– గీతన్నల చైతన్య యాత్రలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
చౌటుప్పల్, ఆగస్టు 08 : ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ్లకు, కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో రాజకీయ సమాధి తప్పదని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర’ భువనగిరి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చేరుకుంది. ఆంథోల్ మైసమ్మ గుడి వద్ద స్థానిక సర్పంచ్ గిర్కంటి నిరంజన్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. దండు మల్కాపురం, ఎల్లగిరి, కొయ్యలగూడెం, చౌటుప్పల్ పట్టణంలో యాత్ర కొనసాగింది. పట్టణంలోని సర్వాయి పాపన్న, బొమ్మగాని ధర్మబిక్షం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లె రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సబ్బండ వర్గాలను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లో గౌడ్ లకు కేసీఆర్ ప్రారంభించిన రిజర్వేషన్లు 15 శాతం నుండి 25 శాతానికి పెంచాలని, ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా ను రూ 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని మోసం చేసిందని మండిపడ్డారు.
పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా రూ.20 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని, వాటి సంరక్షణకు కల్లుగీత కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన విప్లవ యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పడానికి రూ.3 కోట్లు గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందని, తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య, జయరాములు గౌడ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.