిస్తూ నీటి వనరులను ఒడిసిపట్టింది. ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి పెరిగింది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఆదాయాలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అంతిమంగా అది రాష్ట్ర పురోగమనానికి బాటలు వేసింది. పారిశ్రామికరంగం విస్తరణకూ దోహదపడింది. సమస్త రంగాలు పునర్వికాసం పొందుతుండటం గమనార్హం. అంతేకాదు, తెలంగాణ జాతిలో నిద్రాణమై ఉన్న శక్తులన్నింటినీ చైతన్యీకరించింది. కిందిస్థాయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పథకాలను, అభివృద్ధి విధానాలను అమలుచేసింది. సంపద పెంచుతూ, సబ్బండ వర్గాలకు సమంగా పంచుతూ, అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ ముందుకుసాగుతూ సత్ఫలితాలను సాధించింది. ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎజెండాను రూపొందించుకోవడమే గాక, సమర్థవంతమైన పాలనను అందిస్తూ అందరి మన్ననలు పొందింది. యావత్ భారతావని దృష్టిని ఆకర్షించడమే కాదు, నవ భారతావనికి బీఆర్ఎస్ పాలనా విధానాలే దారిదీపమై నిలిచాయి. రైతుబంధు పథకం ఒక్కటే నిదర్శనం.
కానీ, మళ్లీ తెలంగాణను కాంగ్రెస్ కారుమబ్బులు ఆవహించాయి. గడిచిన 16 నెలల పాలనలో మళ్లీ గతం పునరావృతం అవుతుండటం శోచనీయం. మళ్లీ తెలంగాణ పరాధీనంలోకి జారిపోతున్నది. తొమ్మిదిన్నరేండ్లలో స్వరాష్ట్రం తెలంగాణ సాధించిన విజయాలన్నీ తెరమరుగవుతున్నాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నది. మరెందుకీ వ్యత్యాసం? ఎక్కడుంది లోపం? ఎవరిదీ పాపం? పాలనావిధానాల్లో ఉన్నదేమిటీ? ఏలికల్లో లోపించిందేమిటీ? జాతీయపార్టీలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలకు.. అమలుచేస్తున్న వ్యూహాల్లో ఎందుకింత వైరుధ్యం? ఇదీ నేడు సగటు తెలంగాణ పౌరుడి ఆవేదన. ఆక్రోశం. నేటి ఆలోచన.
వాటిని తప్పక చర్చించుకోవాలి. అది అవసరం. అత్యావశ్యకం. అంతేకాదు, అందుకు కారణాలు కూడా సుస్పష్టం. ఢిల్లీ ఏలికల గాలివాటు గమనం? ఓట్ల రాజకీయం.. సీట్ల పంపకాలు, కూటములు.. ఓటములు, గెలుపులు తప్ప మరేదీ పట్టని వైనం. ఒక నిర్దిష్టమైన అభివృద్ధి విధానం, ప్రగతిపై పట్టింపు లేనితనం. భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణమైన, ప్రయోజనకరమైన, ప్రగతికారకమై న విధానాలను కాంగ్రెస్ విస్మరించడమే. ప్రగతి పురోగమానికి ఊతమిచ్చే మౌలిక వసతుల కల్పనను పూర్తిగా పక్కనపెట్టడమే. ఫలితంగానే తెలంగాణ ప్రగతి కుంగుబాటుకు కారణమనేది సత్యం. అందులో ఎలాంటి సందేహమూ లేదు. గులాబీ జెండా అనుసరించిన అభివృద్ధి విధానమే తెలంగాణకు అనివార్యం. అదే తెలంగాణ పురోగమనానికి అనుసరణీయ మార్గం. జై తెలంగాణ. జైజై కేసీఆర్. జైజైజై బీఆర్ఎస్.
– (వ్యాసకర్త: సామాజిక కార్యకర్త) గవినోళ్ల శ్రీనివాస్ 89198 96723