జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో ప్రకటించారు. అలాగే, బీజేపీని ఎదుర్కొనేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో చర్చలు జరుపుతున్నట్టు బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో తెలిపారు. 2024లో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఆయన చెప్పారు. బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ప్రారంభం కావడానికి రెండు మూడు రోజుల ముందే ఇలాంటి ప్రకటనలు వెలువడటం దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండనున్నదో తెలియజేస్తున్నాయి. ఇది ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు, నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభసూచన.
దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించి, దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించుకోవటం ఇదే ప్రథమం. ఈ రకంగా కూడా బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తున్నది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. బీఆర్ఎస్ ప్రస్తుతం అదే చేస్తున్నది. ఇంట గెలిచి రచ్చ గెలవటానికి ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ మహాత్మాగాంధీ బాటలో శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్మించి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. రాజకీయ, పాలనా పరమైన కుయుక్తులు, కుట్రలను అధిగమించి అద్భుతమైన పాలనను అందిస్తున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలతో రాష్ట్రం సస్యశ్యామలమైంది. కేసీఆర్ దార్శనికతతో సంక్షేమం, అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ ఎదిగింది. అనేక పథకాలను కేసీఆర్ తన మేధోమథనంతో రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇవ్వాళ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ అమలు చేస్తే, దేశం అనుసరించే స్థాయికి పరిపాలన చేరింది. తెలంగాణ తరహా అభివృద్ధి-సంక్షేమ నమూనా దేశానికి అవసరమవుతున్నది.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు 15 మంది ప్రధానులు పాలిస్తే వారిలో దక్షిణాది నుంచి వచ్చింది ఇద్దరే. అందులోనూ వారి పదవీ కాలం 5 ఏండ్ల 289 రోజులు మాత్రమే. ఇద్దరిదీ కలిపి ఒక పదవీ కాలానికి కొద్దిగా ఎక్కువ. దేశాన్ని ప్రభావితం చేయగలిగిన నేతలు దక్షిణాది నుంచి ఉన్నా, వారికి దేశాన్ని పాలించే అవకాశం మాత్రం ఉత్తరాది వారు దక్కనివ్వడం లేదు. నెహ్రూ, ఇందిర తర్వాత అత్యధిక కాలం పని చేసింది మన్మోహన్ సింగ్. ఆ తర్వాత మోదీ. ఈ మొత్తం పాలనలో దేశానికి అందినదేమిటి? ప్రజలకు ఒరిగినదేమిటి? ఇన్నేండ్లలో కేవలం రెండు మూడు పార్టీలే దేశాన్ని ఏలాయి. అత్యధిక కాలం కాంగ్రెస్ , బీజేపీలే. కానీ, కావాల్సిన స్థాయి అభివృద్ధి జరగలేదు. మన దేశం రాష్ర్టాల సమాఖ్య. కానీ, కేంద్రం తన పెత్తనాన్ని నడిపించుకొని రాష్ర్టాల హక్కులను హరించివేసింది.
యూనియన్ ఆఫ్ స్టేట్స్‌ని యూనిటరీ స్టేట్స్‌గా మార్చేసింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల రక్షణ కోసం ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఇవి క్రమంగా ఎదిగాయి. వాటి మద్దతు లేనిదే, జాతీయ పార్టీలు మనలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ దశలో రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పుడు రాష్ర్టాలను కలుపుకొనిపోయే కేంద్రం కావాలి. కేంద్రంతో పెనవేసుకుని పని చేసే పరిస్థితులు రాష్ర్టాలకు ఉండాలి. మరోవైపు, దేశంలో అపారమైన జల సంపద ఉంది. అయినా నీరు అందక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కుల మతాల ఘర్షణలు, రాష్ర్టాల మధ్య వివాదాలు.. ఒకవైపు ప్రపంచమంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుగుతూ ఉంటే, దేశం అధోగతి పాలవుతున్నది. ఈ పరిస్థితి పోవాలె. గుణాత్మకమైన మార్పు రావాలె.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న వివక్షకు, ఇవ్వాళ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు సామీప్యతలుండటం బాధాకరం. ఇవి ఇంకా కొనసాగుతుండటం విషాదకరం. ‘తెలంగాణ నుంచి వచ్చే ఎంపీల హిందీ కమ్జోర్గా ఉంటుంది. కమ్జోర్ హిందీకి కమ్జోర్ హిందీలోనే జవాబిస్తాను’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ ఎంపీని అవమానించారు. ప్రధాని మోదీ, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారు. తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని అడిగితే, తెలంగాణ ప్రజలు నూకలు తినొచ్చుగా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కసెక్కాలాడారు. నిజానికి దక్షిణాదిలో హిందీ బాగా మాట్లాడేది తెలంగాణ ప్రజలే. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ కన్నా తెలంగాణ ప్రజలు హిందీలో సాఫీగా మాట్లాడగలుగుతారు. అందుకే తెలంగాణను ఉత్తర-దక్షిణ భారతానికి భాషా వారధిగా భావిస్తారు. హిందీ మాతృభాషగా కలిగిన లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఆ విధంగా చూస్తే దేశ సమైక్యతకు తెలంగాణ వారధిగా నిలుస్తుంది. తెలంగాణ నుంచి వచ్చే భావి ప్రధానులు కచ్చితంగా భారత సమైక్యానికి సారథులవుతారు.
