ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లందరి బాగు కోరాలి. అలాకాకుండా పక్షపాత ధోరణితో కొందరికి పంచభక్ష్యపరమాన్నాలు పెడుతూ, మరికొందరికి పచ్చడి మెతుకులు కూడా పెట్టకపోవడం దుర్మార్గమే అవుతుంది. మన రాష్ట్రం పట్ల కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తున్నదిదే. ఆయన ఆది నుంచి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి. తెలంగాణ ఏర్పాటును తప్పుపడుతూ ఏకంగా పార్లమెంట్‌లోనే పలుమార్లు ఆరోపణలు చేశారు. తెలంగాణపై ఆయనకున్న పగ, ద్వేషం అక్కడితో ఆగిపోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా మాట జారుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉండి తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. జాతీయ ప్రాజెక్టుల నుంచి యూనివర్సిటీల దాకా తెలంగాణకు ఏదీ రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ప్రకటించిన వాటిని సైతం కల్లబొల్లి సాకులు చెప్పి పక్కనపెట్టేశారు.
రాష్ట్రం ఏర్పడిన నాడు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన నిపుణులు ఈ ప్రాంతానికి ఏమేం అవసరం ఉన్నాయో.. వాటన్నింటిని విభజన చట్టంలో పొందుపరిచారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రాష్ర్టానికి ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెడితే వేల మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. అలాగే గిరిజన వర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ములుగులో స్థలం కేటాయించి, తాత్కాలిక భవనం సిద్ధం చేసినా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఫలితంగా వేల మంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అంతేకాదు.. గిరిజనుల జీవన స్థితిగతులపై, ఆరోగ్యపరమైన అంశాలపై, వారి ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఆశించిన స్థాయిలో అధ్యయనాలు కూడా జరగడం లేదు. చివరికి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా.. దాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది.
ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో యావత్ ప్రపంచం చూస్తున్నది. ఐటీ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో దేశంలోని ఇతర మెట్రోసిటీలను పక్కకునెట్టి మనం దూసుకువెళ్తున్నాం. ఇలాంటి సమయంలో మన హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఐటీఐఆర్) ఏర్పాటై ఉంటే ఐటీ రంగ అభివృద్ధి మరో స్థాయిలో ఉండేది. ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఐటీతో పాటు ఐటీ అనుబంధ రంగమైన హార్డ్‌వేర్ రంగం కూడా భారీగా పెరిగి ఉండేది. ఈ రెండు రంగాల్లోనూ దాదాపు రూ.2,19,440 కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఐటీ సెజ్‌లు ఏర్పాటయ్యేవి. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పెరిగి ఉండేది. ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఇప్పటికే 50 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఏటా ప్రత్యక్షంగా దాదాపు రూ.2.97 లక్షల కోట్ల ఆదాయం, పరోక్షంగా దాదాపు రూ.4.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. కానీ తెలంగాణ బాగుపడితే నరేంద్ర మోదీ చూసి ఓర్వలేరు. అందుకే అధికారంలోకి రాగానే ఐటీఐఆర్‌కు మంగళం పాడారు. నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిన అతిపెద్ద మోసం, నష్టం ఇదే.
రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పసుపులో 70 శాతం వరకు నిజామాబాద్ లోనే అవుతోంది. ఇతర జిల్లాల్లో మరో 30 శాతం ఉత్పత్తి అవుతున్నది. కానీ రైతులు మాత్రం పంటకు సరైన ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. పసుపుబోర్డు ఏర్పాటుచేస్తే వంగడాల నాణ్యతపై పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది.
