తెలంగాణ అస్తిత్వ ప్రతీక, పోరాట పతాక నమస్తే తెలంగాణ. మన రాష్ట్రం, మన పత్రిక అనే నినాదంతో ఉద్యమ జెండాను రెపరెపలాడించింది. చారిత్రక పోరాటానికి నిలువెత్తు అద్దం పట్టింది. రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడే వరకూ నిరంతరం అక్షర అక్షౌహిణులను సంధించింది. ఇప్పుడు మరోసారి అస్తిత్వానికి ముప్పు వస్తున్నది. దుష్టశక్తులు దూసుకువస్తున్నాయి. తెలంగాణ ఆత్మను ప్రశ్నిస్తున్నాయి.. సవాల్ చేస్తున్నాయి. అందుకే అస్తిత్వ రక్షణ పోరుకు మరోసారి నడుం బిగించింది నమస్తే తెలంగాణ.
అది తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం యథేచ్ఛగా సాగుతున్న కాలం.. మన యాస, భాషలను మనమే తక్కువగా చూసే పరిస్థితి కల్పించిన ఆధిపత్య వికృతం.. మన చరిత్రను మన కండ్ల ముందే అణగదొక్కుతున్న సందర్భం.. మన కవులు, కళాకారులపై అప్రకటిత ఆంక్షలు.. మన పండుగలు, పబ్బాలపై విమర్శలు, వివక్షలు.. వాళ్ల పొలాలకు మన గోదావరి, కృష్ణా జలాలు.. అక్కడ మూడు పంటలు.. ఇక్కడ ఆకలి కేకలు.. వాళ్ల ఫ్యాక్టరీలకు మన వనరులు.. వాళ్లవి కొలువులు, మనవి బానిస బతుకులు. తేనెపూసిన కత్తులతో గొంతుకోసే కౌఠిల్యం.. ఒకవైపు అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు.. మరోవైపు ఆత్మగౌరవాన్ని, హక్కులను హరించివేసే ఎత్తుగడలు.. తెలంగాణ ఉద్యమం ఉత్త తాటాకు మంటని.. సీమాంధ్రోళ్లు సిత్రాతిసిత్రంగా కథలు అల్లుతున్న సందర్భం… ప్రధాన మీడియాగా చలామణీ అయ్యే పత్రికల్లో తెలంగాణ ఉద్యమం గొంతు నొక్కేసే వ్యూహ రచనలు… ఇదిగో ఇలాంటి చీకటి సంధ్యలో చిరుదివ్వెలా వెలిగింది నమస్తే తెలంగాణ. అవిర్భావంతోనే తెలంగాణ ప్రజలను జాగృతం చేసింది. ఆకలి, అణచివేత, దోపిడీ ఉన్నకాడ తిరుగుబాటు రాకపోతే తిప్పలెట్ల తప్పైతదని కర్తవ్యబోధ చేసింది. అవిశ్రాంతంగా, అప్రతిహతంగా జై తెలంగాణ! నినాదాన్ని రగిల్చింది.
తెలంగాణ విముక్తి కోసం పదవులు, పార్టీలను పక్కన పెట్టి పోరాడాల్సిన అవసరాన్ని, అగత్యాన్ని ప్రజల ముందుంచింది. ఒక్క మాటలో
చెప్పాలంటే.. అనునిత్యం తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పి పాలక శక్తులను నిలదీసింది. నాటి ఉద్యమం కాలంలో గానీ, నేటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో గానీ కొంతమంది ఆధిపత్యవాదుల చేతుల్లోని పత్రికలు వాస్తవాలను మరుగున పడేస్తుంటే.. నాడు, నేడు తెలంగాణ ప్రజల పక్షాన బరిగీసి నిలబడి కొట్లాడుతున్నది నమస్తే తెలంగాణ ఒక్కటే.