సమైక్య స్ఫూర్తికే గాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాఖ్య స్ఫూర్తికి కూడా సంకేతంగా నిలుస్తారు. రెండు టర్మ్‌ల పాటు రాష్ట్ర సీఎంగా, అంతకుముందు కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఇందుకు ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్రం నుంచి రాష్ర్టాలు ఏం కోరుకుంటున్నాయి? కేంద్రం రాష్ర్టాల పట్ల ఎలా ఉండాలన్నది తెలిసిన నేతగా కేసీఆర్ భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపగలుగుతారు. బలహీనమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రం అనే బీజేపీ నినాదాన్ని రూపుమాపి బలమైన రాష్ర్టాలతోనే బలమైన కేంద్రం అన్న సత్యాన్ని కేసీఆర్ నిలబెడతారు.
తెలంగాణతో పేగు బంధం తెగిపోతుందా?
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుంటే కొందరు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏమైనా దేశం విడిచి పోతున్నరా? దేశ రాజకీయాల్లోకి వెళితే, తెలంగాణతో పేగు బంధం తెగిపోతుందా? ఇంటి బాధ్యతలను నెరవేర్చి, బయటి బాధ్యతలను తలకెత్తుకుని పెద్ద కొడుకు బయటకు వెళ్ళినంత మాత్రాన ఆయనకు ఆ ఇంటితో, ఆ తల్లిదండ్రులతో, పిల్లలతో ఉన్న రుణానుబంధం, పేగుబంధం తెగిపోయినట్లేనా? ఇలాంటి రాజకీయ విషపూరిత వ్యాఖ్యలు అంతగా పట్టించుకోవాల్సినవేమీ కావు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, 60 ఏండ్ల ఆకాంక్షలను నెరవేర్చిన నేతగా కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో చిరస్థాయిగా, అజరామరంగా నిలిచిపోయారు. బీఆర్ఎస్ ఏర్పాటు తెలంగాణతో తెంచుకునే పేగు బంధం కాదు. దేశంతో పెనవేసుకునే మరింత గాఢమైన బంధంగా మారనుంది. సకల వర్గాల ప్రజలకు అవసరమైన సమగ్ర పరిపాలన ఎజెండాతో రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్, అదే ప్రామాణిక పరిపాలనా దక్షతతో దేశాన్ని ప్రగతి పథంలో నడుపగలరని ప్రజలు నమ్ముతున్నారు. కేసీఆర్‌కు మన దేశం మీద ఉన్న అవగాహన, ఆయన రాజనీతిజ్ఞత, దార్శనికత, నాయకత్వ పటిమ, నిబద్ధత, సమర్థత, సంస్థాగత, నిర్మాణాత్మక ప్రణాళికలు కచ్చితంగా దేశానికి దిశానిర్దేశాలు అవుతాయి. దేశ అవసరాలను గుర్తించి పునర్ నిర్వచించుకుని, పునర్ నిర్మించుకోవాల్సి ఉంది. లౌకిక ప్రజాస్వామిక భారతదేశాన్ని మరింత ఉన్నతంగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే, సమస్త దేశ ప్రజానీకానికి సమగ్ర అభివృద్ధి, సంక్షేమాలను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆల్ ది బెస్ట్!