ప్రస్తుతం నాణ్యమైన పసుపుకు గరిష్ఠంగా క్వింటాలుకు రూ.9,100 నుంచి రూ.9,600 వరకు ధర పలుకుతున్నది. నాణ్యత కొంచెం తక్కువగా ఉన్నా అది రూ.4,500 దాటడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటైతే నాణ్యతతో పాటు.. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ప్రతీ క్వింటా పసుపుకు దాదాపుగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు నష్టపోతున్నారు. అంటే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా.. దాదాపు రూ.లక్షా 50 వేల వరకు రైతుకు నష్టం జరుగుతున్నది. 2022లో 50 వేల ఎకరాల్లో పసుపు సాగయితే ఇప్పుడు అది 35 వేల ఎకరాలకు పడిపోయింది. రైతులను ప్రోత్సహించాల్సిన కేంద్రం ఇలా గిట్టుబాటు ధర రాకుండా చేసి రైతులను నిండా ముంచుతున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారు. ఇప్పటికీ అతీగతీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకైనా జాతీయహోదా ఇవ్వమనడిగితే అదీ ఇవ్వరు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అదే జాతీయ హోదా ఇచ్చి కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించి, నిర్వహణ చూసుకుంటే లక్ష కోట్ల వరకు రాష్ట్రంపై భారం తగ్గేది. అలాగే పాలమూరు ప్రాజె క్టు పనులు కూడా మరింత వేగంగా పూర్తయి, దక్షిణ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమయ్యేది. దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిం ది. స్వయంగా ప్రధానమంత్రి మన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రశంసించారు. కానీ నిధు లు మాత్రం రాల్చలేదు. సంపద సృష్టిలో అగ్రభాగాన ఉన్నా.. కేంద్ర సహకారం మాత్రం సున్నా. ఫలితంగా కొత్తగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేపట్టాలన్నా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం అక్కడ కూడా అడ్డుపడుతున్నది. రాష్ర్టానికి ఉన్న పరిధిలోపే అప్పులు తెచ్చేందుకు అనుమతి కోరినా ఒప్పుకోవడం లేదు. రాష్ట్రం ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయితో, రూ.వెయ్యి సంపద సృష్టిస్తున్నది. ఇదంతా కండ్లముందు కనిపిస్తున్నది. అయినా కేంద్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
మోదీ వ్యవహారం ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే.. మన రాష్ర్టానికి ప్రకటించినవాటిని తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు పట్టుకెళ్తారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఏండ్లుగా అడుగుతుంటే చివరికి వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతామంటూ ప్రకటన చేశారు. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ పట్టుకెళ్లడంతో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు అటు మళ్లాయి. దీనివల్ల మనకు రావాల్సిన ఉద్యోగాల సంఖ్య తగ్గింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లోబల్ ట్రెడిషినల్ మెడిసిన్ సెంటర్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని మొదట నిర్ణయించారు. కానీ మోదీ దాన్ని కూడా తన పుట్టింటికి పట్టుకుపోయారు. ఇప్పటికే వైద్యరంగంలో దూసుకుపోతున్న తెలంగాణకు సంప్రదాయ వైద్య పరిశోధన కేంద్రం వచ్చి ఉంటే ఆ రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి ఉండేది. ఆయుర్వేద వైద్య విద్య చదివినవారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేవి. ఇక సత్వర న్యాయం కోసం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే.. దీనికి పోటీగా గుజరాత్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయించారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీకి ఎక్కడుంది తెలంగాణపై చిత్తశుద్ధి? ఈ ప్రాంతం మంచి కోరే వాళ్లే అయితే.. ఈప్రాంతాభివృద్ధికి సహకరించాలి కదా. మనకు ప్రకటించిన ప్రాజెక్టులను కొనసాగించాలి. నిధులు విడుదల చేయాలి. పనులు వేగంగా పూర్తయి యువతకు ఉద్యోగాలు వచ్చేలా, ఆయా ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి. కానీ ఎక్కడా ఆ ప్రయత్నం జరగడం లేదు.
పైగా కేంద్రం తీరుతో అన్నిరంగాల్లో కలిపి తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మనకు హక్కుగా రావాల్సినవి ఇవ్వ రు. మనం అడిగినవాటిని పట్టించుకోరు. పైగా రాష్ర్టానికి వచ్చి, పన్నుల్లో మన వాటా కూడా పూర్తిగా ఇవ్వకుండా అత్తెసరు నిధులు ప్రకటించి.. ఏదో మెహర్బానీతో పైసలు ఇచ్చినట్టుగా ప్రగల్భాలు పలుకడం ప్రధాని మోదీకి, బీజేపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. మనకు మంచి చేయనోడు.. కనీసం మనం బాగుపడితే చూసి ఓర్వలేనోడికి, మన గడ్డ మీద స్థానం ఎలా ఉంటుంది?
– (వ్యాసకర్త: టీఎస్ రెడ్కో చైర్మన్)
– వై.సతీశ్‌రెడ్డి 96414 66666