తెలంగాణ సాధన తర్వాత ఇప్పుడు మళ్లీ శోధన మొదలైంది. అస్తిత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. నిన్నటిదాకా మూతపడ్డ తెలంగాణ వ్యతిరేకుల నోళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. తెలంగాణ సమాజం రెండు యుద్ధాలు చేయాల్సిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకటి ఇంట గెలువడం, రెండు రచ్చగెలువడం. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని అత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు, కుతంత్రాలు మళ్లీ మొదలయ్యాయి. వీటిపైనా ప్రజలను జాగృతం చేసే బాధ్యతను నమస్తే తెలంగాణ తన భుజానికి ఎత్తుకుంది. దోపిడీ పాలకుల మీడియా తాజాగా పవన్ కల్యాణ్ పెట్టిన ప్రెస్‌మీట్‌పై రాసిన వార్తాకథనాలు రెండు నాల్కల ధోరణికి నిలువెత్తు నిదర్శనం. అతని మనసులోని మాటలను, అందులోని అర్థాలను, తెలంగాణ సమాజంపై చిమ్ముతున్న విషాన్ని నమస్తే తెలంగాణ ఎండగడితే.. ఇతర పత్రికలు మాత్రం అతని మాటలనే రెచ్చగొట్టేవిధంగా ప్రచురించిన తీరు గమనార్హం. 2011 జూన్ 6న పురుడుపోసుకున్న నమస్తే తెలంగాణ నేడు 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ పదిహేను సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ అత్మగౌరవానికి విఘాతం కలుగకుండా చంటిబిడ్డలా కాపాడుకోవడంలో నమస్తే తెలంగాణ నాటినుంచి నేటివరకు ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
బహుముఖ ప్రాత్ర
2011 పురుడు పోసుకున్న నమస్తే తెలంగాణ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అంకితమైన ఏకైక దినపత్రికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, నీళ్లు-నిధులు-నియామకాలు, విద్యార్థి ఉద్యమాలు, ఉద్యోగ సంఘాల పోరాటాలు, ప్రజా సభలకు విస్తృత ప్రచారం కల్పించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బలంగా సమర్థిస్తూ సంపాదకీయాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలను ప్రచురించింది.అప్పటి ప్రధాన మీడియా సంస్థలు తెలంగాణ వాదనకు తగిన ప్రాధాన్యం ఇవ్వని సమయంలో, తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేక మీడియా వేదికగా పనిచేసింది. తెలంగాణ సంస్కృతి, భాష, యాస, ప్రాంతీయ ఆత్మగౌరవ అంశాలను ముందుకు తీసుకువచ్చి ఉద్యమానికి సామాజిక బలం చేకూర్చింది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ స్వరాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్రలో నమస్తే తెలంగాణను చాలామంది ‘ఉద్యమ పత్రిక‘గా గుర్తించారు. ఉద్యమ వార్తలు, విశ్లేషణలు, తెలంగాణ ఆత్మగౌరవ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర సాధనకు అనుకూల ప్రజాభిప్రాయాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమస్తే తెలంగాణ.. తెలంగాణ ప్రయోజనాలకు అంకితమైన పాత్రను పోషించింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల రూపకల్పన వంటి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించింది. బంగారు తెలంగాణను మలిచే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులపై విస్తృత కథనాలు ప్రచురించింది. తెలంగాణ ప్రాంతీయ ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల అంశాలపై తెలంగాణ కోణాన్ని ప్రతిబింబించే సంపాదకీయాలు ప్రచురించింది. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన స్రవంతి మీడియాలో తొక్కిపారేసిన పరిస్థితిలో అసలు వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో నమస్తే తెలంగాణ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో చైతన్యం తెచ్చింది. తెలంగాణ లైఫ్‌లైన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు కవరేజ్ ఇచ్చింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, చరిత్రకు ప్రాధాన్యత నమస్తే తనదైన శైలిలో విశ్లేషించింది. తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధే లక్ష్యంగా తీసుకున్నది.
ఇవాళ ప్రజల పక్షాన పాత్ర
రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నమస్తే తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పుతున్నది. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడమే కాదు.. అన్యాయాలు, అక్రమాలు, భూకబ్జాలు, రౌడీమూకల ఆగడాలు, వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతితో పాటుగా అన్నదాతల నుంచి భూములు లాక్కోవడానికి సర్కార్ ఆడుతున్న డ్రామాలను కూడా నిర్భయంగా ఎండగడుతున్నది. అనునిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష పాత్రపోషిస్తున్నది.
