ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ఎలాగైతే ప్రజలకు మోసం చేసిందో, సమగ్ర కుటుంబ కుల గణన విషయంలోనూ అలానే మోసం చేసింది. ప్రజలను నమ్మించి గొంతు కోసింది. కుల గణన ద్వారా మెజార్టీ బహుజనులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం జరుగుతుందనుకున్న ఆశలను నీరు గార్చింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల నివేదికతో బండారం బయటపడింది.
ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన సర్వే తప్పుల తడకగా ఉన్నది. బీసీలకు పూర్తిగా అన్యాయం చేసేలా ఈ నివేదికను ప్రభుత్వం తయారు చేసింది. ‘మేమెంతో.. మాకంత’ అన్న బలహీన వర్గాల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ కుల గణనతో బీసీలకు న్యాయం జరుగుడు మాట దేవుడెరుగు.. పూర్తిగా అన్యాయం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టడం అంటే బీసీలకు హక్కుగా రావాల్సిన రాజకీయ ఆర్థిక సామాజిక అవకాశాలను అందకుండా చేయడమే అవుతుంది.
మరోవైపు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక బలహీనవర్గాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బహుజనులకు న్యాయం చేయాలన్న ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీకి ఉంటే సర్వే నివేదికలో క్యాస్ట్, సబ్ క్యాస్ట్‌ను స్పష్టంగా చూపెట్టేవారు. కానీ, ప్రభుత్వ రిపోర్ట్‌లో గంపగుత్తగా బీసీలు ఇంత, మైనార్టీలు ఇంత, ఓసీలు, ఎస్సీలు ఇంతమంది అని ప్రకటించారు తప్పితే సబ్ క్యాస్ట్‌ల ప్రస్తావన తీసుకురాలేదు.
రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానంలో మరో వైఫల్యం కూడా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలని తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి భవిష్యత్తులో వారికి ఏ క్యాటగిరీలో రిజర్వేషన్లు ఇస్తుందో రేవంత్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.
ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ కుల గణన నివేదికపై కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలకు ఇది విరుద్ధంగా ఉన్నదని ఆగ్రహం వ్యకం చేస్తున్నాయి. గతంలో 51శాతంగా ఉన్న బీసీలు ఇప్పుడు 46 శాతానికి ఎలా పడిపోయారని ప్రశ్నిస్తున్నారు. బీసీల జనాభాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తగ్గించిందని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా ముస్లిం బీసీలుగా రిపోర్టులో చేర్చడం.. బీసీల జనాభా పెరిగిందని చెప్పే ప్రయత్నమే తప్ప మరోటి కాదు.
ప్రభుత్వ నివేదికలో హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉన్నది. తెలంగాణలో క్రిస్టియన్ల ప్రస్తావనే లేదు. మైనారిటీల్లో వారు కూడా ఉన్నారో, లేదో తెలియదు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మైనార్టీల జనాభా 10 శాతం మాత్రమేనని చెప్పడం ద్వారా ఇటు క్రిస్టియన్లకు, అటు ముస్లింలకు అన్యాయం చేయడమే అవుతుంది. వారి రిజర్వేషన్ హక్కులను హరించడమే అవుతుంది.
అంతేకాదు, ముస్లింలకు ప్రభుత్వం వాగ్దా నం చేసిన 12 శాతం రిజర్వేషన్‌పై ప్రభావం పడుతుంది. మొత్తంగా ప్రభుత్వం పెట్టిన నివేదిక ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉంది తప్ప ప్రజలు కోరుకున్నట్టు లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. మరోవైపు, బీసీ కులాల్లో కూడా ఆధిపత్య వర్గాలు ఉన్నాయి. బీసీల్లో ఉన్న ఉప కులాలపై స్పష్టత ఇవ్వకుండా గంపగుత్తగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఫలితాలు నిజమమైన లబ్ధిదారులు అందకుండా పోతాయి.
బీసీ కులగణన రిపోర్ట్ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. సొంత పార్టీ నేతలే కులగణన నివేదికపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే అంతా తప్పుల తడకగా ఉందని బీసీ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీల జనాభాను తగ్గించి చూపించారని మండిపడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు వస్తుండటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
కుల గణన రిపోర్ట్ మంత్రి వర్గంలోనే విభేదాలను తారస్థాయికి తీసుకెళ్లింది. సర్వేపై రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య వైరం మరింత ముదిరింది. ప్రకటించిన పథకాలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కుల గణన రిపోర్టుతో సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు కక్కుతున్నది. సమగ్ర కుల గణన స్వచ్ఛందమని, వివరాలు చెప్పాలని డిమాండ్ ఏదీ లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు.. ప్రతిపక్ష నేతలు వివరాలు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరం.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నివేదికను తయారుచేసినట్టుగా ఉన్నది. ఆ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించేందుకు పక్కా ప్లాన్‌తోనే ఈ బీసీ నివేదికను సభలో ప్రవేశపెట్టినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం తప్ప బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి, సంకల్పం కాంగ్రెస్‌లో ఏకోశానా కనిపించడం లేదు.
తోటకూర రమేశ్
98661 68676