నాడు నేడు తెలంగాణప్రజల పక్షాన బరిగీసి నిలబడి కొట్లాడుతున్న ఏకైక పత్రికగా నమస్తే తెలంగాణ గుర్తింపు పొందితే ఇవాళ లగచర్ల, దిలావర్పూర్, పెద్ద ధన్వాడ వంటి ప్రాంతాల్లో పంట పొలాలను చెరబట్టేందుకు కాంగ్రెస్ వేసిన పన్నాగాలపై యుద్ధభేరి మోగిస్తూ రైతులకు అండగా నిలిచింది. రైతన్నలపై సర్కారు దౌర్జన్యం ఎలా సాగుతున్నదో కథనాలు ప్రచురించి ఎండగట్టింది. చంద్రబాబు శిష్యుల ఇథనాల్ ఫ్యాక్టరీ గుట్టు రట్టుచేసింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 40 మంది రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపిస్తే కథనాలు ప్రచురించి సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లింది. జాతీయ సంఘాలను రంగంలోకి దింపింది. రాజోళి రైతుకు బేడీలు విషయాన్ని బయటపెట్టింది. యూరియా విషయంలో రైతులకు అండగా నిలిచింది. ప్రజాసమస్యలపై గళమెత్తింది. ప్రభుత్వ పెద్దల అక్రమాలపై ధ్వజమెత్తింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలు.విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే కథనాలు.ప్రభుత్వ నిర్ణయాల్లో లోపించిన పారదర్శకత, టెండర్లు, భూవ్యవహారాలు, పరిపాలనా చర్యలకు సంబంధించిన వివాదాలపై వార్తలు.ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగిన వైనాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలు, ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నాయనే విమర్శలు ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రచారం కోసం ఉపయోగిస్తున్న తీరొక్క మాటలో చెప్పాలంటే నమస్తే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను అత్యంతలోతుగా పరిశీలిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో (మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం) లబ్ధిదారుల ఎంపిక, విధివిధానాల అమల్లో ఎదురైన సవాళ్లను విస్మరించిన విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నది.
రూ. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను దశలవారీగా మాఫీ చేయడంలో వైఫల్యాలు, మూసీ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, అక్రమ నిర్మాణాల తొలగింపు అంశాలను చెండాడింది. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో చేపట్టిన కూల్చివేతలు, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రజల కండ్లకు కట్టినట్టుగా చూపింది.
మారిన ప్రభుత్వ విధానాలు, భారీ అప్పులు, పడకేసిన సంక్షేమ పథకాలు, కుల గణన పేరుతో బీసీలకు జరిగిన అన్యాయాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడంపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్లు, నివేదికల్లోని లోపాలను ఎత్తి చూపింది. సర్కార్ కక్ష సాధింపు చర్యలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎలుగెత్తి చాటుతున్నది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన గ్రూప్-1 తదితర ఉద్యోగ నియామకాల్లో లోపాలు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయం, పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు జీవో 46 పై అభ్యర్థుల ఆందోళనలు. విద్య, వైద్య రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యాలు..ఇలా ఎన్నో ఎన్నెన్నో కథనాలను వెలుగులోకి తెస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నది నమస్తే తెలంగాణ.
మళ్లీ కుట్రలు
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం తిరిగి ముంచుకొస్తున్నది. స్వయంపాలనలో ఉన్న తెలంగాణపై మళ్లీ పరాయి శక్తుల పెత్తనం చెలాయించడానికి వరుస దండయాత్రలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, ఉద్యమ చరిత్రను దెబ్బతీసే దిశగా వ్యూహ రచనలు సాగుతున్నాయి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పుచేయడం నుంచి ఆరంభమైన దుశ్చర్యలు ప్రాంతేతర వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడం వరకు వెళ్లాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నాలు భారీగానే జరుగుతున్నాయి. ఈ ఉత్పాతాన్ని నివారించడానికి మరో ఉద్యమం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవిష్యత్తును కాపాడుకోవడానికి అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిందేనని తెలంగాణ సమాజం మథనపడుతున్నది. తెలంగాణ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసం నమస్తే తెలంగాణ తనవంతుగా సాగించాల్సిన పోరాటం ఇంకా చాలానే ఉన్నది.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి, కరీంనగర్)
-కడపత్రి ప్రకాశ్‌రావు
8096677022